breaking news
Jalayagnam scheme
-
జలయజ్ఞమే తెలుగు రాష్ట్రాలకు శ్రేయస్కరం
వైఎస్సార్ రూపొందించిన విధానాలు, అమలు చేసిన పథకాలు ఆయన్ని జనం గుండెల్లో చిరంజీవిని చేశాయి. ఒక నాయ కుడి దూరదృష్టి, ఆయన దార్శనికత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది. ప్రభుత్వాలు మారినా ఆయన పథకాల పేర్లు మారాయేమో కానీ వాటి కొనసాగింపు మాత్రం ఆగలేదు. అదే వైఎస్ ఘనత. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి ఆయన రూపొందించిన ‘జలయజ్ఞం’ కొనసాగింపే అంతిమ పరిష్కారం.వైఎస్సార్ జలయజ్ఞం ఉభయ తెలుగు రాష్ట్రాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. కారణాలేవైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి జలాలపై ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలకులకు దూరదృష్టి లేని కారణంగా... వెనుకబడిన ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ, రాయ లసీమ, ప్రకాశం, పల్నాడు తీవ్రంగా నష్టపోయాయి. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల విభజనకు ఇలాంటి అంశాలు ప్రధాన కారణ మయ్యాయి. వైఎస్సార్ తన రాజకీయ ప్రస్థానంలో వెనుకబడిన రాయలసీమ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక ప్రాంతీయ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుడి ఆలోచనలు సహజంగా సంకుచితంగా ఉంటాయి. కానీ రాయల సీమ ఉద్యమంలో పాల్గొన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అందుకు భిన్నంగా విశాల దృక్పథంతో వ్యవహరించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. రాయలసీమకు సాగు, తాగు నీటి కోసం ఉద్యమించినప్పటికీ, అదే క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత... తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంతో పాటు దక్షిణ తెలంగాణ, ప్రకాశం, పల్నాడుతో పాటు... అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నిప్రాంతాలకు జల న్యాయం చేయడం కోసం రూపొందించిందే జల యజ్ఞం. అది పోలవరమైనా, పులిచింతలైనా, పాలమూరు–రంగారెడ్డి అయినా, పోతిరెడ్డిపాడు వెడల్పైనా, వెలుగొండ, దుమ్మగూడెం టెయిల్ పాండ్ అయినా... వైఎస్సార్ విశాల దృక్పథానికి నిదర్శనం.జల సమస్యకు శాశ్వత పరిష్కారంప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా బనకచర్లకు తరలించాలని ప్రణాళికలు రూపొందించింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకుని అనుమతులు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.గోదావరి నుంచి బనకచర్లకు నీటిని తరలించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాయలసీమలో నీళ్లు లేవనే కారణంతో. పుష్క లంగా నీళ్లున్న గోదావరి నుంచి అత్యంత వ్యయప్రయాసలతో నీళ్లను రాయలసీమకు తరలించాలనే ఉద్దేశ్యంతో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. పరిమిత ఖర్చుతో వైఎస్సార్ దుమ్మగూడెం టెయిల్‌పాండ్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు కుడి కాలువ ద్వారా నీటిని తరలించవచ్చు. అదే విధంగా దుమ్ము గూడెం టెయిల్‌పాండ్ పథకాన్ని అమలు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని తరలించడం ద్వారా... తెలంగాణ అవసరాలు తీర్చొచ్చు. అప్పుడు రాయలసీమలోని శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు, ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉండదు.వైఎస్సార్ జలయజ్ఞాన్ని యథాతథంగా అమలు చేస్తే, గోదావరి నీళ్లు బనకచర్లకు భారీ ఖర్చుతో ఎత్తిపోయాల్సిన అవసరం ఉత్పన్నం కాదు. అదే సమయంలో గోదావరి నీటితో తెలంగాణ, కృష్ణా డెల్టా అవసరాలు తీరిపోతాయి. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ పథకం అమలు అయితేనే ఇవన్నీ నెరవేరుతాయి. ఖర్చు కూడా పోలవరం, బనకచర్లతో పోల్చుకుంటే చాలా తక్కువ. శాశ్వత పరిష్కారంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆస్కారం ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఈ పథకం... విడిపోయిన తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులను అధిగమించగలిగిన సామర్థ్యం కలిగి ఉంది.