మనిషి లక్షణాలు | Human Nature and qualities and conduct | Sakshi
Sakshi News home page

మనిషి లక్షణాలు

Oct 13 2025 5:43 PM | Updated on Oct 13 2025 5:43 PM

Human Nature and qualities and conduct

ఆచారః కుల మాఖ్యాతి
దేశ మాఖ్యాతి భాషణం
సంభ్రమః స్నేహ మాఖ్యాతి
వపురాఖ్యాతి భోజనం’’ 

నడవడిక కులాన్ని (శీలాన్ని), మాటతీరు  ప్రాంతాన్ని, సంభ్రమం (మర్యాదచూపే తీరు) ప్రేమను, శరీరం ఆహారపు అలవాట్లను తెలుపుతాయి. సంభ్రమం అంటే మర్యాద చేయటానికి పడే హడావుడి, కంగారు. ఈ సంభ్రమం ఎంతప్రేమ ఉన్నదో తెలియచేస్తుంది. ఇష్టమైనవాళ్ళు వస్తున్నారంటే కాళ్ళుచేతులు ఆడవు. వాళ్ళకి నచ్చినట్టు చేయాలనే తాపత్రయంలో ఒకదానికి ఒకటి చెయ్యటం కూడా కద్దు. ఆ విధంగా ΄÷రబడటం అవకతవకగా చెయ్యటం ప్రేమకి చిహ్నమే కాని, చేతకానితనం కాదు. కృష్ణుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంలో విదురుడు అరటిపండ్లు ఒలిచి ప్రేమగా పెడదామనుకుని, తొక్కలు కృష్ణుడి చేతిలో పెట్టి, పండు బయట పడేశాడుట! కృష్ణుడు ఆప్యాయంగా ఆ తొక్కలని తిన్నాడు ఆ సంభ్రమం వెనక ఉన్న ప్రేమని గుర్తించాడు కనుక. అదే ఇష్టంలేని వాళ్ళు వస్తే ఉన్నచోటు నుండి కదలబుద్ధి అవదు. తప్పనిసరి అయి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవలసి వస్తే చేయవలసిన మర్యాదలన్నీ ఎక్కువగానే చేసినా మనసుపెట్టి చేసినట్టుగా ఉండదు. యాంత్రికంగా అనిపిస్తుంది.ఒక వ్యక్తి గురించి తెలియటానికి వారి గురించిన పరిచయ పత్రమో, నివేదికో చదివిన దానికన్న, వారిని ప్రత్యక్షంగా చూస్తే బాగా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అన్నదాన్ని చాణక్యుడు చక్కగా తెలియ చేశాడు. ఆచారం కులాన్ని తెలియచేస్తుంది అన్నాడు. ‘‘కుల’’మంటే ఈనాడు మనమనుకునేది కాదు. ఒక వృత్తిని అవలంబించే వారి సముదాయం లేక సంఘం. ఆచారమంటే తరతరాలుగా వస్తున్న అలవాట్లు, పద్ధతులు, సంప్రదాయాలు మొదలైనవి. ఇవి ఒక కుటుంబానికి మరొక కుటుంబానికే మారి΄ోతూ ఉంటాయి. అటువంటిది వృత్తులని బట్టి మారటం సహజమే కదా! ఉదాహరణకి ఉ΄ాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి సమయ΄ాలన, క్రమశిక్షణ తప్పులు లేకుండా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మాట్లాడటం మొదలైనవి అలవాటవుతాయి.

అందుకే ఎవరైనా తాను నిక్కచ్చిగా ఉండి, ఎదుటివారిని కూడా అట్లా ఉండమంటే ‘‘మరీ క్లాసు టీచర్‌ లాగా వెంట పడుతున్నాడు’’ అనటం వింటూ ఉంటాం. పనిచేసే తీరుని బట్టి కూడా ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవాళ్లని చెప్పవచ్చు. అన్ని వృత్తులు కూడా అంతే! కుల శబ్దానికి శీలమనే అర్థం కూడా చెప్పారు. శీలమైనా వ్యక్తమయ్యేది అలవాట్లలోను, పని చేసే తీరులోనే కదా! మాట తీరు ఆవ్యక్తి ఏ్ర ప్రాంతానికి చెందినవాడో తెలియచేస్తుంది. తెలుగు మాట్లాడేవాళ్ళే అయినా వాళ్ళు మాట్లాడే తెలుగు స్వస్థలం ఏదో చెప్పకనే చెపుతుంది. ‘‘ఈ సోరగాడు’’ అనగానే ఎక్కడివారో చెప్పనక్కర లేదు. ‘‘ఈ పిలగాడు’’ అని ఎవరంటారో అందరికి తెలుసు. ‘‘ఈ గుంటడు’’ అంటే ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వారని చెప్పనవసరం లేదు. మాటలే కాదు మాటాడే తీరు, అంటే యాస వాళ్లెక్కడి వాళ్ళో పట్టిస్తుంది. 

ఇదీ చదవండి: పాపాయితోనే మాస్టర్స్‌..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి డబ్బుల్లేక అలా చేశా!

అందుకే పండితులైన వాళ్ళు శిష్టవ్యవహారికం రాయటమే కాదు, మాట లో కూడా ప్రాంతీయత తొంగిచూడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే యాసలో మాట్లాడటం తప్పో తక్కువో అని కాదు. సమతని పాటించటం కోసం అంతే! అదే పరాయిభాష అయితే మరీ తేలికగా తెలిసి ΄ోతుంది. ఉత్తరదేశీయుల ఇంగ్లీషుకి, తెలుగువారి ఇంగ్లీషుకి, తమిళుల ఇంగ్లీషుకి, బెంగాలీల ఇంగ్లీషుకి తేడా స్పష్టంగానే కనిపిస్తుంది. విదేశీయులది సరే సరి. మాట వినగానే ఎక్కడివాళ్ళో వెంటనే తెలిసి΄ోతుంది. ఇక శరీరం తిన్న ఆహారాన్ని ప్రకటిస్తుంది. ఎటువంటి ఆహారం ఎంత తింటారు అన్నది ఆకారాన్ని చూసి చెప్పవచ్చు. మితాహారుల శరీరం చూడ ముచ్చటగా ఉంటుంది. అన్నీ నోటితో చెప్పనక్కర లేదు. చూడగానే తెలిసి΄ోతాయి. మన గురించి మంచి అభి్ర΄ాయం ఎదుటి వారికి కలగాలంటే ప్రవర్తనని, భాషని, ఆహారపుటలవాట్లని సరిచేసుకుంటే సరి. 

చదవండి: Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!

– డాక్టర్‌ ఎన్‌. అనంతలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement