ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Pregnancy And Gynecology Tips And Suggestions By Venati Shobha - Sakshi

నా వయసు 27 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లయింది. ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది. ఇప్పుడు నాకు మూడో నెల. ఇటీవలే ‘కోవిడ్‌’ వచ్చింది. దానికి చికిత్స తీసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో గర్భం నిలుస్తుందా లేదా అని భయంగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– పద్మజ, పొందూరు

మీరు మొదట భయపడటం మానేసి, ఏమైతే అది కానీ అని ధైర్యంగా ఉండటం మంచిది. భయపడటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, హార్మోన్లలో మార్పులు తలెత్తి, దానివల్ల కూడా అబార్షన్లు అయ్యే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల అందరికీ అబార్షన్లు అవ్వాలని ఏమీ లేదు. గర్భంలోని పిండం నాణ్యత కలిగినదైతే అది ఎలాగైనా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ గర్భిణులలో తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ అని నిర్ధారణ అయింది. కాబట్టి కరోనా వైరస్‌ ప్రభావం బిడ్డపై నేరుగా అంత ఏమీ ఉండదు. తల్లి రోగనిరోధక శక్తి బాగా ఉంటే, డాక్టర్‌ సంరక్షణలో వారి సలహా మేరకు సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే తల్లి కూడా దీనిపై పోరాడి బయటకు రాగలుగుతుంది.

చదవండి: కోవిడ్‌ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా?

ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో కోవిడ్‌ వల్ల అధికజ్వరం కారణంగా కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా పారాసెటమాల్‌ మాత్రలు వేసుకోవడం, తడి బట్టతో శరీరాన్ని చల్లగా ఉంచేలా తుడుచుకోవడం చేయాలి. జలుబు, దగ్గు ఉంటే దానికి మందులు వాడుకుంటూ, ఆయాసం లేకుండా ఊపిరి సరిగా ఆడేలా చూసుకోవాలి. గోరువెచ్చని ఉప్పునీటితో నోరు పుక్కిలించడం, ఆవిరి పట్టుకోవడం వంటివి చేసుకోవచ్చు. డాక్టర్‌ సలహా మేరకు కోవిడ్‌ వల్ల రక్తంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి సీబీపీ, సీఆర్‌పీ, డీ–డైమర్‌ వంటి రక్తపరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ, ఆయాసం ఎక్కువై, ఆక్సిజన్‌ తగ్గిపోయి మరీ తప్పదు అనుకుంటే హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యి, ఆక్సిజన్, మిగిలిన అవసరమైన మందులతో చికిత్స తీసుకోవలసి ఉంటుంది.

లేకపోతే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడుకుంటూ జాగ్రత్తగా ఉండవచ్చు. కోవిడ్‌ చికిత్సతో పాటు ప్రెగ్నెన్సీకి వాడే విటమిన్స్‌ వంటి మందులు కూడా తీసుకోవాలి. అలాగే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, మాంసాహారులైతే గుడ్లు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకుంటూ, మంచినీళ్లు బాగా తాగుతూ, విశ్రాంతి తీసుకోవాలి. పదిహేను– ఇరవై రోజుల తర్వాత గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లి, బిడ్డ ఎలా ఉందో చెకప్‌ చేయించుకోవాలి. కరోనా లక్షణాలు మీకు తీవ్రంగా ఉండి, చాలా సమస్యలకు గురైతే తప్ప మామూలుగా కొంచెం లక్షణాలకు గర్భంలోని బిడ్డకు ఏమీ కాదు. కాబట్టి కంగారు పడకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

నా వయసు 30 ఏళ్లు. నాలుగేళ్ల కిందట థైరాయిడ్‌ సమస్య వచ్చింది. దీనివల్ల 85 కిలోలకు బరువు పెరిగాను. ఇప్పుడు మా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఈ సమస్య పెళ్లి తర్వాత సమస్యలేవైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? దయచేసి వివరించగలరు.
– రాధిక, గుంతకల్‌

థైరాయిడ్‌ సమస్య ఉన్నా, దానికి తగిన మోతాదులో మందులు వాడుకుంటూ, థైరాయిడ్‌ హార్మోన్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకుంటే, అందరూ బరువు పెరగాలనేమీ లేదు. థైరాయిడ్‌ అదుపులో లేకపోతేనే బరువు పెరుగుతారు. మీకు పెళ్లి తర్వాత థైరాయిడ్‌ లెవెల్స్‌ అదుపులో ఉంటే, థైరాయిడ్‌ వల్ల సమస్య ఉండదు. కాకపోతే మీ బరువు 85 కిలోలు. అంటే అధిక బరువు. దీనివల్ల హార్మోన్‌ అసమతుల్యతలు ఏర్పడి, పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, అండం విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల సాధారణంగా గర్భం నిలవడానికి ఇబ్బంది, ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి.

చదవండి: నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి?

అలాగే అధిక బరువు వల్ల గర్భం దాల్చిన తర్వాత బీపీ, సుగర్‌ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ఎండోక్రైనాలజిస్టును సంప్రదించి, థైరాయిడ్‌ లెవెల్స్‌ అదుపులో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేయించుకుని, అదుపులో ఉంటే అదే మోతాదులో థైరాయిడ్‌ మందులు వాడుతూ, బరువు తగ్గడానికి ఆహార నియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలను ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నట్లయితే, పెళ్లి తర్వాత పెద్దగా సమస్యలు లేకుండా ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్‌ అదుపులో లేకపోతే, ఎండోక్రైనాలజిస్టు సూచన మేరకు థైరాయిడ్‌ మాత్రల మోతాదును పెంచి వాడవలసి ఉంటుంది.

చదవండి: అది ఫాలో అవ్వొచ్చా?

అలాగే బరువు తగ్గవలసి ఉంటుంది. థైరాయిడ్‌ లెవెల్స్‌ అదుపులో లేకపోతే, పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం, గర్భం వచ్చినా నిలవకుండా, అబార్షన్లు అయ్యే అవకాశాలు కొంతమేరకు ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే థైరాయిడ్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకుంటూ, బరువు తగ్గడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి, పెళ్లికి ముందే బరువు తగ్గడం మంచిది.

డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top