రాయలసీమ ఎత్తిపోతలకు స్ఫూర్తిరాయలసీమ జల సమస్య పరిష్కారానికి ప్రధాన ఆటంకం... ఈ ప్రాంతానికి ఉపయోగపడే నీటి ప్రాజెక్టులు లేకపోవడం. ఇప్పటికే ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కేవలం బ్యాక్ వాటర్ వాడుకునే దుఃస్థితి నెలకొని ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ద్వారా తెలంగాణ, కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలి. మరో వైపు శ్రీశైలంలో 854 అడుగులు నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డి పాడుకు నీరు అంది గాలేరు–నగరి, ఎస్ఆర్బీసీ, చెన్నైలకు 15 టీఎంసీల నీరు విడుదలకు అవకాశం ఉంటుంది. హంద్రీ నీవాకు మాల్యాల ద్వారా నీరు విడు దల చేయాలంటే, శ్రీశైలంలో 840 అడుగుల నీరు ఉండాలి. ప్రకృతిలో ఏర్పడిన అసమతుల్య పరిస్థితుల వల్ల కృష్ణా, తుంగభద్రలలో నీటి ప్రవాహం పుష్కలంగా ఉన్నా, ప్రవహించే రోజులు గణనీయంగా పడిపోతున్నాయి. శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ మాత్రమే తీసుకునే పరిస్థితుల్లో వరద ప్రవాహం తక్కువ రోజులు ఉండటం, శ్రీశైలం నుంచి అనివార్యంగా నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేయాల్సి రావడం వల్ల శ్రీశైలంలో రాయలసీమ ప్రాజెక్టులు నీరు అందుకునే కనీస నీటి మట్టం నిర్వహణ కష్టతరంగా మారింది. మరోవైపు అధికారిక నీటి కేటాయింపుల సాంకేతిక సమస్య వల్ల వరద, మిగులు జలాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి రోజుల్లో పోతిరెడ్డిపాడు, మాల్యాల నుంచి నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు లేవు.చదవండి: వైతాళికుని జననంఈ సమస్యకు పరిష్కారంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ నీవాకు నీళ్లు తరలించే ఆలోచన వైఎస్సార్ చేస్తే, ఆయన రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన జగన్ పరిమిత మైన రోజుల్లో శ్రీశైలం ఎగువ నుంచి పోతిరెడ్డిపాడు, బనకచర్ల మధ్య లోకి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. దురదృష్టవశాత్తు సాంకేతిక అనుమ తుల సమస్యతో మధ్యలోనే ఆగిపోయాయి. దీని ఖర్చు దాదాపు రూ. 7 వేల కోట్లు మాత్రమే. ప్రభుత్వం చొరవ చూపితే స్వల్ప కాలంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయవచ్చు. దాదాపు రూ. 10 వేల కోట్లతో 100 టీఎంసీల నీరు తరలించవచ్చు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే అనేక రెట్లు తక్కువ శ్రమ ఖర్చుతో అదే ప్రయోజనాలు పొందవచ్చు.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డిరాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
వైఎస్ హయాంలో రైతే రాజు
రైతును రాజుగా చూడాలనుకున్నారు రాజన్న. జలయజ్ఞం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించి అన్నదాత కళ్లల్లో ఆనందం నింపాలనుకున్నారు. అందుకే సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. రూ.కోట్ల నిధులు వెచ్చించి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో ప్రగతి పరవళ్లు తొక్కింది. రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. హంద్రీ–నీవా వైఎస్ చలువే.. సాక్షి, బి.కొత్తకోట: హంద్రీ–నీవా సాగు, తాగునీటి ప్రాజెక్టుల ఘనత పూర్తిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే చెల్లుతుంది. ఈ ప్రాజెక్టును 2013 డిసెంబర్‌నాటికే పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించాలని ఆయన నిర్ణయించారు. ఆయన చిత్తశుద్ధితోనే ఈఏడాది జనవరి 22న జిల్లాలోకి కృష్ణాజలాలు ప్రవేశించాయి. కాలువ పనులు పూర్తి చేసి, ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టి, రైతులకు పరిహారం అందించారు. ఏటా బడ్జెట్లో కేటాయించిన దానికంటే మించిన పనులు చేయించిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది. వైఎస్‌ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాజెక్టుపనుల కోసం అవసరమైన నిధులిచ్చారు. పథకం ప్రారంభ ఏడాది 2005–06 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో రూ.46.50కోట్లు కేటాయిస్తే..రూ.183.15కోట్ల పనులు జరిగాయి. 2006–07లో రూ.253కోట్ల కేటాయిస్తే రూ.415.45కోట్ల పనులు జరిగాయి. 2007–08లో అత్యధికంగా రూ.1,165కోట్లు కేటాయించారు. కాంట్రాక్టర్లు యుద్ధప్రాతిపదికన రూ.1,148.04కోట్ల పనులు పూర్తిచేయగలిగారు. 2009–10లో రూ.999కోట్ల కేటాయిస్తే రూ.1,364.73కోట్ల పనులు జరగడం ప్రాజెక్టు చరిత్రలో రికార్డు. వైఎస్ హయాంలో మొత్తం రూ.3,388.5కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తే రూ.4,295.1కోట్ల పనులు జరిగాయి. పనులు చేసే కాంట్రాక్టర్లకు అప్పట్లో ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉండేది. బిల్లులతో పనిలేకుండా పనులు చేశారు. ప్రధానంగా రైతులు..