
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం ద్వారా కూటమి ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారని, దానికి బదులివ్వలేక ఎల్లో మీడియా 'ఈనాడు' ద్వారా ఒక అబద్దపు కథనాన్ని రాయించారని మండిపడ్డారు.
బేతాళ కథల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కోట్ల పేజీల సమాచారంను డిలీట్ చేశారంటూ ఈనాడులో రాయించడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఒకవైపు డేటా మొత్తం నాశనం చేశారంటూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ లో డేటాను సేకరించామనడం చూస్తుంటే చేసిన తప్పులను ఎలా కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రికేయ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. అలాగే తన ఎక్స్ వేదికగా కూడా ఆ ప్రశ్నలను సామాజిక మాధ్యమం ద్వారా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపించారు. వీటికి సమాధానాలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే తాజాగా లిక్కర్ స్కామ్ అంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెబుతున్న బేతాళ కథలు, కాకమ్మకథలను కూడా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి, చట్టాలను ఉల్లంఘించి, దర్యాప్తు సంస్థలను చేతుల్లోకి తీసుకుని, అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ నిలదీశారు.
అసలు లిక్కర్ కుంభకోణంకు పాల్పడింది ఎవరూ, డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరూ, వాటి సామర్థ్యంను పెంచింది ఎవరూ, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ప్రివిజైల్ ఫీజు కింద రూ.1300 కోట్లు మాఫీ చేసింది ఎవరూ, హేతుబద్దత లేకుండా సీఎంకు కావాల్సిన డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది ఎవరూ అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో నోట్ ఫైళ్ళలపై సీఎంగా చంద్రబాబు, ఆనాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్‌లో ఎక్కడైనా మా సంతకాలు ఉన్నాయా అని నిలదీశారు.
బదులివ్వలేక బురదచల్లే యత్నం
వైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వలేక ఎల్లో మీడియా ఈనాడును అడ్డం పెట్టకుని బురదచల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీపై విషం చిమ్మడమే తన లక్ష్యంగా పెట్టకుని దిగజారుడు రాతలు రాసే పచ్చపత్రిక ఈనాడు వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన లిక్కర్ వ్యవహారాల్లో మొత్తం డెటా డిలీట్ చేశారని, మెగా బైట్, జీబీ, టెర్రాబైట్ అంటే ఎంత, ఒక్కో దానికి ఎన్ని పేజీల ప్రింట్ బయటకు వస్తుందో చెబుతూ ఈ కథనంలో అనేక అబద్దాలను వండి వార్చారు. మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ? దేనిని బట్టి లిక్కర్ స్కామ్ అంటున్నారని అడిగితే, దానికి సమాధానం చెప్పకుండా ఈనాడు పత్రిక వింత కథనాన్ని ప్రచురించింది. 375.80 కోట్ల పేజీల సమాచారంను తొలగించారని అత్యంత ఆశ్చర్యం కలిగించేలా తన కథనంలో ఆరోపించింది.
అయినా కూడా ప్రభుత్వం అతికష్ట మీద బ్యాక్ ఎండ్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ నిర్ధారించింది. తలాతోక లేకుండా ఈనాడు పత్రిక రాసిన ఈ కథనం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక వైపు మొత్తం సమాచారమే లేదంటూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ లో సమాచారం వచ్చిందని చెప్పడం వారి తెంపరితనంకు నిదర్శనం. ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆయా సంస్థలు ఇచ్చిన డేటాను అంతర్గత సాఫ్ట్‌వేర్ సిస్టం, ఒరాకిల్ ఫైనాన్సియల్, ఎస్ఏపీ వంటి వాటిని వ్యవస్థీకృతంగా మ్యానిపిలేట్ చేశారని రాశారు. ఈ సమాచారాన్ని బ్యాక్ ఎండ్‌లో వెరిఫై చేస్తే పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయని రాశారు. ప్రభుత్వ వద్ద ఎటువంటి సమాచారం లేకుండా, బ్యాచ్‌ఎండ్ నుంచి తమకు నచ్చినట్లుగా సమాచారంను తయారు చేసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది.
సమాచారం డిలీట్ చేస్తే చర్యలేవీ?
గత ప్రభుత్వానికి సంబంధించి లిక్కర్ వ్యవహారాల సమాచారంను అధికారిక ఫైళ్ళ నుంచే డిలీట్ చేస్తే, అందుకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ అధికారులు, లిక్కర్ సంస్థలపై సమాచారం డిలీట్ చేశారని ఎందుకు కేసులు నమోదు చేయలేదు? కోట్ల పేజీల సమాచారం నాశనం చేశారని చెబుతుంటే, ఈ ప్రభుత్వం దానిని ఎందుకు ఉదాసీనంగా వదిలేసింది? అంటే అసలు సమాచారంను నాశనం చేశారనేదే పచ్చి అబద్దం. ప్రభుత్వ విభాగాల్లో ఒకచోట కాకపోతే మరోచోట కచ్చితంగా సమాచారం ఉంటుంది. దానిని మొత్తంగా నాశనం చేశారంటే అందుకు ఎక్సైజ్ కమిషనర్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితే తప్ప జరగదు. అలా జరిగితే ప్రభుత్వంకు చాలా సులువుగానే తెలిసిపోతుంది, మొత్తం వ్యవస్థపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదేదీ లేకుండా కోట్ల పేజీల సమాచారం మాయం అనేస్తే ఎలా? ఈ మాత్రం కూడా ఈనాడు పత్రికకు తెలియదా?
లిక్కర్ అవినీతిపై కూటమి నేతల తలోమాట
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ను జరిగినట్లుగా, దానిలో రూ.వేల కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లుగా ఎన్నికల ముందు నుంచి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత కూడా కూటమి నేతలు మాట్లాడారు. ఇలా మాట్లాడిన ప్రతి నాయకుడు వారికి తోచిన రీతిలో లిక్కర్ అవినీతిపై లెక్కలు చెప్పారు. లిక్కర్ విధానంపై చంద్రబాబు 25.3.2022న మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.10వేల కోట్లు అని అన్నారు. ఆయన వదిన పురంధేశ్వరీ 09.10.24న మాట్లాడుతూ లిక్కర్ కుంభకోణంలో ఏటా రూ.25వేల కోట్లు జగన్ కు చేరాయని ఆరోపించారు.
మంత్రి అచ్చెన్నాయుడు ఏడాదికి రూ.లక్ష కోట్లు అని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.41వేల కోట్లు అని ఆరోపించారు. 25.7.2024న చంద్రబాబు అసెంబ్లీలో రూ.18 వేల కోట్లు నష్టం జరిగిందని, అదే రోజు పవన్ కళ్యాణ్ రూ.30 వేల కోట్లు దోచుకున్నారని అసెంబ్లీలో మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ లోక్ సభలో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్‌లో రూ.30వేల కోట్లు అవినీతి అని అన్నారు. ఎంపీ కృష్ణదేవరాయులు మాట్లాడుతూ రూ.18 వేల కోట్లు కుంభకోణం, దానిలో రూ.4000 కోట్లు దేశం దాటి పోయాయంటూ మాట్లాడారు. ఇలా కూటమి పార్టీల నేతలు ఇష్టారాజ్యంగా లిక్కర్ పాలసీపై తలో విధంగా మాట్లాడారు. ఒకరు మాట్లాడే దానికి, మరోకరు మాట్లాడేదానికి పొంతన లేదు. అంటే నిజంగా లిక్కర్ స్కామ్ అనేదే లేకపోవడం వల్ల వీరంతా తమకు తోచిన విధంగా మాట్లాడారనే అర్థమవుతోంది.
