Veganuary: చర్మానికి మంచి నిగారింపు.. ఆరోగ్యమూ బాగుంటుంది: నటి

Veganism: Veganuary Significance All You Need To Know - Sakshi

‘వేగన్‌’న్యువరీ ఉద్యమం.. ఎందుకు?

సమాజంలో చాలామందిలో మాంసాహారపు అలవాట్లు ఉన్నప్పటికీ...  శాకాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న భావన ఎప్పట్నుంచో ఉన్నదే. శాకాహార అలవాటు తాలూకు విప్లవంగా రూపొందిందే ఈ ‘వేగన్యువరీ’.

జనవరి (జాన్యువరీ) లాగే ‘వేగన్‌’న్యువరీ అనే ఓ దీక్ష తీసుకుని నెల్లాళ్లపాటు శాకాహారపు అలవాటు పెంపొందించుకుని, అది మంచి ఫలితాలనే ఇస్తే దాన్నే కొనసాగించాలని కోరుతూ నడుస్తున్న ఉద్యమమే ఈ ‘వేగన్‌’న్యువరీ. దీని గురించి కొన్ని వివరాలు.... దాదాపు 2014 నుంచి ఈ వేగన్‌ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో మాత్రం ఇది అధికారికంగా 2021 డిసెంబరు 9న ప్రారంభమైంది.

ప్రత్యేకత?
‘వేగన్‌’న్యువరీ అనే పేరుతో తొలుత భూతదయా, అటు తర్వాత మొక్కలనుంచే శాకాహారం తీసుకుంటూ మంచి ఆరోగ్యం పెంపొందించుకోవడం, జీవావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ కాపాడుకోవడం కోసం కృషి చేయడం వంటి కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ ‘వేగన్‌’న్యువరీ ఉద్యమానికి మంచి ఆదరణే వస్తోంది. జనవరి మాసమంతా శాకాహారానికి మళ్లుతామంటూ ప్రతినబూనడమే ఈ ‘వేగన్‌’న్యువరీ మాసపు ప్రత్యేకత అన్నమాట. 

పెద్ద సంఖ్యలో చేరువవుతున్న ప్రజలు 
గతేడాది అంటే 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,20,000 మందికి పైగా ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. కేవలం మాంసాహారంలోనే మంచి రుచులు అందుతాయనే వాదనను తోసిరాజంటూ... ఈ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం కోసం శాకాహారాల్లో కొత్త కొత్త రుచులు అన్వేషిస్తున్నారు. దీనికి తార్కాణమే గతేడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన శాకాహార ఉత్పాదనలు!

ఒక అంచనా ప్రకారం 2022లో దాదాపు 1,540 కొత్త శాకాహార ఉత్పాదనలు (వేగన్‌ ప్రాడక్ట్స్‌) అందుబాటులోకి వచ్చాయి. ‘వేగన్‌’న్యువరీ ఉద్యమానికి అత్యద్భుతంగా ప్రచారాలను కల్పించే ఆ  శాకాహార ప్రాధాన్యానికి గతేడాది ప్రపంచవ్యాప్తంగా 4,351 మీడియా కథనాలు వెలువడ్డాయనేది మరో అంచనా. దీనికితోడు ఎన్నో కార్పొరేట్‌ సంస్థలు సైతం అనేక ప్రచార కార్యకలాపాల ద్వారా ఈ ఉద్యమానికి తోడు నిలుస్తున్నాయి. 

మన దేశానిది మూడోస్థానం... 
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.3 లక్షల మంది ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకుంటే అందులో 65,000 మంది మన భారతీయులే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడీ ప్రచార కార్యకలాపాల్లో 228 దేశాలు పాలుపంచుకుంటుండగా... వీటన్నింటిలో మన దేశం మూడో స్థానంలో ఉండటం కూడా ఓ విశేషం. మనకంటే ముందు స్థానంలో ఉన్న దేశాల్లో మొదటిది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (ఇంగ్లాండ్‌) కాగా... రెండోది యూఎస్‌ఏ. 

వీళ్లే మన దేశపు బ్రాండ్‌ అంబాసడర్లు... 
ఈ ఉద్యమపు పదో వార్షికోత్సవం సందర్భంగా మనదేశం నుంచి దాదాపు పదిమంది ప్రముఖులు ఈ క్యాంపైన్‌లో విస్తృతంగా పాలుపంచుకుంటున్నారు.

వీరిలో ప్రముఖ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ సౌందర్యశర్మ, మరో ప్రముఖ నటుడు, ప్రో–బాస్కెట్‌బాల్‌ ఆటగాడు అరవింద్‌కృష్ణ, మ్యూజీషియన్, నటి మోనికా డోగ్రా, ప్రముఖ మౌంటెనీరింగ్‌ నిపుణురాలు ప్రకృతి వర్షిణీ, మరో మౌంటనీరింగ్‌ నిపుణుడు కుంతల్‌ జోయిషర్, ప్రో–టెన్నిస్‌ ఆటగాడు విశ్వజిత్‌ సాంగ్లే, గాయని అనుష్కా మన్‌చందా, మరో ప్రముఖ నటీమణులు స్నేహా ఉల్లాల్, సదా సయీద్‌  మన దేశం నుంచి ఈ ఉద్యమానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా, ప్రచారకులుగా వ్యవహరిస్తున్నారు. మరో వారంలో జనవరి అయిపోతోంది. కనీసం ఆఖరి వారంలో నైనా  వేగన్యువరీని అనుసరిద్దాం.  

ఆరోగ్యమూ బాగుంటుంది
‘వేగనిజం’ అనేది ఓ సంస్కృతి. ఈ సంస్కృతితో మనం తోటి జీవులకు ఎలాంటి హానీ కలగకుండా చూడవచ్చు. అందుకే నేను శాకాహార ఉద్యమాన్ని సమర్థిస్తుంటాను. అంతేకాదు... శాకాహారం తీసుకోవడం వల్ల మన చర్మానికి మంచి నిగారింపు రావడంతో పాటు మన ఆరోగ్యమూ బాగుంటుంది. ఏ జీవికీ హాని లేకుండా మనమూ బతికి, ఇతరులనూ బతకనివ్వడం అనే భావనే ఎంతో ఉన్నతమైనదని నా ఉద్దేశం. – స్నేహా ఉల్లాల్,సినీ నటి. 
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top