మద్దతు పెరగాల్సిన రంగం | Sakshi
Sakshi News home page

మద్దతు పెరగాల్సిన రంగం

Published Sat, Oct 28 2023 12:05 AM

Indian Farmers Need Support Government - Sakshi

రబీ పంటల పెంపు ధరలు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే కనీస మద్దతు ధరలో పెంపుదల, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి 14 శాతానికి మాత్రమే పెరిగింది. 86 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమ్ముకోవలసి వస్తోంది. పైగా, కనీస మద్దతు ధరలో పెంపుదల ఇంకా ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగానే ఉంటోంది. అందుకే ధరలకు సంబంధించి వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం.

2018లో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఒక ఎపిసోడ్‌లో, నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక చిన్న రైతు తన దుఃస్థితి గురించి చెప్పినప్పుడు మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తన చెవులను తానే నమ్మలేక పోయారు. వ్యవసాయం ద్వారా ఎంత సంపాదిస్తున్నారని అమితాబ్‌ అడిగిన ప్రశ్నకు ఆ రైతు, ‘‘సంవత్సరానికి రూ. 60,000 కంటే ఎక్కువ సంపాదించడం లేదు. దానిలో సగం డబ్బు విత్తనాలు కొనడానికే పోతోంది. నేను నా కుటుంబానికి రాత్రి భోజనం మాత్రమే అందించగలుగుతున్నాను’’ అని బదులిచ్చారు.

ఆ రైతు సమాధానం విని అమితాబ్‌ నివ్వెరపోయారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దేశ రైతులను ఆదుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అప్పటి నుండి గ్రామీణ మహారాష్ట్రలో నిరాశ మరింతగా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య కాలంలో 1,809 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తా కథనాలు చెబుతున్నాయి. గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినప్పటికీ సగటున రోజుకు ఏడుగురు రైతులు తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల్లో యాభై శాతం పత్తి పండించే ప్రాంతంలోనే నమోదయ్యాయి.
రైతులకు జాక్‌పాటేనా?
శీతాకాలపు పంటల కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)ల్లో ఇటీవలి పెంపుపై మీడియాలో వస్తున్న వార్తల్లోని ఉత్సాహం నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేసింది. ఇది రైతులకు ‘జాక్‌పాట్‌’ లేదా ‘అదనపు వరం’ అని ప్రశంసిస్తున్నారు. కానీ ఇది కష్టాల్లో ఉన్న రైతులకు ఏదైనా సహాయం అందజేస్తుందా అనేది ప్రశ్న. ధరల పెంపుదల పెరుగు తున్న నిరాశను ఆశాజనకంగా మార్చే అవకాశమైతే కనిపించడం లేదు. ముందుగా, ప్రకటించిన కనీస మద్దతు ధర పెరుగుదల పరిమాణాన్ని చూద్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.

పైగా 2024 లోక్‌సభ ఎన్నికల సమయా నికి రబీ పంటల కోతలు జరగనున్నాయి. రబీ పంటల ధరల పెంపు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే, కనీస మద్దతు ధరలో పెంపుదల అనేది, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా, రైతులకు ‘జాక్‌పాట్‌’ లేదా ‘అదనపు వరం’ అంటూ చేస్తున్న వర్ణన వాస్తవానికి క్షేత్ర వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయడం పైనే ఆధారపడి ఉంది.

ప్రతి పంట సీజన్‌లోనూ, ప్రభుత్వానికి ధరలను సిఫార్సు చేసే ‘కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసెస్‌’ (సీఏసీపీ– వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌)... ఉత్పత్తి ధరల సూచిలో వచ్చే మార్పుల శాతాన్ని, గణనలను కూడా అందజేస్తుంది. 2022–23తో పోలిస్తే, ఈ ఏడాది మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.9 శాతం పెరిగింది. అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండగా, కనీస మద్దతు ధరల పెరుగుదల దానికి అనుగుణంగా లేదు. ఇది రైతులు హర్షించడానికి కారణం కాదు.

ఒక సంవత్సరం క్రితం, ఇది మరింత దారుణంగా ఉండేది. మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.5 శాతం పెరుగుదలకు ప్రతిగా, గోధుమ కనీస మద్దతు ధర కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. యాదృచ్ఛికంగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ. 150 పెరగడంతో గోధుమల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,275కి చేరుకుంది. 2006–07, 2007–08 తర్వాత, దేశీయ ఉత్పత్తిదారులకు ధరలను పెంచడం మినహా యూపీఏ ప్రభుత్వానికి పెద్దగా అవకాశం లేకుండా పోయిన తర్వాత, ఇది గోధుమ ధరలో అత్యధిక పెరుగుదలగానే చెప్పాలి.
ఎన్నికల సంవత్సరాల్లోనే!
రైతుల నుండి నేరుగా గోధుమలను కొనుగోలు చేయడానికి ప్రైవేట్‌ కంపెనీలను అనుమతించాలనే లోపభూయిష్ట నిర్ణయం జరిగిన తర్వాత, ఇది ప్రభుత్వ నిల్వల్లో భారీ అంతరానికి కారణ మైంది. ఆ కొరతను తీర్చడానికి ప్రభుత్వం దాదాపు రెట్టింపు ధరలకు (స్వదేశీ రైతులకు ఇచ్చే) గోధుమలను దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నుండి వచ్చిన విమర్శల తరువాత, ముఖ్యంగా ధర సమానత్వం తీసుకురావడానికి, గోధుమ లకు కనీస మద్దతు ధరను పెంచారు.

ఈ ఏడాది ధరలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లోని ప్రధాన రబీ పంటలపై ప్రభావం చూపుతాయని పరిగణనలోకి తీసు  కుంటే, ధరల పెరుగుదల ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఊహాగానాలు ఉన్నాయి. గోధుమలు అత్యంత ముఖ్యమైన రబీ పంట. బార్లీ(యవలు), పెసర, రేప్‌సీడ్‌–ఆవాలు, పప్పు (మసూర్‌)... ఇతర శీతాకాలపు పంటలు కావడంతో, ధరల పెరుగుదల కచ్చితంగా రాజకీయ కోణాన్ని కలిగి ఉంది.

ఆర్థికవేత్తలు సుఖ్‌పాల్‌ సింగ్, శ్రుతి భోగల్‌ 2004, 2009, 2014, 2019కి ముందు సంవత్సరాల్లో గోధుమలు, వరి కనీస మద్దతు ధర ఎంత ఎక్కువగా ఉందనే అంశాన్ని 2021 జనవరిలో స్పష్టంగా చూపించారు. ఇవన్నీ ఎన్నికలు జరిగిన సంవత్సరాలు. 2023–24 రబీ ధరల పెంపు కూడా ఇదే తరహాలో ఉంది. ఎన్నికలకు ముందు మాత్రమే రైతులకు సాపేక్షంగా అధిక కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించారు. దీనివల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాలను పొందివుండొచ్చు. కానీ భవిష్యత్తులో పంటల ధరలను రాజకీయాలు నిర్ణయించకుండా దూరంగా ఉండేలా చూసుకోవాల్సిన సమయం ఇది.
స్వామినాథన్‌ ఫార్ములా అమలు కావాలి
వ్యవసాయం దానధర్మం కాదు. పంటల ధరలను రాజకీయ నాయకత్వం ఇష్టారాజ్యానికి వదిలేయలేం. వ్యవసాయానికి నిర్మా ణాత్మక సంస్కరణలు అవసరం. ఎన్నికలు జరిగిన సంవత్సరంతో నిమిత్తం లేకుండా, స్వామినాథన్‌ ఫార్ములా ప్రకారం, ‘వెయిటెడ్‌ యావరేజ్‌’కు 50 శాతం లాభం కలిపి రూపొందించిన కనీస మద్దతు ధరలు రైతులకు అందేలా ఈ సంస్కరణలు ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి దాదాపు 14 శాతానికి మాత్రమే పెరిగింది.

దీనివల్ల అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే, కనీస మద్దతు ధర పెంపు ఇంకా చాలావరకూ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉంది. మార్కెట్‌లు మిగిలిన 86 శాతం మంది రైతులకు నష్టాలతో కూడిన ధరలు చెల్లించడం వల్ల వ్యవసాయ కష్టాలు తీవ్ర మవుతున్నాయి. రుణభారం, ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. 
అంతేకాకుండా, రైతులకు సరైన ఆదాయాన్ని శాశ్వతంగా నిరాక రించిన స్థూల ఆర్థిక విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం ఇది.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్‌ లేదా మైనస్‌ 2 శాతం) బ్రాకెట్‌లో ఉంచడం వ్యవసాయాన్ని దెబ్బతీసింది. వినియోగదారుల ధరల సూచిక బుట్టలో ఆహారం, పానీయాల వాటా 45.9 శాతం ఉన్న ప్పటికీ, విధాన రూపకర్తలు అతిపెద్ద ద్రవ్యోల్బణ చోదకశక్తిగా ఉన్న గృహనిర్మాణంపై మాత్రం కళ్ళు మూసుకున్నారు. గృహనిర్మాణాన్ని పెట్టుబడిగా పరిగణిస్తుండగా, కనీస మద్దతు ధరలో ఏదైనా పెంపు దలను మాత్రం ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని
నిందిస్తుంటారు. ఇది మారాల్సి ఉంది.
- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు 

Advertisement
 
Advertisement
 
Advertisement