
వండర్ వరల్డ్
పిల్లలూ...మనకు జలపాతాలు ఎక్కడ కనిపిస్తాయి? పెద్ద పెద్ద పర్వతాల నుండి జాలు వారుతూనో, చిన్నపాటి మెరక నుండి పల్లానికి దిగుతూనో దర్శనమిస్తాయి. కానీ మీరెప్పుడైనా సముద్రం లోపల వాటర్ ఫాల్‌ని చూశారా? అదెలా... అసాధ్యం కదా అనుకుంటున్నారా? ప్రకృతికి అన్నీ సాధ్యమే! మారిషన్ (Mauritius) ద్వీపంలోని మోర్న్ బ్రాబాంట్‌ప్రాంతపు సముద్రంలో ఏర్పడే ఒక అద్భుతమైన సహజ దృశ్యమే ఈ సముద్రపు జలపాతం. ఇది నీటి ఉపరితలంపై కనిపించే సాధారణ జలపాతం కాదు. సముద్ర గర్భంలో జరిగే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రక్రియ.
ఎలా ఏర్పడుతుంది?
ఇది సముద్రం లోపల ఉన్న భౌగోళిక నిర్మాణం మరియు నీటి సాంద్రతలో తేడాల వల్ల ఏర్పడుతుంది. మారిషస్ వద్ద, సముద్ర భాగంలో ఒక పెద్ద షెల్ఫ్ (కొండ లాంటి నిర్మాణం) ఉంది. సముద్రపు నీరు ఒక్కసారిగా కొండవద్దకు చేరుకొని ఆ కొండ తాలూకా లోతైన గర్భంలోకి దిగుతుంది. ఈ షెల్ఫ్ మీదుగా సముద్ర ధారలు, ఇసుక లోతైన సముద్రంలోకి జారి΄ోతాయి. ఈ ప్రవాహం ఒక జలపాతం లాంటి దృశ్యాన్ని సృష్టిస్తుంది. దీన్ని శాస్త్రవేత్తలు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ (దృష్టి భ్రమ) గా పరిగణించినప్పటికీ పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీన్ని చూసేందుకు వివిధ దేశాల నుండి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ దృశ్యాన్ని మరింతగా అనుభూతి చెందేందుకు సముద్రం మీదుగా హెలికాప్టర్ రైడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!