MV Ramana Reddy: ఆయనే ఒక చరిత్ర

MV Ramana Reddy Birth Anniversary: Biography, Political Career, Ideology - Sakshi

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఎంవీ రమణారెడ్డి (ఎంవీఆర్‌) పేరు వింటున్నాను. మా ఊరు ప్రొద్దుటూరుకు పక్కనే ఉండటంతో రమణారెడ్డి గురించి ప్రచారమయ్యే ప్రతి విషయం నాకూ తెలిసేది. ప్రొద్దుటూరులోని షావుకార్లకు, మిల్లుల యజమానులు ఆయనంటే భయపడేవారు. బీదలకు, కార్మికులకైతే ఆయన దేవుడు. రాయలసీమ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. దాన్ని కష్టాల నుంచి విమోచనం చేయడానికి ఉద్యమించాడు. ముల్కీ ఉద్యమం 1968లో మర్రి చెన్నారెడ్డి వల్ల తెలంగాణా ఏర్పాటు ఉద్యమంగా ఊపందుకున్నప్పుడు, దాన్ని పలుచన చేసేందుకు అప్పటి కాంగ్రెస్‌ నేతలు ప్రొద్దుటూరులో ‘రాయలసీమ మహాసభలు’ నిర్వహిం చారు. ఆనాటి సభల్లోనే యువకుడైన ఎంవీఆర్‌ మైకును స్వాధీనం చేసుకొని– ‘రాయలసీమ అభివృద్ధి కోసం నిర్దిష్ట ప్రతిపాదనలతో పదవులను వదులుకొని ఉద్యమం చేయగలరా?’ అంటూ పెద్దలను ప్రశ్నించాడు. ఆ పెద్దల నోట మాటలేదు.  

1983లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో ఉన్నా, ఆయన పదవులకోసం తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ‘తెలుగు గంగ’ ప్రాజెక్టు రాయలసీమ నేలకు చుక్క నీరివ్వదని తెలుసుకున్న వెంటనే ఎన్టీఆర్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత ఎదిరించాడు. ‘రాయలసీమ విమోచన సమితిని’ స్థాపించి రాయలసీమ కోసం నాలుగు జిల్లాలూ తిరుగుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు. వంచనతో ఆ దీక్షను ముఖ్యమంత్రి వివరమింపజేయడంతో, తెలుగుదేశం పార్టీని వీడి ‘రాయలసీమ విమోచన సంస్థ ’ అభ్యర్థిగా 1985 శాసనసభ ఎన్నికల్లో పోటీచేశాడు.

ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఓడిపోవడానికి, ప్రజాభిమానం లేని నాయకుడు గెలవడానికి ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అవకాశం వుందో చూపడానికి 1985 ఎన్నికల నాటి ప్రొద్దుటూరు ఎన్నిక ఒక కొండగుర్తు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా, ఆ తరువాత ఆయన గానీ, ఆయన భార్య గానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ప్రతి ఎన్నికలో 25 వేల ఓటు బ్యాంక్‌ తనకుందని నిరూపించుకున్నారు.

ఓడిపోయాక కూడా ఆయన రాయలసీమపై తనకున్న ప్రేమను చంపుకోలేదు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏ పార్టీలు, ఏ ప్రజాసంఘాలు ఉద్యమించినా తను ప్రోత్సహించేవాడు. చిన్నాపెద్ద చూడకుండా ఆ నిరసనలలో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైనప్పడు... ఆంధ్ర, రాయలసీమల్లో జరిగిన ‘సమైక్యాంధ్ర’ ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకించాడు. దాన్ని నడిపిస్తున్న శక్తులెవరో, రాయలసీమకు మరెంతగా అన్యాయం జరుగుతుందో వివరించాడు. (చదవండి: గ్రహణం పట్టిన భాస్కరుడు)

రాజధాని కర్నూలు కావాలనీ, గుంతకల్లు రైల్వేజోన్‌ చేయాలనీ ప్రజాసంఘాలు చేసిన నిరసనల వెనుక వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా, ఆరోగ్యం సహకరించకపోయినా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు స్థాపన, రైల్వే డబ్లింగ్‌ పనులు వంటి ఒకటి రెండు మినహా, ఎంవీ రమణారెడ్డి ఎప్పుడో గుర్తించిన రాయలసీమ సమస్యలు దాదాపు అన్నీ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రాజెక్టులు కొన్ని పూర్తయినా నీటి కేటాయింపులు లేవు. (చదవండి: ఒక తరపు పోరాట గాథ)

తొలినాళ్ళలో తీవ్రవాద మావోయిస్టు – లెనినిస్టు పార్టీతో ఎంవీఆర్‌ రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత కాలంలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అహింసా పోరాటాన్ని ‘ఆయుధం పట్టని యోధుడు’ పేరుతో మనకందించడం చూస్తే ఆయనలో వచ్చిన సైద్ధాంతిక మార్పు తెలుస్తుంది. రాయలసీమ కన్నీటిగాథపై ఆయన రాజేసిపోయిన నిప్పు ఆయన లేకపోయినా రాజుకుంటూనే ఉంటుంది.

- పాలగిరి విశ్వప్రసాద్‌ 
వ్యాసకర్త కథా రచయిత
(ఏప్రిల్‌ 4న ఎంవీ రమణారెడ్డి జయంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top