
లక్ష్మీ కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు పొందవచ్చునన్న నమ్మకానికి సాక్షాత్తూ వేదసూక్తాల సాక్ష్యం ఉంది. బ్రహ్మ, ఇంద్ర, గంగాధరుల వైభవం కూడా శ్రీదేవి మెల్లని కడగంటి చూపు వల్ల లభించిందే (శ్రీమత్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మ ఇంద్ర గంగాధరమ్...) అని ఆస్తికులు విశ్వసిస్తారు. ఆమె కటాక్షానికి అంతటి శక్తి కలగటం వెనక గల కీలకాన్ని ఆదిశంకరులు కవితాత్మకంగా అభివర్ణించారు.
అల వైకుంఠ పురంలో నెలవైన ఆ శ్రీహరి రూపం మీద, మహాలక్ష్మి చల్లని నల్లని కంటి చూపు సోకిందట. మగువల వీక్షణలు తుమ్మెదల బారులా నల్లగా ఉన్నట్లు భావించటం కవిత్వ సంప్రదాయం, ‘కవి సమయం’. ఆమె క్రీగంటి చూపు తనను తాకగానే హరి పులకించి పోయాడు. ఆయన నిగనిగల శరీరం మీద ఆ పులకలు స్ఫుటంగా కనిపించాయి. నల్లని, దృఢమైన తమాల వృక్షం మీద విరివిగా అంకురించిన చిన్ని చిన్ని మొగ్గల గుత్తుల లాగా కనిపించాయి.
ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్
స్వామి పులకలను తాకిన సరసిజాక్షి వీక్షణలు, అరవిరిసిన ఆ మొగ్గలను ఆశ్రయించిన తుమ్మెదల లాగా కనిపించాయి. తుమ్మెద పువ్వులో మకరందాన్ని స్వీకరించి తనలో నింపుకొంటుంది. అలాగే, సకల సంపదలకూ, విభూతులకూ ఆకరమైన జగన్నాథుడి మీద సోకిన వీక్షణం, ఆ సంపదలనూ, విభూతులనూ కానుకగా అంగీకరించి, స్వీకరించింది. ‘అంగీ’కృతం– అంటే తన శరీరంలో భాగం చేసుకున్నది.
అంగం హరేః పులక భూషణం ఆశ్రయంతీ,
భృంగ అంగనా ఇవ ముకుల ఆభరణం తమాలం,
అంగీకృత అఖిల విభూతిః అపాంగ లీలా
మాంగల్యదా అస్తు మమ, మంగళ దేవతాయాః!
ముకుళములు (మొగ్గలు) ఆభరణంగా గల తమాల వృక్షాన్ని ఆడు తుమ్మెద ఆశ్రయించినట్టు, నారాయణుడి పులకలెత్తిన శరీరాన్ని ఆశ్రయిస్తూ, ఆయన అఖండ విభూతులను స్వీకరించి తనలో ‘అంగీ’భూతం చేసుకున్న మా మంగళ దేవత మహాలక్ష్మి కడగంటి చూపుల లీలా విలాసం, నాకు మంగళ ప్రదాయకము అగుగాక!
ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?
మంగళ దేవతాయాః అపాంగలీలా, మమ మాంగల్యదా అస్తు! ఎంత చింతన చేస్తే అంత మనోహరంగా అనిపించే ఇంతటి అద్భుతమైన ఉత్ప్రేక్ష చేసినప్పుడు, ఆది శంకరాచార్యులకు పట్టుమని పదేళ్ళు కూడా లేవంటారు. పేదరాలి ఇంట సిరులు కురిపించేందుకు, ఆచార్యుల వారు ఆలపించిన ‘కనకధారా స్తోత్రం’లో మకుటాయమానమైన మొదట శ్లోకం ఇది.
– మారుతి శాస్త్రి