World Trauma Day 2023: వరల్డ్‌ ట్రామా డే.. ప్రతి ఏడాది 10 లక్షల మంది చనిపోతున్నారు

World Trauma Day 2023: Simple And Efficient Ways Of Exercising After Injury - Sakshi

జీవితం అనిశ్చితం. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా ఏదో రోడ్డు ప్రమాదానికో గురై గాయాలు కావచ్చు. అనుకోకుండా మంటలు చెలరేగి చర్మం కాలవచ్చు. హఠాత్తుగా వర్క్‌ప్లేస్‌లోనో లేదా పెద్దవయసువారు బాత్‌రూమ్‌లోనో పడిపోయి, గాయం కావచ్చు. ఇలా అనుకోకుండా ప్రమాదం జరగడం, యాక్సిడెంటల్‌గా బాధలకు గురికావడాన్ని వైద్య పరిభాషలో ‘ట్రామా’ కేసులుగా పరిగణిస్తారు.

ఇలాంటి ప్రమాదాలప్పుడు అనుసరించాల్సిన మార్గ్గదర్శకాలపై అవగాహన కోసం ప్రతి ఏడాదీ అక్టోబరు 17వ తేదీని ‘వరల్డ్‌ ట్రామా డే’గా నిర్వహిస్తుంటారు. ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, అందించాల్సిన ప్రథమ చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనం. 

సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లోనే ట్రామా కేసులెక్కువ. దీనివల్ల తలకు గాయాలు, ఎముకలు విరగడాలు వంటివి జరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డం వల్ల ఏటా 50 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రతి ఆరు సెకండ్లకు మరణం సంభవిస్తోంది. ఇలా మన దేశంలో  ఏటా 10 లక్షల మంది మృతిచెందడంతో పాటు రెండు కోట్ల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. యువతలో సంభవించే మరణాల్లో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందేవారూ, అందునా 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసువారే ఎక్కువ. 

యాక్సిడెంట్లలో లేదా పెద్ద వయసు కారణంగా  తలకు గాయాలు, ఎముకలు విరగడాలు రోడ్డు లేదా ఇతరత్రా ప్రమాదాల్లో తలకు గాయం కావడం మామూలే. పెద్దవయసు వారిలో మజిల్‌మాస్‌ తగ్గడం, కాళ్లలో స్పర్శజ్ఞానం మందగించడం, అకస్మాత్తుగా స్పృహ తప్పడం, అకస్మాత్తుగా బీపీ తగ్గిపోవడం, కొందరిలో పక్షవాతం, పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ వంటి కారణాలతో పడిపోతే తలకు గాయాలు, ఎముకలు... ప్రధానంగా తుంటి ఎముక వంటివి విరగడం లాంటి ప్రమాదాలు జరగవచ్చు. 

ముందుగా పరిశీలించాల్సిన లక్షణాలు...  

  • స్పృహ కోల్పోవడం ,ఫిట్స్‌ రావడం  
  • రెండు, అంతకన్నా ఎక్కువ వాంతులు కావడం ∙చెవి, ముక్కులోంచి రక్తం రావడం. 
  • ప్రమాదానికి ముందు మొదలుకొని 30 నిమిషాల లోపు జరిగిన సంఘటనలు గుర్తులేకపోవడం. 
  • తలకు గాయాలు తక్షణ సాయాలు  ముందుగా అంబులెన్స్‌ ద్వారా పారామెడికల్‌ లేదా ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది నుంచి సహాయం అందాలి.
  • ఆసుపత్రికి తీసుకొచ్చాక ఎమర్జెన్సీలోనే చికిత్స ప్రారంభం కావాలి. ఎందుకంటే  మెదడుకు జరిగిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేయడం కష్టం కాబట్టి చికిత్స వీలైనంత త్వరగా అందాలి.
  • రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపాలి. 

రోడ్డు ప్రమాదాలూ.. ప్రథమ చికిత్స   
సహాయం కోసం పిలవడం (కాల్‌ ఫర్‌ హెల్స్‌) : దీనివల్ల సమీప హాస్పిటల్‌కు బాధితుల్ని వీలైనంత త్వరగా తరలించడానికి వీలవుతుంది. దగ్గర్లోని ఆసుపత్రి వివరాలను, అంతకంటే ప్రధానంగా ఆంబులెన్స్‌ నంబర్లను అందుబాటులో ఉంచుకోవడం మంచిది. 

∙సీన్‌ సేఫ్టీ : బాధితులను పక్కన చేర్చే సమయంలో అక్కడ సురక్షితంగా ఉందా అన్నది చూసుకోవాలి. ఉదా: ప్రమాద బాధితుల్ని రోడ్డు మధ్యన ఉంచడం కంటే ఓ పక్కగా తీసుకురావడం సురక్షితం. 

తలను కదల్చకుండా ఉంచడం (హెడ్‌ ఇమ్మొబిలైజేషన్‌): తలను కదల్చకుండా ఉంచాలి. ఎందుకంటే... తలకు గాయాలైన సందర్భాల్లో మెడకూ, వెన్నుపూసకూ గాయాలైనప్పుడు, తలను కదల్చకుండా ఉంచడం వల్ల వెన్నుపూసలకు సంబంధించిన అనర్థాలను నివారించినట్లు అవుతుంది. 

