అభిజీత్‌ దీప్కే (కాక్రోచ్‌ జనతా పార్టీ) రాయని డైరీ | Rayani Diary of Abhijeet Deepak Cockroach Janta Party | Sakshi
Sakshi News home page

అభిజీత్‌ దీప్కే (కాక్రోచ్‌ జనతా పార్టీ) రాయని డైరీ

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

Rayani Diary of Abhijeet Deepak Cockroach Janta Party

మాధవ్‌ శింగరాజు

కొన్నిసార్లు అవకాశాలను భగవంతుడు కల్పిస్తాడు. మరికొన్నిసార్లు భారత ప్రధాన న్యాయమూర్తి! నిజం! నాకసలు ఏ ఉద్యమమూ చేపట్టాలని లేదు. కానీ, దైవం ఏ రూపంలోనో వచ్చి, ఇదిగో ఇలా ప్రభుత్వాలతో తలపడమని పిలుపును ఇస్తాడు కావచ్చు... ఉమర్‌ ఖాలిద్‌కు ఇచ్చినట్లుగా! ఖాలిద్‌ ఆరేళ్ల తర్వాత తీహార్‌ నుండి మూడు రోజుల బెయిల్‌ మీద బయటికి వచ్చి జూన్‌ 1 నుంచి 3 వరకు తల్లికి తోడుగా ఉండబోతున్నాడు... ఈ లోపు ఆ మూడు రోజుల బెయిలైనా రద్దు కాకుండా ఉంటే!

ఢిల్లీలో అల్లర్లకు కుట్ర పన్నాడని ‘ఉపా’ కింద ఉమర్‌ ఖాలిద్‌ని 2020లో అరెస్ట్‌ చేసి కస్టడీలో ఉంచారు. ఇప్పుడు నేను ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ని పెట్టి నిరుద్యోగ యువకుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నానని నా పైన ‘ఉపా’ పెట్టినా చేసేదేం లేదు!! రెండు రోజులు ఆగితే ఇండియా వెళ్లేవాడిని. నాలుగు రోజులు ఇండియాలో ఉండి, తిరిగి బోస్టన్‌ వచ్చేసేవాడిని.

బోస్టన్‌ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్‌ రిలేషన్స్‌లో రెండేళ్ల మాస్టర్స్‌ డిగ్రీ చేసొచ్చిన భారతీయ యువకుడికైనా స్వదేశంలో ఎక్కడో ఒక చోట చిన్న ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం లేదు. ఉండటానికైతే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మానాన్న ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఛత్రపతి శంభాజీ నగర్‌లోని మా ఇంటికి వెళ్లటానికి లేదు.

‘‘ఎందుకొచ్చిన పిచ్చి పని జీత్‌! ఆ ఆన్‌లైన్‌ ఆటలు ఆపేసెయ్‌’’ అని అమ్మ అంటోంది. ‘‘అమ్మా... ఇన్‌స్టాలో వారం రోజుల్లో నాకు 2 కోట్ల మంది ఫాలోవర్స్‌...’’ అన్నాను నవ్వుతూ. ‘‘అదేదో వారానికి ఇంత జీతం అని చెబుతున్నావేంటి జీత్‌!!’’... అమ్మ నుంచి ఫోన్‌ లాక్కొని నాన్న! ‘‘జీత్, మన ఇంటి చుట్టుపక్కల నిన్నటి నుంచి ఎవరో కొత్తవాళ్లు  కనిపిస్తున్నార్రా’’... నాన్న నుంచి ఫోన్‌ లాక్కొని అమ్మ. ‘‘అమ్మా... నాకేం కాదు’’ అన్నాను.‘‘కానీ, ఇక్కడ అంతా అంటున్నారు... మీ జీత్‌ను అక్కడే అమెరికాలో ఉండిపొమ్మని చెప్పండి, ఇండియా వస్తే అరెస్ట్‌ చేసి తీహార్‌ జైలుకు తీసుకెళతారు... అని!’’అమ్మ ఏడుస్తూ చెబుతోంది.

‘‘అమ్మా ఏం కాదు, ఊర్కో’’ అంటున్నాను, అమ్మ ఏడుస్తూనే ఉంది. అమ్మ నుంచి నాన్న ఫోన్‌ లాక్కోవటం లేదు! అంటే, నాన్న అక్కడి నుంచి వెళ్లిపోయారా? ఈ నాన్నలెందుకు కొడుకుల మీది కోపాన్ని తల్లుల మీద ప్రదర్శిస్తారు?! అన్‌లైన్‌ ఉద్యమాలు ఊరికే బొద్దింకల్లా పుట్టుకు రావు. వాటి ఆవిర్భావం వెనుక ఒక ఆవేదన ఉంటుంది. ఒక మహావేశం ఉంటుంది. సీజేపీ అనే మా ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ కూడా అలాగే ఉద్యమ రూపం తీసుకుంది. నిరుద్యోగుల ఆత్మగౌరవ సాధన సీజేపీ ప్రధాన లక్ష్యం, ప్రధాన పోరాటం.

ఈ లక్ష్యాన్ని ఏర్పరిచింది, పోరాటానికి దారి చూపింది... సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి! ఆయనకు మా ఉద్యమ ధన్యవాదాలు. నిరుద్యోగులను ఆయన బొద్దింకలతో పోల్చారు! వాళ్లకు ఏ ఉద్యోగమూ దొరకదు అన్నారు! వారిలో కొందరు సోషల్‌ మీడియా కార్యకర్తలు అవుతారు అన్నారు. కొందరు ఆర్టీఐ యాక్టివిస్ట్‌ల అవతారం ఎత్తుతారు అన్నారు. అలా అని, ప్రపంచ భారతీయ బొద్దింకలన్నిటినీ ఆయనే ఏకం చేశారు. నిరుద్యోగులను బొద్దింకలు అన్నందుకు ‘చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా’ మీద ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’కి కోపమేం లేదు. అసలు ఆయన మీద గౌరవంతోనే మేము మా పార్టీకి ముందనుకున్నట్లుగా ‘కాక్రోచ్‌ జనతా ఇంపాక్ట్‌’ అనే పేరు పెట్టుకోలేదు. పెట్టుకుని ఉంటే అప్పుడది ‘సీజేఐ’ అయి ఉండేది. ‘సీజేఐ’ అన్నప్పుడల్లా ‘చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా’ అని అన్నట్లుగానూ ఉండేది!! 

Advertisement
 
Advertisement
Advertisement