
డాక్టర్ ఏఐ– ఇదొక కొత్త స్టెతస్కోప్ ఇదొక రోబో సర్జన్ ఇదొక డయాగ్నస్టిక్ ల్యాబ్ ఇది రోగుల పాలిటి వరం వైద్యరంగం చేతిలోని శరం
కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి దూసుకొచ్చేస్తున్నట్లే, వైద్యరంగంలోకి కూడా శరవేగంగా దూసుకొస్తోంది. ఏఐ మాయాజాలం వైద్యరంగంలో పెనుమార్పులను తీసుకొస్తోంది. మన దేశంలోని ఆస్పత్రులు కూడా ఇటీవలి కాలంలో ఏఐని విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. వైద్యరంగంలో డాక్టర్ ఏఐ ఇప్పటికే తీసుకొచ్చి మార్పులను, భవిష్యత్తులో తీసుకురానున్న మార్పులను ఒకసారి తెలుసుకుందాం.
‘కరోనా’కాలంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్యరంగం అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడే పరిస్థితులు ఉంటే, చాలా చోట్ల ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బంది లేని పరిస్థితి. మహమ్మారి వ్యాధులు విజృంభించినప్పుడు మాత్రమే కాదు; సీజనల్ వ్యాధులు ఇబ్బడి ముబ్బడిగా వ్యాపించేటప్పుడు; అనుకోని విపత్తులు తలెత్తేటప్పుడు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. రోగుల తాకిడికి తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. ఇలాంటి విపత్కర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడంలో ఏఐ బాగా సహాయపడగలదని నిపుణులు చెబుతున్నారు. వైద్యులపై పనిభారం తగ్గించడానికి, వారి పనిని మరింత సులభతరం చేయడానికి ఏఐ వరప్రసాదం లాంటిదని వారు అంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల మొదలుకొని, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు వివిధ దేశాల్లోని ఆస్పత్రులు ఏఐని ఉపయోగించుకుంటున్నాయి.
ప్రపంచంలోనే తొలి ఏఐ ఆస్పత్రి
ప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రి ఇటీవల చైనాలో ప్రారంభమైంది. చింగ్‌హ్వా యూనివర్సిటీ ఈ పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రిని అభివృద్ధి చేసింది. ‘ఏజెంట్ హాస్పిటల్’ పేరిట ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో ఇతర సాధారణ ఆస్పత్రుల్లో మాదిరిగా మనుషులు ఉండరు. ఇదంతా ఒక మాయాలోకంలా ఉంటుంది. ఇందులో పనిచేసే సిబ్బంది అంతా పద్నాలుగు మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులు మాత్రమే! ఈ ఏఐ ఆస్పత్రిలో పేషెంట్లను చేర్చుకునే వార్డులు కూడా కనిపించవు. ఈ ఆస్పత్రిలోని ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు ‘వర్చువల్’గానే రోగులకు సేవలు అందిస్తూ ఉంటారు.
రోజుకు దాదాపు మూడువేల మందికి ఈ ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు రోగ నిర్ధారణ మొదలుకొని, రకరకాల చికిత్సలను అందిస్తూ ఉంటారు. ఈ ఏఐ డాక్టర్లు ఆషామాషీ చాట్‌బోట్లు కాదు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ (యూఎస్‌ఎంఎల్‌ఈ) పరీక్షల్లో 93.06 శాతం మార్కులు సాధించిన ఘనత సొంతం చేసుకున్న ఘనవైద్యులుగా గుర్తింపు పొందాయి. అంతేకాదు, కొన్ని రంగాల్లో అనుభవజ్ఞులైన మానవ వైద్యులను మించిన ఫలితాలను సాధించిన ఘనత కూడా ఈ ఏఐ వైద్యులు సాధించడం విశేషం.
తొలి రిమోట్ ఏఐ సర్జరీ
చైనా శాస్త్రవేత్తలు ఏఐ డాక్టర్ల రూపకల్పనలోనే కాదు, ప్రపంచంలోనే తొలి రిమోట్ ఏఐ సర్జరీని ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన ఐ అండ్ ఈఎన్‌టీ హాస్పిటల్ వైద్య శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా రిమోట్ ఏఐ సర్జరీని నిర్వహించారు. ఏఐ సాయంతో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు సాధారణంగా చేసే శస్త్రచికిత్స కంటే ముప్పయిశాతం తక్కువ సమయం పట్టింది.
అంతేకాదు, రోగికి పెట్టే కోతలో మిల్లీమీటరులో పదోవంతు కూడా తేడా లేనంత కచ్చితత్వంతో ఈ శస్త్రచికిత్స జరగడం అద్భుతమనే చెప్పుకోవాలి. ఫుడాన్ వర్సిటీ ఈఎన్‌టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వు చున్‌పింగ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి గొంతులో ఏర్పడిన కణితిని ‘ట్రాన్స్ ఓరల్ సర్జికల్ రోబో సిస్టమ్’ ద్వారా ఏఐ సాయంతో తొలగించారు. షాంఘైలో ఉన్న వైద్యనిపుణుల సూచనలకు అనుగుణంగా, అక్కడకు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని చెంగ్డూ ఆస్పత్రిలోని ఏఐ సర్జికల్ రోబోలు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాయి. ‘బోర్న్ ’ గ్రూప్‌లోని సింఫనీ రోబోటిక్స్ కంపెనీ ఈ ఏఐ సర్జికల్ రోబోలను తయారు చేసింది.
షాంఘైలోని వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన రిమోట్ ఏఐ సర్జరీ వల్ల శస్త్రచికిత్స ఖర్చు ఇరవై శాతం మేరకు, సమయం ముప్పయి శాతం మేరకు తగ్గినట్లు ‘బోర్న్’ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో లి యావో తెలిపారు. ‘బోర్న్’ గ్రూప్ రూపొందించిన ఏఐ సర్జికల్ రోబోలకు కావలసిన 1760 విడిభాగాలను చైనాలోని 165 కంపెనీల నుంచి సమకూర్చుకున్నట్లు లి యావో చెప్పారు. ఏఐ సర్జికల్ రోబోలను అభివృద్ధి చేయడానికి, వాటి వినియోగాన్ని మరింతగా విస్తరించడానికి తమ సంస్థ అమెరికా, జపాన్, జర్మనీలకు చెందిన కంపెనీలు, వైద్య పరిశోధక సంస్థలకు సహకరిస్తోందని వెల్లడించారు.
ఏఐ మాయాదర్పణం
వైద్యరంగంలో వ్యాధుల నియంత్రణ, చికిత్స పద్ధతులు ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరో ఎత్తు. వ్యాధుల చికిత్సకు వ్యాధి నిర్ధారణే కీలకం. ఎంత ఆధునిక వ్యాధి నిర్ధారణ పద్ధతులైనా, కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రావడానికి ఒకటి రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు సమయం పడుతుంది. అయితే, ఏఐ రాకతో వ్యాధి నిర్ధారణ శరవేగం పుంజుకుంటోంది. వ్యాధి నిర్ధారణలో ఏఐ తీసుకొచ్చిన వేగానికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ మాయాదర్పణమే తాజా ఉదాహరణ. మామూలుగా అద్దం ముందు నిలుచున్నట్లుగానే ఈ మాయాదర్పణం ముందు నిలుచుంటే చాలు, ఉన్నపళాన మీ ఆరోగ్య వివరాలను క్షణాల్లో చెప్పేస్తుంది.
ఈ మాయాదర్పణం డయాబెటిస్, బీపీ వంటి సర్వసాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు పార్కిన్‌సన్స్, డెమెన్షియా, గుండెజబ్బులు, శ్వాస సమస్యలు, నాడీ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ వంటి జటిలమైన వ్యాధులను కూడా ఇట్టే గుర్తించగలదు. స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా దీని ముందు నిలబడి ముప్పయి సెకన్ల సెల్ఫీ వీడియో తీసుకుంటే చాలు, ఇది శరీరాన్ని ఆపాదమస్తకం త్రీడీ స్కానింగ్ చేసేస్తుంది. అంతేకాదు, క్షణాల్లోనే ఈ మాయాదర్పణం ముప్పయి రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి వివరాలను అత్యంత కచ్చితత్వంతో చెబుతుంది. అమెరికన్ హెల్త్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘విదింగ్స్’ దీనిని ‘ఒమీనా’ పేరిట రూపొందించింది.
ఈ ఏడాది లాస్‌వేగాస్‌లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2025లో ప్రదర్శించిన దీని పనితీరు నిపుణుల ప్రశంసలు పొందింది. ‘ఒమీనా’ మాయాదర్పణం కేవలం ఆరోగ్య వివరాలను తెరపై చూపించి, అంతటితోనే సరిపెట్టుకోదు. ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా పనిచేస్తుంది. తెరపై కనిపించే ఆరోగ్య వివరాలను చూసుకున్న తర్వాత వినియోగదారులు అడిగే సందేహాలన్నింటికీ సమాధానాలను ఓపికగా చెబుతుంది. గుర్తించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి, తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు కూడా చేస్తుంది. వ్యాధి నిర్ధారణ రంగంలో ‘ఒమీనా’ ఏఐ సంచలనానికి నాంది పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
మన ఆస్పత్రుల్లోనూ ఏఐ
మన దేశంలోని ప్రముఖ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక సంస్థలైన గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటివి భారత్‌లోని ఆస్పత్రులకు ఏఐ సాంకేతికతను అందించడానికి ముందుకొస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, మణిపాల్ హాస్పిటల్స్, అరవింద్ ఐ హాస్పిటల్స్, ఏజే హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ హాస్పిటల్, నారాయణ హెల్త్, క్లౌడ్‌నైన్ హాస్పిటల్స్, కావేరీ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్స్ వంటివి ఇప్పటికే ఏఐ సాంకేతికతను రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, శస్త్రచికిత్సలలో కచ్చితత్వం తదితర అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. పలు ఔషధ తయారీ సంస్థలు, పరిశోధక సంస్థలు ఔషధాల రూపకల్పన కోసం కూడా ఏఐని వినియోగించుకుంటున్నాయి.
కార్పొరేట్ ఆస్పత్రులే కాకుండా, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘భారత్‌నెట్’ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో సుమారు రూ.8500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ‘నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంకల్పించుకుంది. ఈ ఆరోగ్య గుర్తింపు కార్డులకు పౌరుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారం అంతా అనుసంధానమై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకం అమలులోకి వచ్చినట్లయితే, ఏఐ సాంకేతికత గ్రామీణ ఆస్పత్రులకు కూడా అందుబాటులోకి వస్తుంది.
ఆరోగ్యరంగంలో విస్తరిస్తున్న ఏఐ
ప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోను ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ గడచిన ఐదేళ్లుగా బాగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 2022 నాటికి 11 బిలియన్ డాలర్లుగా (రూ.94,112 కోట్లు) నమోదైంది. ఇది 2025 నాటికి 35.71 బిలియన్ డాలర్లకు (రూ.3.04 లక్షల కోట్లు) చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో 2022 నాటికి ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 0.13 బిలియన్ డాలర్లు (రూ.1112 కోట్లు) ఉంటే, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలువ 1.6 బిలయన్ డాలర్లకు (రూ.13,689 కోట్లు) చేరుకోగలదని ‘ఫోర్బ్స్’ పత్రిక అంచనా. భారత్ ఆరోగ్య రంగంలో ఏఐ మార్కెట్ 40.6 శాతం మేరకు వార్షిక వృద్ధి నమోదు చేసుకోగలదని కూడా ‘ఫోర్బ్స్’ పత్రిక తన అంచనాను ప్రకటించింది.
భారత్ ఆరోగ్యరంగంలో ఏఐ విస్తరణ దిశగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన ‘టాటా ఎల్‌క్సి’ ఏఐతో పనిచేసే మెడికల్ ఇమేజింగ్ పరికరాల తయారీ కోసం పనిచేస్తోంది. మన దేశానికి చెందిన డిజిటల్ హెల్త్‌కేర్ స్టార్టప్ సంస్థ ‘ప్రాక్టో’ తన టెలిమెడిసిన్ సేవల కోసం బహుభాషా సామర్థ్యం కలిగిన ఏఐ సాంకేతికతను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ‘సిగ్టపుల్’ రక్త నమూనాలను దూరం నుంచే విశ్లేషించి, వ్యాధుల వివరాలను వెల్లడించగలిగే ‘డిజిటల్ పాథాలజీ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించింది. ఇది స్పెషలిస్టులు, హీమాటాలజిస్టుల అవసరం లేకుండానే ఏ ప్రాంతంలో ఉన్న రోగులకైనా రక్తపరీక్షల వివరాలను అందించగలదు.
ఏఐ తెచ్చిన మార్పులు
ఆరోగ్యరంగంలో ఏఐ ఇప్పటికే చాలా మార్పులు తెచ్చింది. అయితే, ఈ మార్పుల ఫలితాలు ప్రపంచం అంతటా ఇంకా పూర్తిగా విస్తరించలేదు. మరో ఐదేళ్లలో ఆరోగ్యరంగంలో ఏఐ మరింతగా విస్తరించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య వైద్యసేవలలో ఏఐ ఇప్పటి వరకు తెచ్చిన కొన్ని మార్పులు ఇవి:
ఏఐ వల్ల వ్యాధినిర్ధారణ సులభతరంగా మారింది. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే వంటి వాటిని ఏఐ శరవేగంగా విశ్లేషించి రోగ నిర్ధారణ చేయగలుగుతోంది. ఈ పరీక్షలను విశ్లేషించడంలో మానవ తప్పిదాలకు కొంత ఆస్కారం ఉండేది. ఏఐ వినియోగంతో ఎలాంటి తప్పిదాలకు తావులేని పరిస్థితి ఏర్పడింది.
ఏఐ సహాయంతో పలు దేశాల్లోని ఆస్పత్రులు విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించగలుగుతున్నాయి. ఏఐ వినియోగం వల్ల శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం పెరగడమే కాకుండా, శస్త్రచికిత్సకు పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గుతుండటం
విశేషం.
చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందిçంచే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.
మానసిక సమస్యలతో బాధపడేవారికి చికిత్సను అందించడంలోను, మానసిక సమస్యల లక్షణాలను ముందుగానే గుర్తించడంలోను ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.
ఔషధ తయారీ సంస్థలు, ఔషధ పరిశోధనలు నిర్వహించే సంస్థలు ఔషధాల ఆవిష్కరణకు, కొత్త ఔషధాల రూపకల్పనకు కూడా ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి.
పలు దేశాల్లోని ఆస్పత్రులు ఏఐ సాంకేతికతను వ్యాధి నిర్ధారణకు విరివిగా వాడుకుంటున్నాయి. వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షల విశ్లేషణతో పాటు, ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఈసీజీ, టూడీ ఎకో తదితర నివేదికలను నిమిషాల్లోనే విశ్లేషించి, భవిష్యత్తులో రానున్న వ్యాధులను గుర్తించడానికి కూడా ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.
చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందించే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.
ఏఐ డాక్టర్లా? మజాకా?
‘ఏజెంట్ హాస్పిటల్’లోని ఏఐ డాక్టర్లన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌లో శిక్షణ పొంది; వైద్య శాస్త్ర విషయాలను, వ్యాధి నిర్ధారణ పద్ధతులను ఆకళింపు చేసుకుని; రోగుల పరిస్థితికి తగినట్లుగా స్పందించడంలో మానవ వైద్యుల కంటే మిన్నగా రూపొందినవి. వైద్యరంగంలోని వివిధ అంశాలపై కూలంకషమైన పరిజ్ఞానం పొందడానికి సాధారణంగా ఏళ్లతరబడి కృషి అవసరమవుతుంది. ఈ ఏఐ డాక్టర్లు మాత్రం కొద్దివారాల్లోనే అంతటి పరిజ్ఞానాన్ని పొందడం విశేషం. సాధారణమైన జలుబు దగ్గు మొదలుకొని అత్యంత సంక్లిష్టమైన జన్యువ్యాధులకు, ఆటోఇమ్యూన్ వ్యాధులకు సైతం ఈ ఏఐ డాక్టర్లు సమర్థంగా చికిత్సలు అందిస్తుండటం విశేషం. నవజాత శిశువుల నుంచి వయోవృద్ధుల వరకు రకరకాల వయసుల్లోని రోగులకు తగిన రీతిలో ఊరటను అందిస్తూ, తగిన చికిత్సతో ఏఐ డాక్టర్లు రోగ నిదానం చేయడమే కాకుండా, రకరకాల మానసిక సమస్యలతో బాధపడే రోగులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన కలిగిస్తుండటం మరింత విశేషం. ఏఐ డాక్టర్లు ఔట్ పేషెంట్లకు వర్చువల్ రియాలిటీ ద్వారా సత్వర సేవలను అందిస్తున్నాయి.