రక్తస్రావాన్ని అరికట్టడం : రక్తస్రావం జరగడం... రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయాలకు దారితీసే ప్రధాన అంశం. అందుకే రక్తస్రావాన్ని అరికట్టడం... రోడ్డు ప్రమాద చికిత్సలో చాలా కీలకమైన అంశం. అందుకోసం చేయాల్సినవి... ∙రక్తస్రావానికి కారణమైన గాయం ఏదైనా ఉందేమో పరిశీలించాలి. గాయం కనిపిస్తే, దానిపై తగినంత ఒత్తిడితో రక్తస్రావం ఆగేలా చేయాలి. శుభ్రమైన గుడ్డ లేదా గాజుగుడ్డను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. గాయంపై శుభ్రమైన గుడ్డతో రెండు చేతులతో ఒత్తిడి కలిగిస్తూ పదినిమిషాలు అలాగే ఉంచాలి.

టార్నికేట్‌ : ఒకవేళ పైన చెప్పినట్టు పదినిమిషాల పాటు ఒత్తిపట్టినా రక్తం ఆగకపోతే ఏదైనా గుడ్డతో గాయంపై రక్తం ఆగేందుకు గట్టిగా కట్టుకట్టి, అలా ఎంతసేపు కట్టి ఉంచారో వైద్య బృందాలకు తెలపాలి. అయితే ఇలా గట్టిగా ఒత్తిపట్టి ఉంచడమన్నది కాళ్లూ లేదా చేతుల విషయంలోనే జరగాలి తప్ప శరీర భాగాల్లోని మిగతా చోట్ల చేయకూడదు. 

కంటి గాయాలు  
కంటికి అనేక రకాలుగా గాయాలయ్యే అవకాశముంది. రైతులు పొలాల్లో, డొంకల్లో నడిచేప్పుడు ముళ్ల చెట్లు, తుప్పలు కంటికి కొట్టుకోవడం, ఇటుక, ఇసకలారీల్లోంచి పార్టికిల్స్‌ వచ్చి కళ్లలో పడటం, రాత్రి ప్రయాణాల్లో పురుగులు కళ్లకు కొట్టుకోవడం, వంటి ప్రమాదాలు జరిగి, కళ్లు గాయపడవచ్చు. ఇక పిల్లల విషయంలో బంతి / షటిల్‌కాక్‌ వేగంగా ఎగిరొచ్చి కంటికి ఢీకొనవచ్చు. 

పరిశీలించాల్సిన లక్షణాలు... 
►కన్నునొప్పి, కంటివాపు 
► కంట్లో ఏదైనా పడినట్లు (ఫారిన్‌ బాడీ) అనిపించడం 
►మసగ్గా కనిపించడం,ఏమీ కనిపించకపోవడం
 
అందించాల్సిన ప్రథమ చికిత్సలు  
పొలాల్లో మందు పిచికారి చేస్తున్నప్పుడు కంట్లో పడితే, దాని ప్రభావం తగ్గించడం కోసం నీళ్లతో కంటిని కడగాలి. ∙రోడ్డు ప్రమాణంలో ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్‌ వాడాలి. ∙బంతి/షటిల్‌కాక్‌ కళ్లకు తగలగానే వెంటనే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి. ∙ఒక గ్లాసు నీళ్లు తీసుకుని, కన్ను ముంచి, రెప్పలను ఆడిస్తూ ఉండాలి. కొద్ది కొద్దిసేపటికి ఈ నీళ్లను మారుస్తూ ఉండాలి. ∙కంటి డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లేలోపు కంటిని ఎట్టిపరిస్థితుల్లో నలపకూడదు. 

కాలిన గాయాలు... తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 గాయం కాగానే... కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. అలా కనీసం 10 నిమిషాల పాటు, మంట తగ్గేవరకు కడగాలి. 
► కాలినప్పుడు బట్ట చర్మానికి అంటుకుంటే దాన్ని తీయకూడదు. డాక్టర్‌ మాత్రమే దాన్ని తొలగిస్తారు. ∙కాలిన గాయలపై ‘క్లింగ్‌ ర్యాప్‌’ (తినే పదార్థాలపై కప్పే ట్రాన్స్‌పరెంట్‌ షీట్‌)తో చుట్టడం గానీ లేదా కప్పడం గానీ చేయాలి. 

► గాయాన్ని కడగడానికి గది ఉష్ణోగ్రతతో ఉన్న నీళ్లనే వాడాలి. ఐస్‌ వాటర్‌ వద్దు. ∙కాలిన గాయం మందం... మన అరచేయి మందంలో సగానికంటే ఎక్కువగా ఉన్నప్పుడూ లేదా రసాయనాల వల్ల కాలిన గాయమైతే బాధితుల్ని వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాలి. ∙గాయాన్ని ఎప్పుడూ రుద్దకూడదు. ∙గాయాలపై పసుపు, పేస్టు, నెయ్యి వంటివి రాయకూడదు.     

డా.రాహుల్‌ కట్టా,
ట్రామా కేర్‌ స్పెషలిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top