వివక్షే ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టు

Dr Katti Padma Rao Discrimination India Economy Crisis - Sakshi

విశ్లేషణ

భారత దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలన్నీ... కులం, కులానికి పునాదైన మతం వల్ల ప్రభావితమై ఉన్నాయి. అందువల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీల్లో తీవ్రమైన అసమానతలతో కునారిల్లుతోంది. కులానికో ఉత్పత్తి బాధ్యత ఉన్న దేశంలో ఆయా కులాల పట్ల వివక్ష చూపడం, వారికి భూమిని దక్కకుండా చేయడం వల్ల ఉత్పత్తిని స్తబ్ధత ఆవరించిందని అంబేడ్కర్‌ అన్నాడు.  భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా కులం ఊబిలోనే సతమతమవుతోంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేడ్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. 

భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రూపొందించిన భారత రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మనకు అవగతమవుతోంది. అంబేడ్కర్‌... రాజకీయాల్లో వ్యక్తిత్వం, ఆదర్శం, నీతి, నిజాయితీ చాలా అవసరమని చెప్పి ఆయన స్వయంగా ఆచరించాడు. నాయకులకు వ్యక్తిత్వం శూన్యమైతే భారత సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ సంక్షోభంలో పడక తప్పదు. 

భారతదేశ వ్యాప్తంగా అవినీతి పెరిగింది. అందువల్ల దేశ సంపద అంతా అధికంగా నాయకులు, కార్పొరేట్‌లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ప్రతి పదిమందిలో ఒకరు దుర్భరమైన చాకిరీ చేస్తే కానీ బతకలేని స్థితి దాపురించింది. వీళ్ళందరిలో ఎస్సీ, ఎస్టీల పిల్లలు తొంభై శాతం అని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికీ చాలామంది బొగ్గు క్వారీల్లో, హోటళ్లలో పనిచేస్తూ... రైల్వే ట్రాక్‌ల మీద కాగితాలు, విసిరేసిన సీసాలు ఏరుకుంటూ కాలే కడుపుతో కళ్ళు పీక్కుపోయి బతుకుతున్నారు. రాజ్యాంగం వీరికి కల్పించిన హక్కులు కాలరాయబడుతున్నాయి.

భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మరో విషయం నిరుద్యోగం. సంస్కరణలు వృద్ధి రేటును పెంచినట్టు చూపిస్తున్నాయి. కానీ నిరుద్యోగం అధికమవుతోంది. రెగ్యులర్‌ ఎంప్లాయీస్‌ను తగ్గిస్తూ క్యాజువల్‌ లేబర్‌ను పెంచుతున్నారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం లేకుండా పోయింది. శ్రామిక సంక్షోభానికి తూట్లు పొడిచారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడడానికి కారణమైన లాకౌట్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగినవే. సంస్కరణల పేరుతో వ్యవస్థాపకులు శాశ్వత శ్రామికుల్ని తొలగించి తాత్కాలిక ఉద్యోగుల్ని నియమిస్తూ వస్తున్నారు. శాశ్వత శ్రామిక వర్గాన్ని అంతరింపజేయాలనీ; సమ్మె, పోరాటం అనే రాజ్యాంగ హక్కులను దెబ్బతీయాలనీ పెద్ద ప్రయత్నం జరుగుతోంది. వ్యయసాయ రంగ విస్తరణ తొమ్మిదో ప్రణాళిక నుండి పధ్నాలుగో ప్రణాళిక వరకూ రెండు శాతం దగ్గరే స్తబ్ధంగా ఉండిపోయింది. దీనికి కారణం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల శాతం తగ్గిపోవడమే. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం లేదు. వరి, గోధుమ వంటి పంటలను ప్రోత్సహించి భూసారాన్ని సహజంగా పెంచే ప్రక్రియకు తిలోదకాలిచ్చారు. అలాగే వ్యవసాయ కూలీలుగా ఉన్న ముప్పై కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు ఒక్క శాతం భూమి కూడా లేదు. అంబేడ్కర్‌ భూమిని పంచకుండా ఆర్థిక సామాజిక వ్యవస్థ బలపడదని స్పష్టంగా చెప్పాడు. ప్రధానంగాఎస్సీ, ఎస్టీలకు భూమి పంపకం జరగలేదు. దానివల్ల దళితుల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగడం లేదు. ‘భారతదేశంలో నేనొక వ్యక్తిని, నాదొక కుటుంబం’ అనే భరోసా రావాలంటే అది భూమి పంపకంతో సాధ్యమవుతుందని అంబేడ్కర్‌ చెప్పాడు. రైతులు అంటే అన్ని రాష్ట్రాల్లో భూమి కలిగిన ఐదు అగ్ర కులాలను చెప్పుకోవడంలోనే నిర్లక్ష్యం దాగి ఉంది. 

అంబేడ్కర్‌ దేశంలోని ప్రతి గ్రామంలోనూ నివసిస్తున్న దళితులందరికీ విద్యుత్‌ సౌకర్యం ఉచితంగా అందించినప్పుడే వారిలో వెలుగు వస్తుందని చెప్పాడు. ఇప్పటివరకూ నలభై శాతం దళిత వాడల్లో విద్యుత్తు లేదు. ఎస్సీ, ఎస్టీలు చీకటి గుహల్లో జీవిస్తున్నారు. అటువంటి సమయంలో వారి పిల్లలకు విద్యావకాశాలు ఎలా మెరుగు పడతాయని ఈనాటి సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దళితులను వ్యవసాయ కూలీల నుండి వ్యవసాయ దారులుగా మార్చకపోయినట్లయితే భారతదేశ ఉత్పత్తులు పెరగవని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పాడు. భారతదేశంలో ఉత్పత్తులు స్తబ్ధతలో ఉండడానికి కారణం దళితులకు భూమీ, నీరూ, విద్యుత్తు, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో తగిన వాటా లభించకపోవడమే. 

