
తమిళనాడు రాష్టం తిరుచ్చిలోని ఒక ఆడిటర్‌కి ఇద్దరు మగపిల్లలు. కవలలైన వారిద్దరూ ఫిజియో థెరపీ కోర్సు చేశారు. స్వంతంగా క్లినిక్ ప్రారంభించాలని అనుకున్నారు. లక్షలు ఖర్చుపెట్టి భవనాన్ని నిర్మించారు.
క్లీనిక్ ప్రారంభించేముందు తిరుమలకెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని తిరుమల బయలుదేరారు. కొండమీద ఇసుక రాలనంత జనం ఉంది. వరాహస్వామి దర్శనం చేసుకుని ఓపికగా క్యూలో నిలబడ్డారు. వైకుంఠం కాంప్లెక్స్‌లో దేవస్థానం వారు అందించిన వేడివేడి పాలు తాగారు. చిన్న చిన్నగా క్యూ కదిలింది.
‘కష్టపడి చదివాము, భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది’ అని కొడుకులిద్దరూ తండ్రితో చె΄్పారు. ‘‘ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ధైర్యంగా ఉండండి’’ అని బదులిచ్చాడు తండ్రి.
ఇంతలో జనం తోసుకోవడం ప్రారంభమయ్యింది. మహాద్వారం వరకు ఒక్కటిగా వచ్చిన ముగ్గురూ వేరయ్యారు. విడివిడిగా దర్శనానికి వెళ్ళారు.
ఆరోజు గురువారం కావడంతో మూలవిరాట్టు పైన నగలేమీ లేవు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చకర్పూరపు నామాన్ని అర్చకులు బాగా తగ్గించి ఉన్నారు. అందువల్ల భక్తులకు శ్రీవారి నేత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేత్ర దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించి ఉచిత ప్రసాదం ఇచ్చే చోట ముగ్గురూ కలిశారు. చిన్న లడ్డులు అందుకున్నారు.
‘‘ఎలా జరిగింది దర్శనం?’’ అని తండ్రి ఇద్దరినీ అడిగాడు. పెద్దబ్బాయి ముఖం నల్లగా పెట్టి ‘‘దర్శనమైతే అయ్యింది కానీ, జనం నన్ను తొక్కేశారు. ఒళ్లంతా హూనమయ్యింది’’ అని బదులిచ్చాడు. చిన్నబ్బాయి మెరుపు ముఖంతో ‘‘స్వామి దర్శనంతోపాటు ఒళ్ళంతా ఫిజియో థెరపీ చేసుకున్నట్లయ్యింది. ఇప్పుడు నా శరీరం తేలికగా ఉంది’’ అన్నాడు.
వెంటనే తండ్రి ‘‘గులాబీ తోటలోకి వెళ్ళిన కొందరు అందమైన గులాబీ పూలను చూస్తారు. మరికొందరు గులాబీ ముళ్ళను చూస్తారు. అలాగే మన జీవితాన్నీ, వృత్తినీ మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే, చెడ్డగా ఆలోచిస్తే అంతా చెడ్డే’’ అన్నాడు. నాన్న చెప్పిన మాటల్లోని అంతరార్థం తెలుసుకున్న కొడుకులిద్దరూ లడ్డు తింటూ మనసులోనే గోవింద నామస్మరణలు చేస్తూ చిన్నగా గుడి బయటికి వచ్చారు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు
(చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..)