
సందర్భం
దేశంలో కార్మికుల కనీస హక్కులు, పని పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. అమలులో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు ఈ పరిస్థితులను మరింతగా దిగజార్చడానికి దోహదం చేసే విధంగా ఉన్నాయి. కార్మికులూ, ఉద్యోగులూ ఐకమత్యంతో ఈ కోడ్‌లను వ్యతిరేకిస్తూ ఉద్యమించకపోతే వారి బతుకులు ఘోరంగా తయారవుతాయి.
మోదీ ప్రభుత్వం తలపెట్టినటువంటి నాలుగు కోడ్‌లు: 1. వేతన కోడ్ 2. శ్రామిక సంబంధాల కోడ్ 3. సామాజిక భద్రత కోడ్ 4. అవస రాలు, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్.
వేతన కోడ్ వలన కార్మికులు పొందు తున్నటువంటి వేతనాలు తగ్గిపోయే అవకాశం ఉంది. బత్యానికి సంబంధించి కనిష్ఠ వేతనాన్ని లెక్కించే అవకాశం కూడా లేకుండాపోతుంది. శ్రామిక కోడ్ వలన కార్మికులు సమ్మె చేసే అధికారాన్ని కోల్పోతారు. అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రత గాలిలో దీపం అవుతుంది. సామాజిక భద్రత కోడ్ వలన సంఘటిత కార్మికుల రక్షణలే దెబ్బతినే అవకాశం ఉంటే, ఇక అసంఘటిత కార్మికుల సంగతి చెప్పన వసరం లేదు.
ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్... ఇన్ స్పెక్షన్‌కు వచ్చే అధికారులు ముందుగా యాజమాన్యాలకు తాము వస్తున్నట్లు సమా చారం ఇచ్చి రావాలని చెబుతోంది. దీనివల్ల దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల వాస్తవ స్థితిగతులను అధికార్లు ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశం మృగ్యమవుతుంది. ముందస్తు సమాచారంతో యాజమాన్యాలు ఉన్న పరిస్థితులకు మసిబూసి మారేడుకాయ చేసే అవకాశం ఉంది. కార్మికులు తమ బాధలను అధికారులకు చెప్పకుండా యాజమాన్యాలు నయానో, భయానో మేనేజ్ చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ లేబర్ కోడ్‌లను అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యావత్ కార్మిక లోకం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. కార్మికుల బాగోగులను చూస్తానని చెప్పి గత ఎన్నికల సమయంలో మాటిచ్చినటువంటి చంద్రబాబు వాటన్నిటినీ తుంగలో తొక్కి కార్మిక వ్యతిరేక చట్టాలను అమలుచేయ బూనుకోవడం దారుణం.
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కార్మికులకు పెద్దపీట వేయటమే కాకుండా వారి బాగోగులను, సంక్షేమాన్ని అర్థం చేసుకుని వారికి చేయూతనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో కార్మికులు, దర్జీలు, దోబీలు, బెస్తవారు, చేనేత కార్మికులు వంటి వారికి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం అందించారు.
ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్ ఉద్యోగులను చేసి ఉద్యోగ భద్రత కల్పించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకి స్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ కార్మికులకు అండగా నిలిచింది జగన్ ప్రభుత్వం.
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల సమ్మె చేస్తే నేరం అనీ, సమ్మె చేస్తే ఫైన్ వేస్తామనీ, బీఎన్‌ఎస్ చట్ట ప్రకారం నేరంగా పరిగణించి కేసులు పెట్టి జైలుకు పంపుతామనీ యాజమాన్యాలు కార్మికులను బెదిరించే అవకాశాలు పెరుగుతాయి. అనేక సంవత్స రాలుగా పోరాటాలు జరిపి సముపార్జించుకున్న హక్కులన్నిటినీ కాల రాసేటువంటి విధానాన్ని మోదీ ప్రభుత్వం స్వస్తి చెప్పాలి. సమాన పనికి సమాన వేతనం అందించేటువంటి దిశగా కార్మికులకు అండగా నిలవాలి.
ఇందుకు భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. ఇటువంటి కార్మిక వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకించాలి. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి కార్మిక సంఘాలు సంఘటితం కావాలి!
పూనూరు గౌతమ్ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు