చరిత్రలో పెద్ద మిస్టరీగా మిగిలిన మృత్యులోయ..!

Ural Mountains Death Valley Mystery Story In Funday - Sakshi

ఆధారాలు అస్పష్టమైనప్పుడు అనుమానాలు అల్లే కథలు అన్నీ ఇన్నీ కావు. అర్ధాంతరంగా ముగిసిన అసహజ మరణాలన్నీ ఆ కోవలోకే వస్తాయి. అందులో ఒకటే ‘డయాత్లోవ్‌ పాస్‌ ఇన్సిడెంట్‌!’ రష్యా హిస్టరీలోనే టాప్‌ మోస్ట్‌ మిస్టరీ ఇది. 62 ఏళ్ల కిందట భీకరమైన మంచుకొండల మధ్య తొమ్మిది మంది యువ బృందం మరణాలు.. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాలను తలపించే కథనాలుగా మారాయి. అనారోగ్య సమస్యతో మార్గం మధ్య నుంచే ఆ బృందాన్ని వీడి.. వెనుదిరిగిన పదో వ్యక్తి యూరీ యుడిన్‌ చొరవతో ఇన్వెస్టిగేషన్‌ మొదలైంది. రెండు నెలల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్‌.. అతి క్రూరంగా చనిపోయిన తొమ్మిది మంది శవాలను ఒక్కొక్కటిగా బయటికి తియ్యడంతో కథ క్రైమ్‌ జానర్‌లోకి అడుగుపెట్టింది.

అది 1959 జనవరి 23, సోవియట్‌ యూనియన్‌లోని స్వెర్డ్‌లోవ్‌స్క్‌ ప్రాంతంలోని యెకాటెరిన్‌ బర్గ్‌లోని యూరల్‌ పాలిటెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన 23 ఏళ్ల రేడియో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఇగోర్‌ డయాత్లోవ్‌ ఆధ్వర్యంలో పది మంది స్నేహితుల బృందం స్నో ట్రెకింగ్‌కి యూరల్‌ పర్వతాలవైపు కదిలిన రోజది. వీరంతా కెమెరాలు, డైరీలు వెంటతీసుకుని వెళ్లడంతో.. వారి మరణానంతరం అవే ఆధారలయ్యాయి. 

ఈ బృందంలో ఇగోర్‌ డయాత్లోవ్, యూరీ యుడిన్‌లతో పాటు క్రివోనిషెంకో, అలెగ్జాండర్‌ కొలెవతోవ్, రస్టెమ్‌ స్లాబోడిన్, సెమియాన్‌ జోలొతారియోవ్, డోరోషెంకో, నికోలాయ్‌ థిబక్స్‌ బ్రిగ్నోల్లె అనే మరో ఆరుగురు యువకులు.. లియుడ్మిలా డుబినినా, జినైడా కోల్మోగోరోవా అనే ఇద్దరు యువతులు ఉన్నారు. వీరంతా స్నో ట్రెకింగ్‌ అనుభవజ్ఞులే. వీరి లక్ష్యం పది కిలో మీటర్ల ఎత్తైన మంచు పర్వతానికి చేరుకోవడమే. అయితే అలా జరగలేదు. జనవరి 28న యూరీ యుడిన్‌ అనారోగ్య సమస్యలతో వెనుదిరిగాడు. మరుసటి రోజు మిగిలిన తొమ్మిది మంది బృందం ఖోలాత్‌ చాహ్ల – ఒటార్టెన్‌ పర్వతాల దిశలో బయలుదేరారు. 


                                       ఇగోర్‌ డయాత్లోవ్‌ (బృందానికి లీడర్‌)

అయితే ఫిబ్రవరి 12 కల్లా తిరిగి రావల్సిన బృందం.. ఫిబ్రవరి 19 అయినా రాలేదు. దాంతో యూరీ యుడిన్‌కి భయం మొదలైంది. కంప్లైంట్‌ ఇవ్వడంతో.. ఆరు రోజుల శోధన తరువాత, హోలాట్‌– చాహ్ల్‌ పర్వత వాలుపై వారి గుడారాన్ని కనుగొన్నారు. 

అయితే అది ముందుభాగమంతా  మంచుతో కప్పి, వెనుక భాగమంతా తప్పించుకోవడానికే అన్నట్లు కత్తితో చీల్చినట్లు ఉంది. అక్కడ నుంచి బయటికి తొమ్మిది జతల పాద ముద్రలు కనిపించాయి. 5 వందల మీటర్ల దూరంలో పైన్‌ చెట్టు కింద.. అగ్ని అవశేషాలు, దాని పక్కనే 2 మృతదేహాలున్నాయి. అవి క్రివోనిషెంకో, డోరోషెంకోలవి. వారు కేవలం లోదుస్తులతో ఉన్నారు. కొద్ది దూరంలో మరో మూడు శవాలు కనిపించాయి. అవి డయాత్లోవ్, కోల్మోగోరోవా, స్లాబోడిన్‌లవి. చెల్లాచెదురైన వారి వస్తువుల్లో దొరికిన డయాత్లోవ్‌ డైరీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పడటంతో ఈ ఘటనకి అతడి పేరే వచ్చింది. మిగిలిన శవాలు దొరకడానికి రెండు నెలల కంటే ఎక్కవ సమయమే పట్టింది. 

