
సాక్షి, విశాఖపట‍్నం: విశాఖ ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు కూటమి సర్కారు నోటిఫికేషన్‌ను విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు.
స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్లాంట్‌లోని వివిధ విభాగాల నిర్వహణ కోసం ఇచ్చిన ఈఓఐలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కూటమి అధికారంలోకి వస్తే స్టీల్ ప్రైవేటీకరణ లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎక్కడకు పోయిందని అమర్‌నాథ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయాలకు పాల్పడుతున్నదని, స్టీల్ ప్లాంట్ లో 32 విభాగాలను ప్రైవేటుకు ఇచ్చేందుకు నిర్ణయం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. అన్ని విభాగాలను ప్రైవేటుకు ఇస్తూ, నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. కూటమి తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులను కొందరు నేతలు బెదిరిస్తున్నారని, భయపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఉక్కు కార్మికులు చేసిన ప్రతీ పోరాటానికి వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంత కాలం ఉక్కు పోరాటానికి పూర్తిగా సహకరించామని, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటేసినట్టే అని వైఎస్ జగన్ ముందే చెప్పారని గుర్తుచేశారు. ఉక్కు పరిశ్రమ కోసం నాడు 32 మంది ప్రాణ త్యాగం చేస్తే, నేడు కూటమి ప్రభుత్వం 32 డిపార్ట్మెంట్లను ప్రైవేటీకరణ చేస్తోందన్నారు.
గడచిన 14 నెలల కాలంలో నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, ఇప్పుడు వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి?. దీనికి ఎవరు సమాధానం చెబుతారు?. చంద్రబాబు, మోదీ సమాధానం చెబుతారా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ కార్మికులకు మూడున్నర నెలలుగా జీతాలు లేవవని, వారికి ఇవ్వాల్సిన రాయితీలన్నీ ఎత్తివేశారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైద్య సేవలు కూడా అందడం లేదన్నారు. ప్లాంట్‌నంతా ఖాళీ చేసి, కూటమి నేతలు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఎన్నడూ ఒక్క కార్మికుడిని కూడా తొలగించలేదని గుర్తుచేశారు. ఇప్పడు 1,590 మంది కార్మికుల మీద రెడ్ మార్క్ పెట్టారని, స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసిన టెంట్ ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.