
దీపావళి వేళ.. ఒక చిన్న వీడియో, ఒక సరదా ఫోటో అసాధారణ స్పందనను తెచ్చుకుంటున్నాయి. లక్షల మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయి. ఆ సాధారణ దృశ్యాలు, వినూత్న ఆలోచనలను సోషల్ మీడియా మరింత సంబరంగా మార్చుతోంది. వాటిల్లో కొన్ని మీకోసం..
దీపావళి పండుగ వేళ.. ఇంటి డెకరేషన్లు, తమ ముస్తాబులు, తాము చేసుకునే సంబురాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో సరదాగానూ కొంత కంటెంట్ వైరల్ అవుతుంది. సినీ నటులు రజినీకాంత్, బ్రహ్మానందాలు నోట్లో బాంబులు పెట్టుకోవడం.. సినిమాల్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం.. ఓ తెలుగమ్మాయి ధైర్యంగా సుతిల్ బాంబులను చేత్తో అంటించి విసిరేయడం, కుక్క నోటితో బాణాసంచాని కరుచుకుపోయి పదే పదే ఇంట్లో పడేయడం, పొల్యూషన్‌తో సంబంధం లేకుండా బాంబ్‌ఫ్రూఫ్ వేడుకలు(డప్పులు, తినే కంచాలతో సౌండ్లు).. ఇలాగన్నమాట. అయితే ఈసారి కొంత కొత్త స్టఫ్ నెట్‌లో వైరల్ అవుతోంది.
ఇదేం సెలబ్రేషన్ భయ్యా..
అది అత్యంత ఖరీదైన ఏరియా. అలాంటి చోట ‘వెరీ లేజీ సెలబ్రేషన్స్’ను ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది!. అవును.. నోయిడాలో ఓ బ్యాచిలర్ బద్మాషుగాళ్లు చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా.. కుల్వంత్ సింగ్, యాగేశ్వర్ అనే ఇద్దరు కుర్రాళ్లు తమ బాల్కనీకి అలంకరించారు. ఓ గ్రీన్ లైట్ దండ బల్బ్ సెట్‌ను వేలాడదీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే..
రాత్రికి రాత్రే అది ఆ ఇద్దరినీ ఫేమస్ చేసింది. లక్షల మంది దానికి స్పందిస్తూ.. ఆ యువకులపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. దీంతో తమ బాల్కనీని మరిన్ని లైట్ సెట్లతో కలర్‌ఫుల్‌గా మార్చేశారు. కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిందోగానీ లక్షల మందిని ఆకట్టుకున్న ఈ వీడియో వైరల్ సంబరంగా మారింది.
నువ్వో ఆణిముత్యానివి!
దీపావళి వేడుకల్లో ఓ వ్యక్తి ల్యాప్‌ట్యాప్‌తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ చంద్ర అనే వ్యక్తి ఆఫీస్ దీపావళి సెలబ్రేషన్స్ వీడియో అంటూ దానిని పోస్ట్ చేశారు. అయితే.. ఈ వీడియో కొత్తేదేనా? వైభవ్ ఎందుకు పోస్ట్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు.
ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉన్నా.. దీపావళి వేడుకలను మిస్ కాలేదు అంటూ క్యాప్షన్ ఉంచాడు. దీంతో ఆ ఎంప్లాయిపై ఆణిముత్యం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చర్చ మొదలైంది.
టచ్ చేశావ్ భయ్యా..
హైదరాబాద్(తెలంగాణ)కు ఓ వ్యక్తి వెరైటీగా జరిపిన దీపావళి సంబురాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా మనకు డెలివరీలు వస్తే ఏం చేస్తాం.. వెంటనే పెమెంట్ చేసేసి మన పార్శిల్స్ అందుకుని వచ్చేస్తాం. కానీ, ఇక్కడో హైదరాబాదీ వివిధ డెలివరీ యాప్స్‌లో స్వీట్లను ఆర్డర్ చేసి.. తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్స్ చేతికి అందించాడు. పైగా షేక్‌హ్యాండ్‌తో హ్యాపీ దీపావళి చెప్పడంతో నెట్టింట యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు.
యూ నెయిల్డ్ ఇట్ బ్రో!
ఇక్కడో ఆర్టిస్ట్ వెరైటీగా చేసిన ప్రయత్నం.. నెట్టింట సందడి చేస్తోంది. తన సృజనాత్మతకు పని చెబుతూ.. చేతి గోళ్ల మీద ఓ వ్యక్తి పెయింటింగ్ వేశాడు. ఈ త్రీడి నెయిల్ ఆర్ట్‌లో.. బాణాసంచాతో పాటు హ్యాపీ దీపావళి అనే అక్షరాలనూ అతను చెక్కాడు. ఈ క్రమంలో.. ఓ గోటిపై ఏకంగా దీపాన్ని వెలిగించడం గమనార్హం. దీనిపై అతనికి ప్రశంసలతో పాటు కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.