ఈ సంఘటన చరిత్రలో పెద్ద మిస్టరీగా మారడానికి కారణం చివరిగా మే 4న దొరికిన ఆ నాలుగు శవాలే. తలలు పగిలి, ఎముకలు విరిగి, పెద్ద యాక్సిడెంట్‌ జరిగినట్లుగా ఉంది వాటి వాలకం. కొందరికి నాలుక, కళ్లు మిస్‌ అయ్యాయి. కొందరికి ఒంటిమీద బట్టలు సరిగా లేవు. ఎవరో దాడి చేయకపోతే బట్టలు, షూస్‌ లేకుండా అంత మంచులో శిబిరం నుంచి బయటకి పరుగు తీయాల్సిన అవసరమేంటనే అనుమానాలు మొదలయ్యాయి. దాంతో 70కి పైగా ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. 


                                             యూరీ యుడిన్‌ నాడు – తర్వాత

డయాత్లోవ్‌ డైరీలో విషయాలు... లోకల్‌ ట్రైబల్స్‌ చాలా భయంకరంగా ఉన్నారు. హైకింగ్‌కి వెళ్లొద్దని మాకు వార్నింగ్‌ ఇచ్చారు. రాత్రి మేమంతా ఎంజాయ్‌ చేస్తుంటే మాకు కాస్త దూరంలో ఏదో వింత ఆకారం కనిపించింది. కళ్లు ఎర్రగా ఉన్నాయి. మరో చిన్న జంతువుని నోటకరచి వేగంగా పారిపోయింది. బహుశా మంచు చిరుత అయ్యుండొచ్చు. ఎందుకో కాస్త భయంగా అనిపిస్తోంది. ఎవరో మమ్మల్ని గమనిస్తున్నట్లు, ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఏవో సడన్‌గా కదులుతున్న శబ్దాలు.. వినిపి స్తున్నాయి. ఈ రోజు డిన్నర్‌ తర్వాత నక్షత్రాలను చూస్తుంటే ఆకాశంలో ఏవేవో లైట్స్‌ కలర్‌ ఫుల్‌గా కనిపించాయి. విమానం ఎగురుతున్నట్లు పెద్ద శబ్దం.. గాలిలో ఆ కాంతి కనిపించింది.

వాటిలో ముఖ్యంగా.. డయాత్లోవ్‌ తన డైరీలో రాసినట్లు గొడవ పడిన ట్రైబల్సే చంపేసుంటారని, రష్యన్స్‌ బలంగా నమ్మే స్నోమన్‌(యతి) చంపేశాడని, ఆ బృందాన్ని వ్యతిరేక శక్తి అని భావించిన ప్రభుత్వమే ఎన్‌ కౌంటర్‌ చేసిందని, రాకెట్‌ ప్రయోగం ఫెయిల్‌ (డయాత్లోవ్‌ డైరీలో రాసుకున్నట్లు ఆ రోజు నైట్‌ కనిపించిన లైట్స్‌ రష్యా ప్రయోగించిన రాకెట్‌ వెలుగులని తేలింది) అయ్యుంటుందని.. ఇలా ఎన్నో వినిపించాయి. 

కానీ ఇది వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన మరణాలుగా తేల్చి అప్పట్లో కేసు క్లోజ్‌ చేసింది రష్యన్‌ గవర్నమెంట్‌. వీరందరి జ్ఞాపకార్థంగా ఒక స్థూపాన్ని కూడా నిర్మించింది. 60 ఏళ్ల దాటినా ఈ కేసుకు సంబంధించి విమర్శలు ఆగకపోవడంతో.. 2019లో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి.. కేసును రీ ఓపెన్‌ చేసి.. ప్రతిదానికి ఒక రీజన్‌ చూపిస్తూ.. మరోసారి అదే విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆ తీర్పుని మృతుల కుటుంబాలు మాత్రం అంగీకరించలేదు.

ఆ బృందంలో సజీవంగా మిగిలిన యూరీ యుడిన్‌.. 2013 వరకూ జీవించే ఉన్నాడు. 75 ఏళ్ల వయసులో మరణించిన యుడిన్‌.. చనిపోయే వరకూ అపరాధభావంతోనే బతికాడు. ‘నేను వాళ్లని మధ్యలోనే వదిలేసి రాకుండా ఉండాల్సింది.. నేను వాళ్లతో ఉండుంటే వాళ్లు బతికుండేవారేమో’అని కుమిలిపోయాడు. పైగా తన గర్ల్‌ఫ్రెండ్‌ లియుడ్మిలా డుబినినా ఈ దుర్ఘటనలో చనిపోవడంతో ఆమె జ్ఞాపకాల్లోనే బతికాడు పెళ్లి చేసుకోకుండా. ప్రతీ ఏడాది ఫిబ్రవరి 2న తన స్నేహితుల స్మారక స్థూపానికి కన్నీటితో నివాళి అర్పించేవాడట. మొత్తం ఈ సంఘటనతో పాటు యూరీ విషాదాంత ప్రేమ కథ మీదా రష్యాలో చాలా సినిమాలు వచ్చాయి.

లియుడ్మిలా డుబినినా

- సంహిత నిమ్మన

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top