ఆస్పిరిన్‌ రొమ్ముక్యాన్సర్‌తో పోరాడుతుందా? 

Will Aspirin Can Fight With Cancers - Sakshi

పరిపరిశోధన

ఆస్పిరిన్‌ లాంటి సాధారణ నొప్పి నివారణ మాత్ర రొమ్ము క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన క్యాన్సర్లతో పోరాడుతుందా? అంశంపైనే పరిశోధకులు దృష్టిసారించారు. చాలా సులువుగా, చవకగా లభ్యమయ్యే ఆస్పిరిన్‌ వంటి తేలికపాటి నొప్పి నివారణ మాత్రను ఇతర క్యాన్సర్‌ నిరోధక ఇమ్యూనోథెరపీ  మందులతో కలిపి ఇవ్వడం ద్వారా ప్రమాదకరమైన రొమ్ముక్యాన్సర్‌తో పాటు మరో 18 వేర్వేరు రకాల క్యాన్సర్లతో పోరాడవచ్చా అనే అంశంపై పరిశీలించినప్పుడు...  దాదాపు 20 శాతం మేరకు అదనంగా రోగుల ప్రాణాలు నిలపవచ్చనే ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు ఈ దిశగా పరిశోధనలు ముమ్మరమయ్యాయి. కేవలం రోగనిరోధక శక్తి పెంచే ఇమ్యూనోలాజికల్‌ మందులను మాత్రమే ఇవ్వడం కంటే వాటిని ఆస్పిరిన్‌తో కలిపి ఇచ్చినప్పుడు మరింత మెరుగైన ఫలితాలు రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

రొమ్ముక్యాన్సర్‌తో బాధపడే కొంతమంది మహిళలకు వారు కీమోథెరపీ లేదా శస్త్రచికిత్స చేయించుకునే ముందు అవేల్యుమాబ్‌ వంటి ఇమ్యూనాలజీ మందుతో పాటు ఆస్పిరిన్‌ కూడా ఇచ్చారు. దాదాపు వీళ్లంతా ప్రాథమికంగా జబ్బు నయం కాని... తదుపరి దశకు చేరిన మహిళలే. అంటే వాళ్లలో జబ్బు కేవలం రొమ్ముకు పరిమితం కాకుండా... ఇతర అవయవాలకు పాకిందన్నమాట. 

మాంఛెస్టర్‌లోని క్రిస్టీ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌కు చెందిన డాక్టర్‌ యానీ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ ప్రయత్నంలో సానుకూల ఫలితాలు వచ్చాయి. దాంతో ప్రస్తుతం ఈ అధ్యయనాలను మరింతగా విస్తృతం చేస్తూ చాలామందిపై ట్రయల్స్‌ నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

‘‘మా ట్రయల్స్‌లో రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు వ్యాధినిరోధకశక్తిని సమకూర్చే మందులతో పాటు ఆస్పిరిన్‌ వంటి తేలికపాటి యాంటీఇన్‌ఫ్లమేటరీ మందును ప్రయోగించి చూసినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. చాలా తేలిగ్గా లభ్యమయ్యే ఆస్పిరిన్‌... ఇమ్యూనోథెరపీని మరింత ప్రభావవంతంగా జరిగేలా చేస్తున్నట్లు తేలింది. ఇది చాలా చవక కూడా కావడంతో ఈ ఫలితాలు మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపించాయి’’ అంటున్నారు డాక్టర్‌ యానీ ఆర్మ్‌స్ట్రాంగ్‌. ఇవి భవిష్యత్తులో ట్రిపుల్‌నెగెటివ్‌ రొమ్ముక్యాన్సర్‌ మహిళలకు ఓ ఆశారేఖగా పరిణమిస్తాయా అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధిస్తున్నారు. 

చదవండి : ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top