సమ్రాట్‌ చౌధరీ (బిహార్‌ సీఎం) రాయని డైరీ | Rayani Diary of Bihar CM Samrat Chaudhary | Sakshi
Sakshi News home page

సమ్రాట్‌ చౌధరీ (బిహార్‌ సీఎం) రాయని డైరీ

Jun 14 2026 12:42 AM | Updated on Jun 14 2026 12:42 AM

Rayani Diary of Bihar CM Samrat Chaudhary

మాధవ్‌ శింగరాజు

నా నివాస గృహ కార్యాలయం నుంచి, సమీపంలోనే ఉన్న సచివాలయానికి కాలినడకన వెళ్లటం కోసం నేను వేగంగా మెట్లు దిగుతున్నప్పుడు నా పైన దాదాపుగా ఒక మెరుపు దాడి వంటిదేదో జరిగినట్లయింది! కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆ ప్రాంగణంలోని గుబురు చెట్ల కొమ్మల పైనుంచి దుమికినట్లుగా మీడియా ప్రతినిధి ఒకరు ఒక్క గెంతున నా మీదకు వచ్చి పడ్డాడు! ఆ హఠాత్ఘటనకు నాతో పాటుగా, ఒక అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, నా కోసం వేచి చేస్తున్న ఒక విద్యాసంస్థ డీన్‌... ఎక్కడి వాళ్లు అక్కడే స్తంభించిపోయారు. ‘‘సమ్రాట్‌జీ, బిహార్‌ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించి జూన్‌ 15కి రెండు నెలలు పూర్తవుతాయి. ఈ రెండు నెలల్లో మీరేం సాధించారు?’’ అని అడిగాడు, ఆ ‘ఒక్క ఊపున వచ్చి పడిన’ మీడియా ప్రతినిధి. అతడి వైపు విస్మయంగా చూశాను.

‘‘మిత్రమా, నేను ఏప్రిల్‌ 15న బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మీరు ఏప్రిల్‌ 16న వచ్చి, ‘మీరీ 24 గంటల్లో ఏం సాధించారు?’ అని నన్ను అడగవలసిన ప్రశ్నను... రెండు నెలల తర్వాత ఇప్పుడు నింపాదిగా వచ్చి, ‘మీరేం సాధించారు?’ అని అడుగుతున్నారు!’’ అన్నాను, నవ్వుతూ. ‘‘కానీ సీఎం సార్‌... కేవలం 24 గంటల్లో ఏమౌతాయి చెప్పండి?’’ అన్నాడు ఆ మీడియా ప్రతినిధి కూడా నవ్వేస్తూ. ‘‘24 గంటల్లో ఏమౌతాయి అని మీరు అంటున్నారు. కానీ, చాలానే అవుతాయి. బిహార్‌లో ఈ 70 ఏళ్లలో చట్టం తన పని తాను చేసుకుపోయింది. నేను వచ్చాక చట్టం తన పని తాను 24 గంటల్లోనే చేసుకుపోతోంది. గమనించే ఉంటారు’’ అన్నాను. ‘‘అవును సీఎం సార్‌. మీరు వచ్చాక 12 ఎన్‌ కౌంటర్లు జరిగాయి. ప్రతి ఎన్‌కౌంటరూ 24 గంటల్లోనే జరిగిపోయింది. కానీ... ఇవన్నీ పోలీసుల విధి నిర్వహణల కిందికే కదా వస్తాయి, సీఎంగా మీరేదైనా సాధించటం కిందికి వస్తాయా?’’ అని అడిగాడు. నా నడకను ఆపాను. అతడూ ఆగాడు. 

‘‘పోలీసులకైనా స్వేచ్ఛ ఇస్తేనే కదా వాళ్లు 24 గంటల్లో ఏదైనా చేయగలరు! వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వటం కంటే ఒక సీఎం సాధించ వలసింది ఏం ఉంటుంది?!’’ అని అన్నాను. సచివాలయం దగ్గర పడింది. ‘‘సరే మిత్రమా, కలుద్దాం. సోమవారం మధ్యాహ్నంగానీ, సాయంత్రంగానీ ప్రెస్‌ మీట్‌ ఉండొచ్చు’’ అన్నాను, లోపలికి నడుస్తూ. ‘‘శ్రీమతి రబ్డీదేవిని సర్క్యులర్‌ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయించే విషయం మీదనేనా సీఎం సార్, ఆ ప్రెస్‌ మీట్‌?’’ అని అడిగాడతడు! నవ్వాను. ‘‘సర్క్యులర్‌ రోడ్‌ బంగళాను ఖాళీ చేయించటం మీద, హార్డింగ్‌ రోడ్‌లో వేరే బంగళాను కేటాయించటం మీద ప్రెస్‌ మీట్‌లు ఉంటాయా మిత్రమా?’’ అన్నాను, సచివాలయంలోకి వచ్చేస్తూ.

క్యారిడార్‌లో లేషీ సింగ్‌ ఎదురొచ్చారు. నవ్వాను. ఆమె నవ్వలేదు! ‘‘మీ కోసమే చూస్తున్నా సమ్రాట్‌జీ. శ్రీమతి రబ్డీ దేవికి మనం ఇచ్చిన రెండో గడువు కూడా ఆదివారంతో ముగుస్తోంది. ఆమె తన బంగళాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని అంటున్నారు’’ అన్నారు టెన్షన్‌గా! లేషీ భవన నిర్మాణ శాఖ మంత్రి. నేరుగా నా ఛాంబర్‌ లోకి వచ్చి, డీజీపీ వినయ్‌ కుమార్‌కి ఫోన్‌ చేసి, ‘‘ఏం చేద్దాం?’’ అని అడిగాను. ‘‘ఈసారికి చట్టాన్ని తన పని తను చేసుకుపోనిద్దాం సర్‌... చట్టానికి 24 గంటల డెడ్‌లైన్‌ లాంటిది ఏమీ పెట్టకుండా’’ అన్నాడు. ‘‘గుడ్‌’’ అని ఫోన్‌ పెట్టేశాను.  వినయ్‌ కుమార్‌ ఖరగ్‌పూర్‌ ఐఐటీ స్టూడెంట్‌. ఒక ఐపీఎస్, ఐఐటీ నుంచి వచ్చాడంటే అతడు డెడ్‌లైన్‌ ఏమీ లేకుండానే డెడ్‌లైన్‌ లోపలే పని పూర్తి చేయగలిగినవాడై ఉంటాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement