అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి రూబియో
విశ్లేషణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల రెండవ వారంలో చైనాను సందర్శించిన సందర్భంగా తైవాన్ విషయమై అన్న మాటలు కొన్ని అపోహలను కలిగించాయి. తన వ్యాఖ్యలను కొందరు స్థూల దృష్టితో చూసి నిజమని నమ్ముతున్నారు కూడా. తైవాన్‌కు సంబంధించి ఆయన ఇక చేతులు ఎత్తివేసినట్లేననే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్త వమో జాగ్రత్తగా పరిశీలించటం అవసరం.
మార్పున్నట్టా? లేనట్టా?
రెండు దేశాల అధ్యక్షుల మధ్య తొలి సమావేశం మే 14న జరిగినపుడు షీ జిన్‌పింగ్ తైవాన్ ప్రస్తావన చేస్తూ, తమ ప్రయోజ నాలకు ముఖ్యమైన అంశాలలోకెల్లా అతిముఖ్యమైనది తైవాన్ అనీ, అందుకోసం తాము అమెరికాతో ఘర్షణకైనా సిద్ధమనీ చెప్పారు. ఈ ప్రస్తావన సాగినంత కాలం ట్రంప్ ముఖకవళికలు బరువుగా కనిపించాయి. స్పందనలేవీ లేవు. మరునాడు స్వదేశానికి తిరిగి వెళుతుండగా విమానంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నుంచి మూడు మాటలు వినిపించాయి. అమెరికా నుంచి 9,500 మైళ్ల (15 వేల కిలోమీటర్ల) దూరంగల తైవాన్ కోసం తాము శక్తిమంతమైన చైనాతో యుద్ధం చేయలే మన్నది ఒకటి. స్వతంత్రాన్ని ప్రకటించ వద్దంటూ తాను తైవాన్ నాయకత్వానికి చెప్పానన్నది రెండు.
తైవాన్‌కు విక్రయించదలచిన ఆయుధాల విషయమై తుది నిర్ణయ మేదీ తీసుకోలేదన్నది మూడు. పోతే, చైనాకు బయలుదేరే ముందు రోజున అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, తైవాన్ విధానంలో మార్పేమీ ‘ప్రస్తుతానికి’ లేదన్నారు. చైనా అధ్యక్షుడు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు ముఖాముఖిన చేయటం, అందుకు అమెరికా వైపు నుంచి ఎన్నడూ లేనంత జాగ్రత్తతో కూడిన స్పందనలు రావటంపై సహజంగానే విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. తైవాన్, జపాన్ కలవరపడగా, అమెరికాలోని మితవాద లాబీలు విమర్శించాయి. ఇంతకూ అమెరికా తన చిరకాలపు విధానాన్ని మార్చుకునే దిశలో ఉన్నట్లా? చేతులు ఎత్తివేస్తున్నట్లా?
యుద్ధానికి దూరంతో ఏం పని?
అందుకోసం మొదట అమెరికా అధ్యక్షుని మూడు మాటలను, ఆయన విదేశాంగ మంత్రి మాటను తిరిగి చూడాలి. చైనాతో యుద్ధం చేయదలిస్తే అమెరికన్లు 15,000 కి.మీ.లు ప్రయాణించ వలసిన అవసరమే లేదు. వారికి చైనాకు పొరుగున గల జపాన్‌లో 4, దక్షిణ కొరియాలో 2, గువామ్‌లో 2 బలమైన సైనిక స్థావరాలున్నాయి. ఫిలిప్ఫైన్స్‌లో సైనిక వెసులుబాట్లున్నాయి. స్థావరాలతో సరిపోల్చగల అత్యాధునిక విమాన వాహక నౌకాదళాలను, అణ్వాయుధాలనైనా ప్రయోగించగల జలాంతర్గములను చైనా సమీపాన మోహరించగలరు. దీర్ఘశ్రేణి క్షిపణులూ ఉండనే ఉన్నాయి. అందువల్ల వేల కిలోమీటర్ల దూరమన్నది అర్థం లేని మాట. ఏమి చేస్తారన్నది రాజకీయ నిర్ణయం మాత్రమే. పైన పేర్కొన్న స్థావరాలు, నౌకా బలంతో, తైవాన్‌కు ఇప్పటికే సమకూర్చిన ఆయుధ సంపత్తితో, చైనీయులు తైవాన్‌పై దాడి చేసినట్లయితే తాము కూడా సైనిక జోక్యం చేసు కోగలమంటున్న జపాన్, ఫిలిప్ఫైన్స్‌ల ప్రకటనలతో, చైనాను ఓడించగలరా లేదా అన్నది వేరే ప్రశ్న.