ప్రాజెక్టు కాలువల తవ్వకం కోసం ప్రభుత్వం పైసా పరిహారం చెల్లించకపోయినా అడ్డు చెప్పలేదు. స్వచ్ఛందంగా భూములు అప్పగించారు. (చదవండి : జనం గుండె చప్పుళ్లలో రాజన్న జ్ఞాపకం) తమకు పరిహారం మాటేలా ఉన్నా కాలువలు సత్వరమే పూర్తి కావాలన్న కాంక్ష రైతుల్లో కనిపించింది. గత జనవరి 22న జిల్లాలోకి కృష్ణా జలాలు తరలివచ్చాయి. ఈ జలాలు ప్రవహించింది వైఎస్ తవ్వించిన కాలువలోనే. అది తమ ఘనత అని టీడీపీ సంబరాలు చేసుకుంది. కాలువకు నీరు రప్పించామని అర్భాటంగా ప్రచారం చేసుకున్నారే కాని కాలువలు తవ్వించింది తామేనని చెప్పుకోలేకపోయారు. గాలేరు– నగరికి శ్రీకారం పుత్తూరు రూరల్ : కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల సాగునీరు, ప్రజల దాహార్తి తీర్చడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞంలో భాగంగా 2006 జూన్4న నగరి పట్టణంలో ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. కడపజిల్లాలో 1,55,000 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,03,500 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 1,500 ఎకరాలు అంటే మొత్తం 2,60,000 ఎకరాలకు సాగునీరు అందేలా మహానేత ఈ పథకానికి రూపకల్పన చేసారు. ఈ పథకం పూర్తయితే 20 లక్షల మందికి తాగునీరు అందడమే కాక 3.03 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతాయని అంచనా వేసారు. ప్రారంభంలో ఈ పథకం విలువ రూ. 4,620 కోట్లుగా అంచనా వేశారు. 38 శతకోటి ఘనపుటడుగుల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు జలాశయానికి తరలించి గాలేరు నగరి ప్రత్యేక వరద కాలువ ద్వారా క్షామపీడిత ప్రాంతాలకు తరలిస్తారు. 254వ కి.మీ. వద్ద చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. తదుపరి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్, పద్మసాగర్, శ్రీనివాససాగర్, వేణుగోపాల సాగర్ అక్కడి నుంచి పుత్తూరు మండలం వేపగుంట రిజర్వాయరుకు, అక్కడి నుంచి నగరి రూరల్ మండలంలోని అడవికొత్తూరులో నిర్మించే రిజర్వాయర్‌కు చేరుకుంటుంది. రైతు సంక్షేమం కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేట్టిన జలయజ్ఞం పనులు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించి దశాబ్దం పూర్తయినా కృష్ణాజలాలు నగరికి చేరలేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టును అటకెక్కించాయి. అటకెక్కిన మహానేత ఆశయం అడవికొత్తూరు శివారుల్లో గాలేరు–నగరి సుజల స్రవంతిలో భాగంగా 0.8 టీఎంసీల నీరు నిల్వచేయడానికి వీలుగా రిజర్వాయరు నిర్మాణం ప్రారంభించారు. పుత్తూరు నుంచి నగరికి వచ్చే గాలేరు నగరి కాలువ, రిజర్వాయరు నిర్మాణాలకు సుమారు రూ.120 కోట్ల మేర పనులు జరిగాయి. ప్రాజెక్టు పనుల్లో 60 శాతం మేర పూర్తి కాగా కరకట్ట పనులు, కాలువల తవ్వకాలు, కాలువల లైనింగ్ పనులు ఆగిపోయాయి. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గాలేరు నగరి ప్రాజెక్టు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. నీటిని నిల్వచేయడానికి దిట్టంగా మార్చిన నేలలు బీటలు వాలిపోతున్నాయి. మహానేత కలలు సాకారమై ప్రాజెక్టుకు నీరు చేరివుంటే నగరి, విజయపురం, నిండ్ర మండలాల్లోని పదివేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు పుష్కలంగా అందేది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తారని రైతులు, ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. సాగునీటికి కొరత లేకుండా.... సదుం:వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పాపిరెడ్డిగారిపల్లె మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. గార్గేయనదిపై పాపిరెడ్డిగారిపల్లె ప్రాజెక్టు నిర్మాణ పనులు 2004లో ప్రారంభమయ్యాయి. రూ. 8.5 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తయింది. 138. 15 ఎంసీఎఫ్‌టీల వరద నీటిని ఇందులో నిల్వ చేయవచ్చు. ఈ నీటిని పీలేరుకు తరలించేలా చేపట్టిన పంపింగ్‌హౌస్‌పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న రెడ్డివారిపల్లె, తాటిగుంటపాళెం, కంభంవారిపల్లె పంచాయతీల పరిధిలోని ç నీటి మట్టం పెరగడంతో పంటలసాగుకు నీటి కొరత లేకుండా పోయింది. ’వైఎస్ హయాంలో పనుల వివరాలు ఆర్థిక కేటాయింపు కోట్లలో జరిగిన పని కోట్లలో 2005–06 రూ.46.50 రూ.183.15 2006–07 రూ.253 రూ.415.45 2007–08 రూ.925 రూ.1,148.04 2008–09 రూ.1,165 రూ.1,364.73 2009–10 రూ.999 రూ.1,183.47 -
