లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! | Suchindram Thanumalayan Temple, Tamil Nadu | Sakshi
Sakshi News home page

లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం

May 14 2026 4:42 PM | Updated on May 14 2026 4:47 PM

Suchindram Thanumalayan Temple, Tamil Nadu

మన దక్షిణాదిన శుచీంద్రం ప్రముఖ శివ క్షేత్రాలలో ఒకటి. ఎంతో మహిమ గల శైవదేవాలయం. స్వర్గాధిపతి దేవేంద్రుడు శాపవిమోచన పొందిన స్థలం. మరి మనకి కూడా తెలిసీ తెలియక చేసిన తప్పులకి  ప్రార్థనతో పొదవచ్చు. స్త్రీవ్యామోహంతో శాపం పొందిన ఇంద్రుడు ఇక్కడ పాప మోచనం పొంది శుచిత్వం పొందడంతో శుచీన్ద్రం అని పేరు వచ్చింది. ఆ కథ, శుచీంద్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.  

ఒకసారి అహల్య అందాన్ని చూసి మోహ పరవశుడు అయ్యాడు దేవేంద్రుడు. అప్పుడు ఇంద్రుడు తెల్లవారక ముందే కోడికూత వేసి గౌతమ మునిని స్నానానికి పం΄ాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అనసూయ దగ్గరకి వచ్చాడు. జరిగిన మోసం గ్రహించి గౌతమ ముని తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడిని, అహల్యని చూసి శపించాడు. శిలగా మారిన అహల్య శ్రీ రాముని పాదస్పర్శ తగిలి ఇక్కడే శాప విమోచనం పొందింది. 

ఇక్కడే అత్రి మహా ఋషికి ఆశ్రమం ఉండేది అందుకే జ్ఞానారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక చెట్టు మొదలు నరికినప్పుడు శివలింగం కనిపించింది. గొడ్డలి దెబ్బకి శివలింగం నుండి రక్తం కారసాగింది. ఇది దేవాలయ మూలస్థానంగా చెబుతారు. సుచీన్ద్రంలో మహాశివుని ప్రతిష్ట ఉన్నప్పటికీ త్రిమూర్తి సంకల్పం కూడా ఉంది. కారణం ఇక్కడ వృక్షాలలో త్రిమూర్తులు ఉన్నారు అని చెట్లకు పూజ చేస్తారు. 

తప్పు చేసిన వారు పాప పరిహారంగా సుచీన్ద్రుని దర్శించుకుని భక్తులు పాప విమోచనం పొందుతారు. సుచీన్ద్రుని ముందు మరుగుతున్న నేతిలో వెండి విగ్రహాన్ని వేస్తాడు పూజారి. తప్పు చేసిన వారు ఆ విగ్రహాన్ని చేతితో తీయాలి. పూజారి ఆ చేతిని వస్త్రంతో కట్టి మూడు రోజుల తరువాత విప్పుతాడు. చేతి చర్మం రంగు మారినా వ్రణం ఏర్పడినా ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తారు. బ్రిటిష్‌ వారు ఈ విధానానికి స్వస్తి పలికారు. 

మహాభిషేకం సమయంలో భక్తులు రథం లాగుతారు. ఈ కార్యక్రమానికి సుచీన్ద్రం వాసులు ఎక్కడ ఉన్నా వచ్చి పాల్గొంటారు. ఆ విధంగా తమ పాప ప్రక్షాళనం చేసుకుంటారు. ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడి స్తంభాలను మీటితే సప్తస్వరాల ధ్వని వినిపిస్తుంది. స్త్రీ రూపంలో చెక్కిన వినాయకుడు, రుద్రవీణ వాయిస్తున్న రావణాసురుడు, నోటిలో తిరుగుతున్న భూగోళం, రామాయణ మహాభారతాల రాతి శిల్పాలు... ఎంత చూసినా అద్భుతమే. 

మన దేశంలో లాటరీ విధానం ఇక్కడ నుండి ప్రారంభించారు అని అధికారిక పత్రాలు ఉన్నాయి ఇక్కడ. శుచీన్ద్రం రాజ గోపుర పునరుద్ధరణకు డబ్బు అవసరం ఏర్పడింది. అప్పటి తిరువనంతపురం రాజు గారి అనుమతితో ఒక రూపాయి లాటరీ టికెట్‌ అమ్మకం చేశారు. పదివేల రూపాయల బహుమతి. యాభై వేల టికెట్లు అమ్మారు. బహుమతి సొమ్ము పోను మిగిలిన డబ్బుతో ఆలయాన్ని పునరుద్ధరించారు.  

ఈ ఆలయం మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. పచ్చని అడవితో పాలార్‌ నదీ ప్రవాహం, శిల్పకళా వైభవం మంచి అనుభూతినిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ టూర్‌ శబరిమల యాత్రలో సుచీన్ద్రం వెళ్లడం సులువు. కన్యాకుమారి నుండి 18, నాగర్కోయిల్‌ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సుచీన్ద్రం శివ క్షేత్రం. సుచీన్ద్రంలో అంతగా లాడ్జీలు లేవు. నాగర్కోయిల్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. 
– ఇ.ఎస్‌. మాధవన్, విశాఖపట్నం

(చదవండి: మైసూరు మహాదేవి చాముండేశ్వరి)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement