లైఫంతా టెస్ట్‌ ఇంటర్‌లో బెస్ట్‌ | Widow women Himabindu Shines 985 Marks In Telangana Inter Results 2026 | Sakshi
Sakshi News home page

లైఫంతా టెస్ట్‌ ఇంటర్‌లో బెస్ట్‌

Apr 21 2026 12:32 AM | Updated on Apr 21 2026 12:33 AM

Widow women Himabindu Shines 985 Marks In Telangana Inter Results 2026

985/1000

అప్పుల బాధతో....తండ్రి ఆత్మహత్య. పద్దెనిమిదేళ్లకే కుటుంబ బాధ్యత. పెళ్లయిన రెండేళ్లకే కన్నుమూసిన భర్త విషాదం తట్టుకోలేక... పక్షవాతానికి గురైన తల్లి. జీవితమే పరీక్షగా మారింది. చేతిలో పసిబిడ్డతో ఆ పరీక్షలో నెగ్గడానికి మళ్లీ చదువు బాట పట్టింది హిమబిందు. డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న పేదింటి బిడ్డ హిమబిందు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించింది. కోచింగ్‌ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తోంది.

డాక్టర్‌ కావాలనేది తన చిన్నప్పటి కల. దర్జీ పనులు చేసుకునే తండ్రి బట్టలు కొలిచే టేప్‌ మెడలో వేసుకుంటే, ఆదే టేప్‌ తాను వేసుకొని ‘ఇది నా స్టెతస్కోప్‌’ అని  సంబరపడేది హిమబిందు. 

‘కచ్చితంగా నువ్వు డాక్టరవుతావు బిడ్డా’ అని ఎప్పుడూ ఆశీర్వదించే తండ్రి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ బాధ్యతలను తల్లి భుజాన వేసుకుంది. పద్దెనిమిది సంవత్సరాల వయసులో హిమబిందుకు పెళ్లి చేసింది. పెళ్లి అయిన రెండేళ్లకు అప్పుల పాలైన బిందు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం తట్టుకోలేని తల్లికి పక్షవాతం వచ్చింది.

→ దుఃఖసముద్రంలో...
ఒకవైపు అనారోగ్యంతో తల్లి, మరోవైపు పసిబిడ్డ... దుఃఖసముద్రంలో మునిగిపోతున్నట్లుగా అనిపించింది హిమబిందుకు. అయినా ఆ విషాదాన్ని తట్టుకొని నిలబడింది.
‘ఎన్ని కష్టాలు వచ్చినా చదువుకోవాల్సిందే’ అని గట్టిగా అనుకుంది హిమబిందు. మళ్లీ చదువు కొనసాగించింది. ఇంటర్‌ ద్వితీయ  సంవత్సరంలో 985 మార్కులు సాధించి డాక్టర్‌ కావాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతోంది తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లా నడివాడకు చెందిన దుస్సా హిమబిందు.

→ ఎంత కష్టమైనా..
‘ఇంటర్‌లో తెచ్చుకున్న మార్కులు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం... నీట్‌. కోచింగ్‌ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటి దగ్గరే సొంతంగా ప్రిపేరవుతున్నాను. దాతలు సహకరిస్తే నా లక్ష్యానికి త్వరగా చేరగలననుకుంటున్నాను’ అంటోంది హిమబిందు.

కన్నీళ్లు దిగమింగుతూ.. కాలేజీకి..
చిన్నతనంలోనే తండ్రి, పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే 11 నెలల పసిపాపను చేతిలో పెట్టి భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు తల్లి ఆనారోగ్యానికి గురైనా తన లక్ష్యం మాత్రం మరచిపోలేదు హిమబిందు. అటు తల్లిని, ఇటు బిడ్డనూ చూసుకుంటూ పెళ్లితో ఆగిపోయిన ఇంటర్‌ చదువును మళ్లీ మొదలు పెట్టింది. లెక్చరర్లు, తోటి విద్యార్థుల సహకారంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి వెయ్యి మార్కులకు 985 మార్కులు సాధించింది. ఇప్పుడు నీట్‌ పరీక్షకు సిద్ధం అవుతోంది. 

– ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్‌
ఫొటో: మురళీ మోహన్‌

Advertisement
 
Advertisement
Advertisement