
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు పాములు.. మరో వైపు కుక్కలతో కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ కార్మికులు సోమవారం విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో వెటర్నరీ కారి్మకులకు కౌన్సిల్ తీర్మానం 36 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 53 మంది కార్మికులు ఏళ్ల తరబడి పాములు, కుక్కలను పట్టుకుంటున్నారని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ విశాఖ పౌరుల భద్రత కాపాడుతున్నారని, కానీ వారి జీతాలు అతి తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని, 2024 డిసెంబర్ 11న కౌన్సిల్ సమావేశంలో వారికి ఆరోగ్య అలవెన్స్ రూ.6 వేలు పెంచుతూ తీర్మానించారని తెలిపారు. ఏడు నెలలైనా వారికి పెంచిన జీతాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏడు నెలల బకాయిలతోపాటు పెంచిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.