జలయజ్ఞంతో 19 లక్షల ఎకరాలకు సాగునీరు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జలయజ్ఞం పథకం ద్వారా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని, దీన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించి ఆ పథకంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు అన్నారు. ఆదివారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 2004లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 54 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు ప్రారంభించిందని, ఇందులో 14 పథకాలు పూర్తయ్యాయని, మరో 14 పూర్తిఅయ్యేదశలో ఉనాయని చెప్పారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలయజ్ఙాన్ని తప్పుపడుతూ ధనయజ్ఙంగా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. ై రెతు సంక్షేమానికి ఎవరెంత కృషి చేశారో టీడీపీ ప్రభుత్వం సిద్ధం చేసిన అధికార కరపత్రమే నిదర్శనమని గెజెట్ ప్రతులను చూపారు. కాంగ్రెస్ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటుందని, చంద్రబాబులా కార్పొరేట్ సంస్థల క్షేమం కోరుకోదని చెప్పారు. బాబు పాలనలో జిల్లాలో 19 వేలమందికి పింఛన్లు అందడం లేదని, నిబంధనల పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మైనారిటీలకు రూ. 2,500 కోట్లతో సబ్‌ప్లాన్ రూపొందిస్తానని చెప్పిన చంద్రబాబు 370 కోట్ల బడ్జెట్‌తోనే సరిపెట్టారన్నారు. ఇలా ప్రతి విషయంలో మోసం చేసేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడొద్దని, ప్రజల అభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు ఎం.పి.తిప్పన్న, టి.సలాం, వెంకటేశ్వరరెడ్డి, చున్నుమియ్య తదితరులు పాల్గొన్నారు. -
జలయజ్ఞంతో 20 లక్షల ఎకరాల సాగులోకి
మరో 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి బడ్జెట్ ప్రసంగంలోనూ పేర్కొన్న ఆర్థికమంత్రి సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం పథకం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 19.696 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 3.036 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2013-14 సామాజిక, ఆర్థిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. శాసనసభకు బడ్జెట్‌ను సమర్పించిన రోజునే.. సామాజిక, ఆర్థిక సర్వేను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. ‘‘13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద 52.05 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందకు తీసుకురావడం, 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా 54 ప్రాజెక్టుల (26 మేజర్, 18 మీడియం, 4 ఫ్లడ్ బ్యాంక్స్, 6 ఆధునికీకరణ ప్రాజెక్టులు)ను చేపట్టారు. ఇప్పటివరకు 13 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 14 ప్రాజెక్టులు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. జలయజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 19.696 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి కల్పించారు. 3.036 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు’’ అని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ వెల్లడి... రాష్ట్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో కూడా జలయజ్ఞం ద్వారా కొత్త ఆయకట్టు సృష్టించిన విషయాన్ని వివరించారు. ‘‘2004 నుంచి రూ. 80,620 కోట్ల అంచనా వ్యయంతో 54 భారీ, మధ్య తరహా సాగునీటి పథకాలు చేపట్టారు. అందులో 13 పథకాలు పూర్తయ్యాయి. మరో 14 పథకాలు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. ఈ పథకాల ద్వారా రూ. 19,378 కోట్ల వ్యయంతో 11.878 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా 39 పథకాలు పూర్తి కావాల్సి ఉంది. అందులో 11 పథకాల నిర్మాణం చివరి దశలో ఉంది. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తికానున్నాయి. వీటి ద్వారా 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. మరో 35,990 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది’’ అని పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించి ఆ తర్వాత కేవలం టాకింగ్ పాయింట్స్ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జలయజ్ఞంలో అవినీతి జరిగిందంటూ విమర్శలు గుప్పించిన విషయమూ విదితమే. కానీ.. వాస్తవాలను దాచిపెట్టలేక శ్వేతపత్రంలో కొత్త ఆయకట్టును యథాతథంగా పేర్కొన్నారు. అదే విషయాలను ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ పేర్కొనడం గమనార్హం.