కమలా హ్యారిస్‌ ముగ్గురమ్మల కూతురు

US Vice President Kamala Harris Special Story - Sakshi

‘‘అమ్మ కాకుండా మరో ఇద్దరు మహిళలు నా జీవితంలో ఉన్నారు’’ అని కమలా హ్యారిస్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘అమ్మ కాకుండా’ అంటే అర్థం.. అమ్మతో సమానమైన వాళ్లు అనే! కమల తల్లి శ్యామలా గోపాలన్‌ జీవశాస్త్రవేత్త. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై పరిశోధకురాలు. పదేళ్ల క్రితం చనిపోయారు. కమల పద్ధతులు, పాటింపులు అన్నీ తల్లివే. తల్లి ఆమెకు తొలి ఆదర్శం. అందుకే కమల అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన నాటి నుంచీ కమల కన్నా కూడా కమల తల్లి గురించే ఎక్కువగా ప్రపంచానికి తెలిసింది. కమలే చెప్పుకున్నారు తన మాతృమూర్తి గురించి. మరో రెండు రోజుల్లో అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కమల ఇప్పుడు.. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన మరో ఇద్దరు మహిళ గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. వారిలో ఒకరు కమల పొరుగింట్లో ఉండే షెల్టన్‌. ఇంకొకరు కమల ఒకటో తరగతి టీచర్‌ విల్సన్‌. వాళ్లిద్దరితో తను ఉన్న ఫొటోలను కూడా కమల తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కి జత చేశారు. 

‘‘ఇప్పుడు నేనిలా ఉన్నానంటే అందుకు కారణం అమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా. శ్రీమతి షెల్టన్, శ్రీమతి విల్సన్‌. నా చిన్నప్పుడు మేము షెల్టన్‌ ఇంటి పక్కనే ఉండేవాళ్లం. ఆమె మా నైబర్‌. సాయంత్రం అమ్మ డ్యూటీ నుంచి రావడం ఆలస్యం అయితే నేను, చెల్లి మాయ.. నేరుగా షెల్టన్‌ వాళ్ల ఇంట్లోకి వెళ్లేవాళ్లం. అక్కడి తిని, అమ్మ వచ్చి మమ్మల్ని పిలుచుకెళ్లే వరకు అక్కడే పడుకునేవాళ్లం. షెల్టన్‌ మమ్మల్నెంతో ఆదరణగా చూశారు. మేము ఉంటున్న ఓక్‌లాండ్‌కి ఆమె లూసియానా నుంచి వచ్చి ఉంటున్నారు. ఆమె భర్త ఆర్థర్‌. నర్సరీ స్కూల్‌ నడిపేవారు ఆయన. మా ఇంటికి.. వాళ్ల ఇల్లు ఒక కొనసాగింపుగా ఉండేది. ఇక షెల్టన్‌ అయితే జస్ట్‌ లైక్‌ రెండో అమ్మ మాకు. షెల్టన్‌ గలగల మాట్లాడేవారు. అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకునేవారు. అదొక జీవిత విధానంగా చేసుకున్నారు. నాలోని ఆ స్వభావం అమె నుంచి అంటు కట్టుకున్నదే. ‘లా’ అయ్యాక నేను అలామెడా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఆఫీస్‌లో పని చేసే రోజుల్లో కూడా తరచు షెల్టన్‌ వాళ్ల ఇంటికి వెళుతుండేదాన్ని. వంట బాగా చేస్తారామె. ఏవేళనైనా వాళ్లింటికి వెళితే నాకు ప్రియమైవి రెండు లభించేవి. ఒకటి షెల్టన్‌ వెచ్చని కావలింత. రెండు రుచికరమైన భోజనం.

తల్లి శ్యామలతో కమల (ఫైల్‌ ఫొటో)
‘‘ఇక మరో అమ్మ.. శ్రీమతి విల్సన్‌ బర్కిలీలోని థౌజండ్‌ ఓక్స్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో మా ఒకటో తరగతి టీచర్‌. బాల్యంలో నాలో ఆశల్ని, ధైర్యాన్ని నింపింది ఆవిడే. కాన్ఫిడెన్స్‌ కూడా ఆమె ఇచ్చిందే. ఎప్పటికీ నేను ఆమెకు రుణపడి ఉంటాను. పై చదువులకు వెళ్లి ‘లా’ డిప్లొమా చేసి, ఆ సర్టిఫికెట్‌ను అందుకునేందుకు స్టేజ్‌ మీదకు వెళ్లినప్పుడు కూడా విల్సన్‌ నా కోసం వచ్చి ఆడియన్స్‌లో కూర్చొని ఉన్నారు! నవ్వుతూ నావైపే చూస్తూ ఉన్నారు. తన రాకతో నన్ను సంతోష పరచడం కోసం వచ్చారు విల్సన్‌. చిన్నప్పుడు స్కూల్లో ఆమె చెప్పిన పాఠాలు జీవితంలో ఇప్పటికీ నన్ను నడిపిస్తూనే ఉన్నాయి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు చేసుకున్నారు కమలా హ్యారిస్‌.  

జనవరి 20 ప్రమాణ స్వీకారం దగ్గర పడుతున్న కొద్దీ.. ఆమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమల తన జీవితంలోని అమూల్యమైన వ్యక్తులను, ప్రదేశాలను, మరచిపోలేని సందర్భాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ వస్తున్నారు. ఏ విధంగానూ అధికార దర్పాన్ని ప్రదర్శించని ఒక సాధారణ నాన్‌– అమెరికన్‌ సంతతి మహిళను అమెరికా తన తొలి ఉపాధ్యక్షురాలిగా చూడబోతోంది. ఆమె పాలనలో సకల మానవ సౌభ్రాతృత్వ భావనను కూడా. 

తెలిసిన వాళ్లెవరైనా ఒక్కసారిగా పెద్ద పొజిషన్‌లోకి వెళితే.. ‘వాళ్లు మాకు తెలుసు’ అని గొప్పగా చెప్పుకుంటాం. గొప్ప కాకుండా ఎలా ఉంటుంది? మనకు పరిచయం ఉన్నవారు దేశాన్నే పాలించబోతుంటే!! కమలా హ్యారిస్‌ గురించి కూడా ‘ఆమె మాకు తెలుసు’ అని గొప్పగా చెప్పుకోడానికి ఎంతోమంది ఉండే ఉంటారు. అయితే రివర్స్‌లో.. కమలా హ్యారిసే.. ‘చిన్నప్పుడు నాకు అన్నం పెట్టిన అమ్మ’. ‘నాలో ఆశలు నింపిన అమ్మ’ అని ఇద్దరు మహిళల గురించి గొప్పగా చెప్పుకుని, వాళ్లిద్దరికీ తన మాతృమూర్తి స్థానాన్ని పంచడం.. ప్రపంచ ప్రజల దృష్టిలో ఆమెను మరింత ఎత్తుకు ఎదిగేలా చేసింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top