ఇకపోతే 2017–18 నాటి యునెస్కో లెక్కల ప్రకారం ముప్పై ఐదు శాతం మంది చదవడం, రాయడం రానివారు భారతదేశంలోనే ఉన్నారని తేలింది. ఇందులో నిరక్షరాస్యులుగా ఉంది ఎస్సీ, ఎస్టీలే. నిరక్షరాస్యులుగా ఉంచి మతభావాలు, కులభావాలు కలిగించడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలనే రాజకీయ వ్యూహం నుండి దళితులను, దళిత వయోజనలను బయటకు తీసుకు వచ్చినప్పుడే దళిత విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందుతారు. ప్రకృతి శక్తులైన దళిత శ్రామికుల మీద చూపిస్తున్న నిర్లక్ష్యం... రాజ్యాంగేతర భావజాలంతో పెరుగుతోంది. 

అంబేడ్కర్‌ భారతదేశంలోని కుల, మతాలను అర్థం చేసుకుని, ఆ దృక్కోణంలోనే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అధ్యయనం చేశాడు. అందుకే భారత రాజకీయాలనూ, ఆర్థిక వ్యవస్థనూ కులం, దానికి పునాది అయిన మతం నేపథ్యంలోనే వ్యాఖ్యానించారు. మార్క్సిస్టులు ఈ అవగాహన నుండి ఇంతవరకు ఆర్థిక శాస్త్రాన్ని చూడలేకపోయారు. 
భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా అది కులం ఊబిలోనే సతమతమవుతోంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేడ్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. అంబేడ్కర్‌ ఇలా అన్నాడు: ‘అధికారంలో ఉన్న వ్యక్తులు దేశ ప్రయోజనాల పట్ల నిర్ద్వంద్వమైన నిబద్ధత కలిగి ఉండేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి. న్యాయాన్ని ఇచ్చే సామాజిక, ఆర్థిక నియమావళిని సవరించేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి’.

ఇకపోతే ఇప్పటికీ ఉద్యోగ వ్యవస్థలో బ్రాహ్మణ, బనియాలదే పెద్ద పాత్ర. ‘ఈపీడబ్ల్యూ’ భారతదేశ అధికార వర్గ వ్యవస్థ గురించి ఇలా పేర్కొంది. దేశ కార్పొరేట్‌ బోర్డ్‌ డైరెక్టర్లు... కులాల ప్రకారం బ్రాహ్మణులు 44.6 శాతం, వైశ్యులు 46.0 శాతం ఉంటే, ఎస్సీ, ఎస్టీలు కేవలం 1 శాతంగా ఉన్నారు. 1989–90లో ప్రభుత్వ సంస్థలు 1,160 ఉంటే 2010 నాటికి అవి 21,642కు పెరిగాయి. అదే ప్రైవేటు రంగ కంపెనీలు 1990లో రెండు లక్షలు ఉంటే ఇప్పుడు 8.5 లక్షలకు పెరిగాయి. వాటిలో పెట్టుబడి 64 వేల కోట్ల నుండి 11 లక్షల కోట్లకు పెరిగింది. తాజా అంచనాల ప్రకారం భారత కుబేరుల మొత్తం సంపద జీడీపీలో 15 శాతానికి సమానం. ఐదేళ్ల కిందట ఇది 10 శాతం గానే ఉంది. ప్రస్తుతం దేశంలో 166 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆదాయం, వినియోగం, సంపద విషయాల్లో ప్రపంచంలోనే అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలతో కునారిల్లుతున్న భారతీయ సమాజానికి ఆర్థిక అసమానతలు మరింత ఆందోళన కలిగించేవే. ఈ ఆర్థిక అసమానతల వల్ల దళిత, మైనారిటీల స్త్రీల పరిస్థితి అధోగతి పాలయ్యింది. 

అంబేడ్కర్‌ ఆర్థిక శాస్త్ర సంపన్నుడు. ఆయన భారత దేశంలో కులం, అçస్పృశ్యత, స్త్రీ వివక్ష పోయినప్పుడు మాత్రమే ఆర్థిక సంపద పెరుగుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల హిందూవాదులు కులాన్నీ, అస్పృశ్యతనూ స్థిరీకరించే క్రమంలో కార్పొరేట్‌ వ్యవస్థను విస్తృతం చేసి, రాజ్యాంగ సూత్రాలు దళితులకు అన్వయం కాకుండా చేసి, అçస్పృశ్య భారతాన్ని కొనసాగించాలనే దుర్వ్యూహంలో ఉన్నారు. అంబేడ్కర్‌ కుల నిర్మూలన, అçస్పృశ్యతా నిర్మూలన భావజాలంతో భారతదేశాన్ని ప్రేమించి, దేశంలో ఉన్న ప్రతి పౌరునికీ ఆర్థిక స్వావలంబనకు అవకాశం కల్పించి, భారతదేశ ఆర్థిక ఉత్పత్తుల్ని పెంచి, కుల రహిత గ్రామీణాభి వృద్ధీ, కుల వివక్ష లేని ఉద్యోగిత; మత అణచివేత లేని, స్త్రీ అణచివేత లేని సామాజిక వాదం సమ్మిశ్రితంగా నూతన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విప్లవాన్ని అంబేడ్కర్‌ మార్గంలో నిర్మిద్దాం.


డాక్టర్‌ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు, కవి. 98497 41695

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top