
విశ్లేషణ
వైఎస్సార్ రూపొందించిన విధానాలు, అమలు చేసిన పథకాలు ఆయన్ని జనం గుండెల్లో చిరంజీవిని చేశాయి. ఒక నాయ కుడి దూరదృష్టి, ఆయన దార్శనికత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది. ప్రభుత్వాలు మారినా ఆయన పథకాల పేర్లు మారాయేమో కానీ వాటి కొనసాగింపు మాత్రం ఆగలేదు. అదే వైఎస్ ఘనత. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి ఆయన రూపొందించిన ‘జలయజ్ఞం’ కొనసాగింపే అంతిమ పరిష్కారం.
వైఎస్సార్ జలయజ్ఞం ఉభయ తెలుగు రాష్ట్రాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. కారణాలేవైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి జలాలపై ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలకులకు దూరదృష్టి లేని కారణంగా... వెనుకబడిన ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ, రాయ లసీమ, ప్రకాశం, పల్నాడు తీవ్రంగా నష్టపోయాయి. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల విభజనకు ఇలాంటి అంశాలు ప్రధాన కారణ మయ్యాయి. వైఎస్సార్ తన రాజకీయ ప్రస్థానంలో వెనుకబడిన రాయలసీమ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
ఒక ప్రాంతీయ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుడి ఆలోచనలు సహజంగా సంకుచితంగా ఉంటాయి. కానీ రాయల సీమ ఉద్యమంలో పాల్గొన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అందుకు భిన్నంగా విశాల దృక్పథంతో వ్యవహరించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. రాయలసీమకు సాగు, తాగు నీటి కోసం ఉద్యమించినప్పటికీ, అదే క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత... తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంతో పాటు దక్షిణ తెలంగాణ, ప్రకాశం, పల్నాడుతో పాటు... అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నిప్రాంతాలకు జల న్యాయం చేయడం కోసం రూపొందించిందే జల యజ్ఞం. అది పోలవరమైనా, పులిచింతలైనా, పాలమూరు–రంగారెడ్డి అయినా, పోతిరెడ్డిపాడు వెడల్పైనా, వెలుగొండ, దుమ్మగూడెం టెయిల్ పాండ్ అయినా... వైఎస్సార్ విశాల దృక్పథానికి నిదర్శనం.
జల సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా బనకచర్లకు తరలించాలని ప్రణాళికలు రూపొందించింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకుని అనుమతులు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
గోదావరి నుంచి బనకచర్లకు నీటిని తరలించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాయలసీమలో నీళ్లు లేవనే కారణంతో. పుష్క లంగా నీళ్లున్న గోదావరి నుంచి అత్యంత వ్యయప్రయాసలతో నీళ్లను రాయలసీమకు తరలించాలనే ఉద్దేశ్యంతో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. పరిమిత ఖర్చుతో వైఎస్సార్ దుమ్మగూడెం టెయిల్‌పాండ్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు కుడి కాలువ ద్వారా నీటిని తరలించవచ్చు. అదే విధంగా దుమ్ము గూడెం టెయిల్‌పాండ్ పథకాన్ని అమలు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని తరలించడం ద్వారా... తెలంగాణ అవసరాలు తీర్చొచ్చు. అప్పుడు రాయలసీమలోని శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు, ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉండదు.
వైఎస్సార్ జలయజ్ఞాన్ని యథాతథంగా అమలు చేస్తే, గోదావరి నీళ్లు బనకచర్లకు భారీ ఖర్చుతో ఎత్తిపోయాల్సిన అవసరం ఉత్పన్నం కాదు. అదే సమయంలో గోదావరి నీటితో తెలంగాణ, కృష్ణా డెల్టా అవసరాలు తీరిపోతాయి. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ పథకం అమలు అయితేనే ఇవన్నీ నెరవేరుతాయి. ఖర్చు కూడా పోలవరం, బనకచర్లతో పోల్చుకుంటే చాలా తక్కువ. శాశ్వత పరిష్కారంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆస్కారం ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఈ పథకం... విడిపోయిన తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులను అధిగమించగలిగిన సామర్థ్యం కలిగి ఉంది.
రాయలసీమ ఎత్తిపోతలకు స్ఫూర్తి
రాయలసీమ జల సమస్య పరిష్కారానికి ప్రధాన ఆటంకం... ఈ ప్రాంతానికి ఉపయోగపడే నీటి ప్రాజెక్టులు లేకపోవడం. ఇప్పటికే ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కేవలం బ్యాక్ వాటర్ వాడుకునే దుఃస్థితి నెలకొని ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ద్వారా తెలంగాణ, కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలి. మరో వైపు శ్రీశైలంలో 854 అడుగులు నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డి పాడుకు నీరు అంది గాలేరు–నగరి, ఎస్‌ఆర్‌బీసీ, చెన్నైలకు 15 టీఎంసీల నీరు విడుదలకు అవకాశం ఉంటుంది. హంద్రీ నీవాకు మాల్యాల ద్వారా నీరు విడు దల చేయాలంటే, శ్రీశైలంలో 840 అడుగుల నీరు ఉండాలి. ప్రకృతిలో ఏర్పడిన అసమతుల్య పరిస్థితుల వల్ల కృష్ణా, తుంగభద్రలలో నీటి ప్రవాహం పుష్కలంగా ఉన్నా, ప్రవహించే రోజులు గణనీయంగా పడిపోతున్నాయి.
శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ మాత్రమే తీసుకునే పరిస్థితుల్లో వరద ప్రవాహం తక్కువ రోజులు ఉండటం, శ్రీశైలం నుంచి అనివార్యంగా నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేయాల్సి రావడం వల్ల శ్రీశైలంలో రాయలసీమ ప్రాజెక్టులు నీరు అందుకునే కనీస నీటి మట్టం నిర్వహణ కష్టతరంగా మారింది. మరోవైపు అధికారిక నీటి కేటాయింపుల సాంకేతిక సమస్య వల్ల వరద, మిగులు జలాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి రోజుల్లో పోతిరెడ్డిపాడు, మాల్యాల నుంచి నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు లేవు.
చదవండి: వైతాళికుని జననం
ఈ సమస్యకు పరిష్కారంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ నీవాకు నీళ్లు తరలించే ఆలోచన వైఎస్సార్ చేస్తే, ఆయన రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన జగన్ పరిమిత మైన రోజుల్లో శ్రీశైలం ఎగువ నుంచి పోతిరెడ్డిపాడు, బనకచర్ల మధ్య లోకి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. దురదృష్టవశాత్తు సాంకేతిక అనుమ తుల సమస్యతో మధ్యలోనే ఆగిపోయాయి. దీని ఖర్చు దాదాపు రూ. 7 వేల కోట్లు మాత్రమే. ప్రభుత్వం చొరవ చూపితే స్వల్ప కాలంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయవచ్చు. దాదాపు రూ. 10 వేల కోట్లతో 100 టీఎంసీల నీరు తరలించవచ్చు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే అనేక రెట్లు తక్కువ శ్రమ ఖర్చుతో అదే ప్రయోజనాలు పొందవచ్చు.
- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త