నిరంతర జనకవిత్వ సృజన శిఖరం

Katti Padma Rao Poetry Guest Column By Shikha Akash - Sakshi

సందర్భం

మహాత్మా పూలే, అంబేడ్కర్, పెరియార్, వేమన, పోతులూరి వీరబ్రహ్మం, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా వంటి సంస్కర్తల దారిలో... వర్తమాన సాహిత్యాన్ని, చరిత్రను సుసంపన్నం చేస్తున్న మహాకవి కత్తి పద్మారావు. గత ఐదు దశాబ్దాలుగా కఠోర అధ్యయనం, పరిశోధన, ఆచరణతో ముందుకు సాగుతున్నారు. ఒక సమగ్ర సామాజిక మార్పు కోసం తన రచనలను, ఆచరణను అంకితం చేశారు. తన జాతి జనుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని అపారంగా రచించారు. అమ్మ చెప్పిన మాటతో కులం పునాదుల్ని వెలికితీసి అనేకానేక వివక్షలను, ఆధిపత్యాలను సమాధి చేస్తున్నారు. వేలాదిమంది పీడితులకు తన అక్షర సైన్యంతో ధైర్యమై నిలిచారు.

‘కులం పునాదుల మీద ఒక జాతినీ, ఒక నీతినీ నిర్మించలేరన్న’ అంబేడ్కర్‌ సత్య వాక్కు కత్తి పద్మారావు కవితా ఝరి. ‘సత్యవాక్యంబెవ్వడుల్లంఘింపడో వాడేపో నరుడిద్ధరా మండలిన్‌’ అనే జాషువా మహాకవి మాట కత్తి పద్మారావు గారి కవిత్వానికి ఊపిరి. పద్మారావు జీవితంలో కులజీవన విధానం లేదు. ఆయన కులనిర్మూలన వాది. క్లాసులో చెప్పే పాఠాలకు మించి వేలాది సభల్లో, విశ్వవిద్యాలయాల్లో మాట్లాడిన మహోపాధ్యాయుడు. ‘అణగారిన ప్రజల మూగభాషను నా కవిత్వం ఉక్కు నాలుకతో సంభాషిస్తుంది  అంటూ దళితులకు సామాజికంగా, సాంస్కృతికంగా తాత్వికంగా నాయకత్వం వహిస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ కవిగానే పుడతా’నంటున్న కవిత్వ శ్వాస అతడు. ‘దళిత కవితా దిక్సూచి అతడు. ‘పక్షి గమనం నాకు ఆదర్శం, ప్రకృతి సౌందర్యం నాకు స్ఫూర్తి, మనిషిలోని వైరుధ్యం నా తర్కం, సమన్వయం నా దర్శనం’ అంటున్న నల్ల సముద్రం అతడు.

సజీవ వాస్తవిక మానవ సంఘర్షణల మహాకావ్యం ‘అస్పృశ్యుని యుద్ధ గాథ’ కత్తి పద్మారావు. తీవ్రమైన కులవివక్షకు గురైన పనికులాల పక్షం వహించిన ప్రజాకవి. ‘నా తర్కం చార్వాకం, నా తత్వం  బౌద్ధం, నా ఆయుధం అంబేడ్కరిజం’ అంటూ పీడక శక్తులపై కలాన్ని కత్తిగా దూసిన యుగ కవి కత్తి పద్మారావు. కడుపు నిండా ఆకలిని, గుండెల నిండా అవమానాలను, బతుకు నిండా కష్టాలను నింపుకున్న నిరుపేద కుటుంబం లోంచి వచ్చిన పద్మారావు... అగాథపు అంచుల్లో ఉన్న జనాన్ని కవిత్వ వస్తువులు చేసి వారికి సాహితీ గౌరవం కల్పించారు. దళిత జీవితంలోని సౌందర్యాన్ని, తాత్వికతని పద్మారావు అద్భుతంగా అక్షీకరించారు. అందుకే తరతరాల నిరంతర జనకవిత్వ సృజన శిఖరంగా నిలిచారు. పిడికెడు ప్రేమకోసం, మానవ స్వేచ్ఛా సమానతల కోసం దీపధారిగా నిలిచారు.

మహాకవి గుర్రం జాషువా మహాసభలు ముంబైలో జరిగినప్పుడు ముఖ్యఅతిథిగా పాల్గొని జాషువా కవిత్వ గొప్పతనాన్ని వినిపించారు. తన ‘సాంఘిక విప్లవ చరిత్ర’లో కూడా జాషువా సాహిత్య ప్రస్థానం గురించి పేర్కొన్నారు. ‘దళిత సాహిత్యవాదం – జాషువా’ (1995),‘జాషువా సామాజిక తత్త్వం’ (1996), ‘మహాకవి జాషువా–సామాజిక విప్లవం’(2007) అనే మూడు బృహత్‌ గ్రంథాల ద్వారా తెలుగు సాహిత్యానికి జాషువా సామాజిక, సాహిత్య దర్శనాన్ని అందించారు. జాషువా కవితా శిల్పం, ఆర్ద్రత, మానవతా దృక్పథం, విశ్వజనీన తత్వం అనేవి తన నుండి ఈ నాటి దళిత బహుజన కవులందరికీ ఆదర్శం అంటారు. ‘కులం పునాదులు’ మీంచి ‘నల్లకలువ’లు, ‘నీలికేక’లు, ‘భూమిభాష’లు, ‘ముళ్ళకిరీటం’లు, ‘కట్టెలమోపు’లు, ‘ఆత్మగౌరవ స్వరం’లు, ‘అస్పృశ్యుని  యుద్ధగాథ’లును చరిత్రకు అందించినవారు. పునర్నిర్మాణానికీ, ప్రత్యామ్నాయ సంస్కృతీ విధానానికీ దారులు వేసిన 95 గ్రంథాలు వెలువరించారు. తెలుగు రాష్ట్రాలలో అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ విశేషంగా తన ఉపన్యాసాలతో రాబోయే తరాలను చైతన్యపరిచారు. ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’ వంటి పలు జాషువా రచనల మీద గొప్ప కృషి చేసారు. 

