బైడెన్‌ టీమ్‌ మనవాళ్లే మరో ఇద్దరు

Two Indian-American Women Appointed By Biden Administration For UN Roles - Sakshi

ట్రంప్‌ తన నాలుగేళ్ల పదవీ కాలంలో లోకంతో అనేక తగాదాలు పెట్టుకున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితినీ, ప్రపంచ ఆరోగ్య సంస్థనూ ఆయన వదల్లేదు! ‘మా డబ్బు తీసుకుంటూ మాకు శత్రువులు అయినవారికి అనుకూలంగా ఉంటారేంటి!’ అని ఆయన ఘర్షణ. ‘శత్రు దేశాలు ఉంటాయి కానీ.. సమితులకు, సంస్థలకు అన్నీ స్నేహదేశాలే’ అని వారి సమాధానం. ఇప్పుడీ దెబ్బతిన్న సంబంధాలన్నిటినీ కొత్త అధ్యక్షుడు బైడెన్‌ చక్కబెట్టుకుంటూ రావాలి. అందుకే ఆయన ఆచితూచి రాయబార సిబ్బందిని ఎంపిక చేసుకుంటున్నారు. ఆ వరుసలో తాజాగా అపాయింట్‌ అయినవారే సోహినీ చటర్జీ, అదితీ గొరూర్‌. ఇద్దరూ భారత సంతతి అమెరికన్‌లు.

ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారికి సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా సోహినీ చటర్జీ వెళుతున్నారు. ఆమెతోపాటు పాలసీ అడ్వైజర్‌గా ఆమెకన్నా వయసులో చిన్నవారైన అదితీ గొరూర్‌. అమెరికా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్లిద్దరూ కీలకమైన స్థానాలకు ఎంపికైనవారు. ఈ ఇద్దరినే బైడెన్‌ తీసుకోడానికి తగిన కారణాలే ఉన్నాయి. సోహినీ ఇటీవలి వరకు కొలంబియా విశ్వవిద్యాలయంలోని ‘అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల విద్యాసంస్థ’ లో సహాయ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల అర్థిక పరిస్థితులు, జాతుల అణచివేతలు, ఘర్షణల మూలాలు సోహినీ మునివేళ్లపై ఉంటాయి. ఏ వేలితో ఏ మీటను నొక్కితే సమస్యకు పరిష్కారం క్రియాశీలం అవుతుందో ఆమెకు తెలుసు. యు.ఎస్‌.ఎ.ఐ.డి. (యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌)లో కూడా సోహినా కొన్నాళ్లు పని చేశారు. అక్కడి పాలసీ, ప్లానింగ్, లెర్నింగ్‌ బ్యూరోలో ఆమె పని. ఒబామా హయాంలో బైడన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సోíß నీ సీనియర్‌ పాలజీ అడ్వైజర్‌గా పని చేశారు. ఆ అనుభవం చూసే బైడెన్‌ ఇప్పుడు ఆమెను ఎంపిక చేసుకున్నారు. లాయర్‌ గా కూడా సోహినీ ప్రసిద్ధురాలు.
∙∙
అదితి గొరూర్‌ ఇంతకుముందే యు.ఎన్‌.తో కలిసి పనిచేశారు. సమితి శాంతి పరిరక్షక విభాగంలో నిపుణురాలిగా ఉన్నారు. ప్రపంచాన్ని మెరుగుపరిచే వినూత్న ఆవిష్కణల కోసం కృషి చేస్తుండే ప్రఖ్యాత స్టిమ్సన్‌ సెంటర్‌ (వాషింగ్టన్‌) లో అదితి కాన్‌ఫ్లిక్ట్స్‌ ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. జాతుల ఘర్షణల నుంచి పౌరులను కాపాడటం ఆ కార్యక్రమ లక్ష్యం. స్టిమ్సన్‌లో చేరకముందు అదితి బెంగళూరు లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ సెటిల్‌మెంట్స్‌’లో, వాషింగ్టన్‌ డీసీలోని ‘ఏషియన్‌ ఫౌండేషన్‌ అండ్‌ సెంటర్‌ ఫర్‌ లిబర్టీ ఇన్‌ ది మిడిల్‌ ఈస్ట్‌’ సంస్థలో, మెల్‌బోర్న్‌ లోని ‘యూనివర్సిటీ లా స్కూల్‌’లో మానవ హక్కుల పరిరక్షణపై అధ్యయనం జరిపారు. ఆమె చదివింది కూడా అదే చదువు. జార్జిటౌన్‌ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ’లో ఎం.ఎం చేశారు. మెల్‌బోర్న్‌ యూనివర్సిటీలో ఆనర్స్‌తో ‘లా’ చదివారు. అదితి నైజీరియాలోని లాగోస్‌ లో పుట్టారు. ఇండియా, ఓమన్, ఆస్ట్రేలియాల్లో పెరిగారు. యు.ఎస్‌.లో స్థిరపడ్డారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top