Vempati Chinna Satyam: కూచిపూడి విదుషీ ధీమణి

Kuchipudi Dance Guru Vempati Chinna Satyam Birth Anniversary - Sakshi

శాస్త్రీయ నృత్య రూపకాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఇది తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి యావత్‌ ప్రపంచాన్ని చుట్టేసింది. ఆంధ్ర రాష్ట్ర అధికారిక నృత్యం కూచిపూడి. అందులో అత్యద్భుతమైన నాట్యాచార్యులు ‘పద్మభూషణ్‌’ వెంపటి చిన సత్యం. 1929 అక్టోబర్‌ 15న కృష్ణా జిల్లా కూచిపూడిలో వెంపటి జన్మించారు. తమిళనాడులో భరతనాట్యం విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని అక్కడి కళాభిమానులకు పరిచయం చేసి, దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. 

కూచిపూడి నాట్యంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి తన జీవితమంతా అంకితం చేసిన విదుషీ ధీమణి వెంపటి. రకరకాల జతులనీ, నాట్య ప్రక్రియలనీ విస్పష్టంగా వర్గీకరించి, సనాతన నాట్యశాస్త్ర సమగ్ర విధివిధానాలతో మేళవించి, ఎన్నెన్నో జతి స్వరాలూ, తిల్లానాలూ, వర్ణాలూ సృజించిన నాట్య పరమేష్టి ఆయన.  కూచిపూడి నృత్య నాటికలను ఎన్నింటినో రూపొందించి వాటికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేశారు. శ్రీకృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం, క్షీరసాగర మథనం, పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం లాంటివి పేరెన్నిక గన్నవి. 

1947లో మద్రాసుకు చేరుకున్న చిన సత్యం తన సోదరుడు వెంపటి పెద సత్యం వద్ద సినిమాలకు నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్‌ రికార్డు వచ్చింది. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్‌ అకాడెమీని స్థాపించారు. దీని ద్వారా వైజయంతిమాల, ప్రభ, పద్మామీనన్, వాణిశ్రీ, శోభానాయుడు లాంటివారికి కూచిపూడి నేర్పించారు. హేమమాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప వంటి వారంతా ఆయన శిష్యులే. 

2012 జూలై 29న మరణించిన వెంపటి జన్మదినమైన అక్టోబర్‌ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఆయన పేరిట 5 లక్షల రూపాయల స్మారక పురస్కారాన్ని ‘యక్షగాన సార్వభౌమ’ చింత సీతారామాంజనేయులుకు ప్రకటించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ఆర్కే రోజా దీన్ని ప్రదానం చేస్తారు.

– రేగుళ్ళ మల్లికార్జునరావు, సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ
(అక్టోబర్‌ 15న వెంపటి చిన సత్యం జయంతి) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top