Birsa Munda: ఆదివాసీల ఆరాధ్యదైవం

Birsa Munda Birth Anniversary: Freedom Fighter, Tribal Leader, Birsait - Sakshi

ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్‌ గ్రామంలో 1875 నవం బర్‌ 15న సుగుణ ముండా, కర్మిహాట్‌ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. ‘సాల్గా’ గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతం చయిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్‌ గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. 

అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్‌ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్‌వాళ్ల బాధలు పడ లేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి చ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్ల దొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు.

బ్రిటిషర్ల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్‌ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమా దంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్‌’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించే వాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడాడు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీలబా(దేవుడు)గా కొలిచేవారు. 

తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్‌లో ఉల్‌ గులాన్‌ (తిరుగుబాటు) పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది పాల్గొన్నారు. బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్‌వాళ్లు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900 జనవరి 5న ఎట్కేడీ  ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్‌ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది.

ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు ‘భగవాన్‌ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఛోటా నాగపూర్‌ కౌలుదారుల హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. (క్లిక్ చేయండి: నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?)

– చింత ఎల్లస్వామి
ఏబీవీపీ రాష్ట్ర పూర్వ సంయుక్త కార్యదర్శి
(నవంబర్‌ 15న  బిర్సా ముండా జయంతి) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top