2023 సెప్టెంబర్‌లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో వచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టం ‘జనాభా గణన జరిగి,
ఆ ప్రాతిపదిక మీద నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తరువాతనే అమల వుతుందన్న నిబంధన అప్పుడే విమర్శకు గురైంది. ఆ లెక్కన 2030 నాటికి గానీ ఆ చట్టం అమలులోకి రాదని చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా ఉద్యమకారులు ఆవేదన పడ్డారు. మహిళల హక్కుల అమలులో సాచివేత ధోరణిని నిరసించారు.
ఇప్పుడు మూడేళ్లు పూర్తి కాకుండానే, జనగణన జరగకుండానే 2011 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనతో కలిపి మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన సవర ణలతో కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసింది. ప్రజాప్రతినిధుల వాదోపవాదాలతో వాతావరణం వేడెక్కి ఉంది. ఈ సందర్భంలో చట్ట సభలలో మహిళ లకు రిజర్వేషన్ కల్పించటానికి తాము సంసిద్ధంగా ఉంటే ప్రతి పక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయనీ, మహిళా ప్రపంచం వాళ్ళను క్షమించదనీ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్నది.
ఇది చూస్తుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు భుజాల మీదుగా దక్షిణ ప్రాంతాల రాజ కీయ ప్రాతినిధ్యం గురించి అనేక సందేహాలకు తావిస్తున్న నియో జకవర్గాల పునర్విభజన బిల్లును నెగ్గించుకొనే ప్రయత్నం చేసిందా ప్రభుత్వం అన్న సందేహం కలుగుతుంది. అయితే, దక్షిణాది రాష్ట్రా లకు అన్యాయం జరగకుండా, దేశంలోని అన్ని నియోజక వర్గాలసంఖ్యను సమంగా 50 శాతానికి పెంచుతామనే ప్రతిపాదనపై గట్టి విశ్వాసాన్ని ప్రభుత్వం కలిగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో!
నియోజక వర్గాల పెంపు ద్వారా తప్ప స్త్రీలకు చట్ట సభలలోకి ప్రవేశం సాధ్యం కాకపోవటం అన్న భావన ప్రజాస్వామికమైనదేమీ కాదు. ఇప్పటికి అనుభవిస్తున్న రాజకీయాధికారాన్ని ఉన్నది ఉన్న ట్లుగా స్త్రీలతో పంచుకొనటానికి పురుష సమాజం భావజాలసంస్కారాన్ని అభివృద్ధి చేసుకోలేదన్న సంకేతాన్ని ఇస్తుందది.
పితృస్వామిక స్వభావం
మహిళా సాధికారత లక్ష్యంగా 1990లలో ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన చైతన్యం, ఒత్తిడి నుండి 1992లో 73,74రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక పాలనా వ్యవస్థలలో స్త్రీలకు 33 శాతం స్థానాలను కేటాయిస్తూ చట్టం వచ్చింది. కానీ 2001ని మహిళా సాధికార సంవత్సరంగా ప్రకటించిన ప్రభుత్వం చట్ట సభలకు మహిళా రిజర్వేషన్‌ను విస్తరింపచేయటానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉండటమే మనకు తెలిసిన చరిత్ర.
1996 నుండి స్థానిక సంస్థలలో ఎన్నికల ద్వారా పదవులు చేపట్టిన స్త్రీల స్థానంలో కుటుంబ సభ్యులైన పురుషులో, గ్రామ పెత్తందారులో అధికారాలు చలాయించటం, ప్రభుత్వ పాలనా వ్యవస్థలు ఆ విషయం తెలిసి కూడా చర్యలు ఏవీ చేపట్టకపోవడం ప్రజాక్షేత్రంలో జరిగిన పరిశోధనలు, ప్రజల అనుభవాల నుండి వచ్చిన సాహిత్యం లోకానికి తెలియచెప్పాయి. ఇటువంటి పరిస్థి తులలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిన ప్పుడల్లా వీగిపోవటంలో, 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన ప్పటికీ లోకసభలో చర్చకు రాకుండా కోల్డ్ స్టోరేజిలో పెట్టబడటంలో ఆశ్చర్యపడవలసింది ఏమున్నది?
మొత్తంగా మహిళలు అధికార స్థానంలో ఉండటాన్ని అంగీకరించలేని సగటు పితృస్వామిక స్వభావమే దీని మూలం. 2001ని మహిళా సాధికారతా సంవత్సరంగా ప్రకటించినప్పుడు స్త్రీ పురుష వివక్షకు సంబంధించిన పాతబడ్డ భావజాల నిర్మూలనకు, మనుషులలో నూతన ప్రజా స్వామిక చైతన్య వికాసానికి చేపట్టే ఎన్నెన్నో కార్యక్రమాల గురించిన వాగ్దానాల వైఫల్యం మనం చూస్తున్నదే.
స్త్రీలు అందరూ ఒకటి కాదు. కులంవల్ల, సామాజిక ఆర్థిక స్థాయివల్ల వాళ్ళు భిన్న సమూహాలుగా ఉన్నారు. లింగ వివక్ష నిరపేక్ష అంశం కాదన్న ఎరుక... చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం అగ్రవర్ణ మహిళల అవకాశంగా మాత్రమే మిగిలిపోకూడ దన్న ఆకాంక్షగా వ్యక్తం కావటం సహజం. అందువల్లనే బహుజన మహిళలకు అంతర్గత రిజర్వేషన్ ఉండాలన్న ప్రతిపాదనమహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలోకి వచ్చినప్పుడల్లా వినబడుతూనే ఉంది. అయినా దానికి పెడచెవి పెట్టడానికి కారణం మనువాద సంస్కృతే అన్నది తెలిసిందే. ఆ చరిత్రను సౌకర్యవంతంగా విస్మరించి ఆ ప్రసక్తే లేకుండా ‘నారీ శక్తి వందన్ అధినియం’ వచ్చింది.
ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంటులో వీగి పోయింది. అందుకు మహిళలు నిరాశపడవలసినది ఏమీ లేదు. విశాల ప్రతిపాదిక మీద భిన్న సమూహాల స్త్రీల సరైన ప్రాతినిధ్యాన్ని చట్టంలో భాగంగా చేసేవరకూ ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావటం, నియోజకవర్గాల పునర్విభజనతో పనిలేకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలును డిమాండ్ చేయటం ఇప్పుడు తక్షణ కర్తవ్యాలు.
-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ సమన్వయకర్త
-కాత్యాయనీ విద్మహే


