
అభిప్రాయం
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో విధాలుగా రైతులను ఆదుకున్నారు. 2004 మే నెల రెండవ వారంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేసే నాటికి రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి దారుణంగా ఉంది. దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాద న్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో జీఓ నంబర్ 421 విడుదల చేసి, 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
రైతులు అప్పులు కట్టలేక సహకార సంఘాలు దివాళా తీసే పరిస్థితిలో వైద్య నాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి రూ. 1,800 కోట్లు ప్రభుత్వం నుండి సహకార సంఘాలకు సహాయం అందించారు. పూర్తి నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘాల్లో కలిపి రైతుల కోసం సహకార వ్యవస్థను కాపాడారు. పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించారు.
ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగు నీటి వనరులు ఉన్న భూమి సుమారుగా 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్ల రూపాయలతో కోటి ఎకరాలకు సాగునీరందిస్తానని ‘జల యజ్ఞం’ మొదలు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు ‘పోలవరం సాధనా సమితి’ పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి ఈ ప్రాజెక్టు అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి రాష్ట్రానికే వరమైన పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టడమే కాదు, జలయజ్ఞంలో చేపట్టిన అన్ని పనులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పూర్తి చేశారు.
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ప్రభుత్వానికి రైతు ఆదాయం కల్పిస్తున్నాడనీ, వ్యవ సాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనీ ఆయన సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. కానీ దాన్ని అమలు చేసి దేశానికే మార్గదర్శకులు అయ్యారు. అనేక వ్యవసాయ పరిశోధనల సమన్వయానికి ‘అగ్రి కల్చర్ టెక్నాలజీ మిషన్’ ఏర్పాటు చేశారు. 2006 జనవరి 10వ తారీఖున దాన్ని ప్రారంభిస్తూ... ‘రెండవ హరిత విప్లవం కేవలం నీటిపారుదల, గిట్టుబాటు వ్యవసాయ మూలంగానే సాధ్యమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దడం నా లక్ష్యం’ అని ప్రకటించారు.
రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే వస్తుంది. 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే వరి ధాన్యానికి పెరిగిన మద్దతు ధర కేవలం రూ. 60 మాత్రమే (రూ. 490 నుండి రూ. 550). అదే 2004 నుండి 2009 వరకు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరిగిన మద్దతు ధర రూ. 450 (రూ. 550 నుండి రూ. 1000). అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు ఇలానే పెరిగినాయి. ఆ మద్దతు ధరల కంటే ఎక్కువకు రైతులు తమ ఉత్పత్తులు అమ్ము కున్నారు. ఈ సమయంలోనే వైఎస్ ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలోనికి నెట్టివేయబడటానికి మరికొన్ని కారణాలు.. పిల్లల విద్య, కుటుంబంలోని వ్యక్తుల వైద్యం ఖర్చులు. గ్రామీణ ప్రాంతాలలో ఈ సంక్షోభం ఎక్కువగా ఉందని గ్రహించి గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 పథకాలు తెచ్చారు.
చదవండి: జలయజ్ఞమే తెలుగు రాష్ట్రాలకు శ్రేయస్కరం
అభివృద్ధి – సంక్షేమం తన రెండు కళ్ళుగా పాలన గావించి, రైతుల గుండెలలో చిరంజీవిగా మిగిలిన ఆ మహానాయకుని స్మరించుకోవడం ఆయన జయంతి సందర్భంగా మనం ఇచ్చే గౌరవం.
- ఎం.వి.ఎస్. నాగిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం (ఏపీ) అధ్యక్షుడు