కత్తి పద్మారావు సామాజిక జీవితంలో రాజకీయ పార్శ్వం ఉంది. దళిత బహుజనుల్ని చైతన్యవంతుల్ని చేయడంలో అద్వితీయ పాత్ర వుంది. వక్తృత్వ పోటీలు, నాటకాలు, బుర్రకథలు పాటలు రాయడం, నాటకాలు రాసి తనే పాత్ర పోషించి ప్రదర్శించడం శాంతినగర్‌ లూథరిన్‌ చర్చ్‌ సండే స్కూల్‌లో చిన్నప్పుడే అలవడినాయి. భారతీయ అలంకార శాస్త్రాలు, గ్రీకు అలంకార శాస్త్రాలు, పాశ్చాత్య ఆధునిక ఈస్థటిక్స్, మనస్తత్వ శాస్త్రాలు, భాషా శాస్త్రాలు అధ్యయనం విస్తృతంగా చేశారు. వాల్మీకి, కాళిదాసు మొదలు ఖలీల్‌ జిబ్రాన్, షెల్లీ వర్డ్సవర్త్, జాన్‌ మిల్టన్, జిడ్డు కృషమూర్తి తదితరుల ప్రకృతి వర్ణాలను అధిగమించి ఆధునిక మానవునిలోని ప్రకృతి స్పృహని నూతనంగా తన రచనల్లో నింపారు. 

‘అమృత నిష్యంతనమైన వాక్కులు నాకు నా తల్లి ప్రసాదించింది. ఔషధపు కట్టలు కట్టే వైద్యశాస్త్రం నా అక్షరాల్లో ఉందంటూ’ తన తల్లి ప్రభావం తనపై ఎలా అణువణువునా నిండి ఉందో అనేక కవితల్లో చెప్పారు. ‘నీ జోలపాటే ప్రపంచ సాహిత్యానికి పల్లవి’ అంటూ అడుగడుగునా వాళ్ళమ్మను గుర్తుచేసుకుంటారు పద్మారావు. ‘శిల్పమూ నీవే, చిత్రమూ నీవే, చిరునవ్వూ నీవే, ప్రళయాగ్నివీ నీవే. నువ్వు నవ్వితే భూమి పులకరిస్తుంది. నువ్వు కరిగితే సముద్రానివి. నువ్వు మండితే అగ్ని గోళానివి’ అంటూ వాళ్ళ అమ్మను కవిత్వీకరిస్తారు. ‘పొద్దున్నే చల్ల చారుతో, చద్ది బువ్వ కలిపి ఎర్రగారపు పచ్చడి నంజు పెడితే శాస్త్రవేత్తలా కనిపించింది అమ్మ’ అంటారు. డా. కత్తిపద్మారావు నిరంతర సాహితీ కృషిలో వారి సహచరి స్వర్ణకుమారి సహకారం విశేషమైనది. వెనుతిరగని నది మాటలా, నిర్మలమైన పాటల ఆకాశంలా, పవిత్రమైన నిప్పుల నినాదంలా, స్వచ్ఛమైన నీటి చెలమలా, అచ్చమైన తల్లి గాలి ప్రేమలా, భూమితల్లి జోలలా అతడు ప్రజలకవి. అతనిది ప్రజాకవిత్వం.

ఇటీవలే ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ గారి లోకనాయక్‌ ఫాండేషన్, విశాఖపట్నం వారు స్వర్గీయ ఎన్‌.టి.రామారావు, స్వర్గీయ హరివంశరాయ్‌ బచ్చన్‌ స్మృత్యర్థం ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లోకనాయక్‌ ఫౌండేషన్‌ పురస్కారం ‘అస్పృశ్యుని యుద్ధగాథ’కు గానూ రెండు లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని కత్తిపద్మారావు అందుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం ద్వారా ఆయనపై బాధ్యత మరింత పెరిగినట్లు అయింది. 

-శిఖా–ఆకాష్‌
వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి
కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘం
మొబైల్‌: 93815 22247
(నవంబర్‌ 1న డా.కత్తి పద్మారావు, ఏపీ ప్రభుత్వ ‘వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారా’న్ని అందుకుంటున్న సందర్భంగా)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top