కానీ, తమకు తైవాన్ అత్యంత ముఖ్యమంటున్న చైనాతో యుద్ధానికి సిద్ధపడటమన్నది రాజకీయ నిర్ణయం. ఆ నిర్ణయం మునుముందు అనేక పరిస్థితులపై ఆధార పడి ఉంటుంది. కనుక ప్రస్తుతం ట్రంప్ అన్నది తుది వాక్యం కాదు. రెండవ మాటకు వస్తే, ‘స్వాతంత్య్రం ప్రకటించవద్దని’ తైవాన్‌కు సూచించటం ఇది కొత్త కాదు. తమది ‘వ్యూహాత్మక అస్పష్టత’ అన్న మాట అమెరికా ఉపయోగిస్తున్నదే. స్వాతంత్య్రం ప్రకటించు కొండి అనరు, అసలు ప్రకటించకుండా ఒకే చైనా విధానం ప్రకారం చైనాలో విలీనమైపొండి అని కూడా అనరు. సూత్ర రీత్యా తైవాన్ చైనాలో భాగమే అయినా ఆ పని బలవంతంగా జరిగితే ఒప్పుకో బోమంటారు. తైవాన్ సంరక్షణ చట్టమంటూ చేసి వారికి ఆయు ధాలు అమ్మే విచిత్రమైన విధానాన్ని అనుసరిస్తుంటారు. అందువల్ల, తాను తైవాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించవద్దంటూ చెప్పానన్న ట్రంప్ మాట కూడా అర్థం లేనిదే.
మూడవది పెండింగ్‌లో ఉన్న ఆయుధాల విక్రయం. వాటి విలువ 14 బిలియన్ల డాలర్లు. అమెరికా అధ్యక్షుడు అన్నది ఆ విష యమై ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తైవాన్ నాయకత్వంతో మాట్లాడుతాను’ అని. అంతే తప్ప అమ్మబోము అనలేదు. ట్రంప్ ఆ మాత్రపు మాట అన్న వెంటనే ఒకవైపు తైవాన్ నుంచి, మరొకవైపు రిపబ్లికన్లతో పాటు డెమోక్రటిక్ సెనేటర్ల నుంచి ఒత్తిడులు మొద లయ్యాయి. చైనా వ్యతిరేకించినా ఆయుధాల విక్రయం జరుగు తూనే వస్తున్నది గనుక, ఈసారి కూడా కొంత వ్యవధి తర్వాత అదే జరిగితే ఆశ్చర్యపడనక్కర లేదు. ఎందుకంటే, చైనా విషయంలో, మొత్తం పసిఫిక్ విషయంలో అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలలో, వ్యూహాలలో మార్పు లేదు గనుక. కాకపోతే, ప్రస్తుత పరిస్థితులలో చైనాతో కొంత మెత్తగా వ్యవహరించాలన్నది ఒక ఎత్తుగడ అయినందున ఈ విధంగా మాట్లాడతారు.
వ్యూహం ఉండనే ఉంది!
ఆ ప్రయోజనాలు, వ్యూహాలు ఏమిటో, అందులో భాగంగా చైనాను నియంత్రించటం ఎట్లానో, అందుకు తైవాన్ అవసరం ఏమిటో 2022లో బైడెన్, తర్వాత 2025, 2026లో ట్రంప్ స్వయంగా తమ వ్యూహపత్రాలలో వివరించి చెప్పారు. వారిద్దరి కన్నా ముందే ఒబామా– ఇరాక్, అఫ్గాన్ పరాభవాల దరిమిలా ఇక తమ దృష్టి పసిఫిక్ వైపు, చైనా వైపు మళ్లటం అవసరమని ప్రతిపా దించి పోయారు. ఇదంతా లాటిన్ అమెరికా నుంచి పశ్చిమాసియా మీదుగా తూర్పు ఆసియా వరకు అమెరికా ప్రయోజనాలను, ఆధిప త్యాన్ని సుస్థిరపరచుకునే విస్తృతమైన, దీర్ఘకాలికమైన ప్రణాళికలో భాగం. అందుకోసం తైవాన్‌ను తమ ప్రభావం కింద ఉంచుకోవ టమే కాదు, ఇంకా అనేకం చేయవలసి ఉంటుంది. ఆ వివరాలు కూడా కొన్ని పైన పేర్కొన్న వ్యూహ పత్రాలలో పేర్కొన్నారు.
అందువల్ల, తైవాన్ గురించి ఇపుడు ట్రంప్ ఏమన్నారో చూసి ఆయన చేతులు ఎత్తేశారంటూ అపోహ పడటం పొరపాటు అవు తుంది. చారిత్రకంగా తమ దేశంలో భాగమైన తైవాన్‌ను ఎప్పటికైనా నయానో భయానో విలీనం చేసుకోవటం చైనా లక్ష్యం. హాంకాంగ్, మకావూ వలెనే తైవాన్‌లోనూ ఒక దేశం రెండు వ్యవస్థల పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమని చైనా గతంలోనే ప్రకటించింది. ఆ విధంగా ‘శాంతియుత విలీనానికి’ అడ్డంకులు కల్పించరాదని అమె రికాను కోరుతున్నది. అందుకు తైవాన్ ప్రతిపక్షం సుముఖత చూపు తుండగా, అధికారపక్షం నిరాకరిస్తున్నది. ఆ పార్టీకి అమెరికా ప్రోత్సాహం ఉంది. ఈ మొత్తం పరిస్థితులు ఎట్లా పరిణమించేదీ భవిష్యత్తులో చైనా, అమెరికాల ఆర్థిక, సైనిక, రాజకీయ బలాబలాలు ఎట్లా మారుతూ పోగలవన్న దానిపైనే ఆధారపడి ఉండవచ్చు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


