రియాలిటీ తెలిసింది

Special Story On Bigg Boss 4 Telugu Winner Abijeet Duddala - Sakshi

బిగ్‌ స్క్రీన్‌లో నటించాలి. బిగ్‌ హౌస్‌లో జీవించాలి. రెండూ తెలిసిన కుర్రాడు అభిజీత్‌. సహజంగానే స్ట్రాంగ్‌. ‘రియాలిటీ’తో.. మరింత స్ట్రాంగ్‌ అయ్యాడు. విజేతగా నిలిచాడు. ‘ఈ విజయం వీక్షకుల కటాక్షమే’ అంటున్నాడు. 

సినిమా ఇండస్ట్రీలో డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన వాళ్లది గత తరం. ఇంజనీర్‌ అయ్యి సినిమాల్లోకి వస్తున్న తరం ఇప్పటిది. ఈ తరానికి నవ ప్రతినిధి అభిజీత్‌. ‘‘సినిమాకి ఉన్న అందం అది. ఎప్పటికీ వన్నె తగ్గని కళ అది. అందుకే ఈ ఆకర్షణకు లోనయ్యాను’’ అని పెద్దగా నవ్వేశాడు అభిజీత్‌. స్కూల్‌లో నేర్చుకున్నవి కాలేజ్‌లో మనల్ని నడిపిస్తాయి. కాలేజ్‌లో నేర్చుకున్నవి సమాజంలో నడిపిస్తాయి. చదువు సమాజంలోకి ధైర్యంగా నడిపించే సాధనం అయితే... సమాజం నుంచి నేర్చుకున్న జ్ఞానం మనిషిగా నిలబెడుతుంది. బిగ్‌బాస్‌ తనకు అలాంటి జ్ఞానాన్నే ఇచ్చిందని అన్నాడు అభిజీత్‌. ‘‘బిగ్‌బాస్‌ హౌస్‌లో జీవించడం మాత్రం జీవితంలో గొప్ప అనుభవం. ఒక మామూలు మనిషిని గొప్ప వ్యక్తిత్వంతో మలచగలిగిన శక్తి ఈ రియాలిటీ షోకి ఉంది. బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందు అభిజీత్‌కి, బిగ్‌బాస్‌ విజేతగా బయటకు వచ్చిన అభిజీత్‌కి మధ్య తేడా ఉంటుంది. ఆ మార్పును మీరే చూస్తారు’’ అని అన్నాడు అభిజీత్‌. ‘‘బిగ్‌బాస్‌ విజేత కావడం కంటే చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అదృష్టం నాకు ఎక్కువ ఆనందాన్నిస్తోంది. ఈ షోలో విజేతనయ్యాను కాబట్టే ఆ అదృష్టం దక్కింది. కాబట్టి బిగ్‌బాస్‌ విజేత అనే ట్యాగ్‌ని ఎప్పటికీ గౌరవిస్తాను. ఈ షో పట్ల గౌరవంగా ఉంటాను’’ అని చెప్పాడు. 

అమలగారూ నాకు అమ్మే
మొదటి సినిమా ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో అమల కొడుకు అభిజీత్‌. ‘‘అమలగారు ఎంత కేరింగ్‌గా ఉండేవారంటే... ‘అభీ నువ్వు తిన్నావా’ అని అడిగేవారు. అంతటి సీనియర్‌ నటితో సీన్‌ అంటే ముందుగానే రెండు– మూడు రిహార్సల్స్‌ చూసుకుని సిద్ధంగా ఉండేవాళ్లం. కానీ ఆమె కొత్తవాళ్లు కదా భయపడతారేమోనని ‘ఓకేనా, ప్రిపరేషన్‌కి మరికొంత టైమ్‌ కావాలా’ అని అడిగేవారు. నాగార్జున సర్‌ నుంచి డెడికేషన్, డిసిప్లిన్‌ నేర్చుకున్నాను.  మా సమస్యలను అర్థం చేసుకుని అందులో నుంచి ఒక పంచ్‌ వేసి మమ్మల్ని నార్మల్‌ చేయడానికి ప్రయత్నిస్తారాయన. అఖిల్‌ కూడా అమలగారిలాగానే ఉంటారు. ఆ కుటుంబం నుంచి చాలా నేర్చుకోవచ్చు’’ అంటూ నాగార్జున్‌ సర్‌ని అంత దగ్గరగా అన్ని రోజుల పాటు ఆయనతో కలిసి పని చేసే అవకాశం బిగ్‌బాస్‌ షో ద్వారా వచ్చిందని అభిజీత్‌ సంతోషంగా చెప్పాడు. 

ఇంకా స్ట్రాంగ్‌ అవాలి
మంచి ప్రమాణాలున్న రిషీవ్యాలీ స్కూల్, జేఎన్‌టీయూ, మసాచుసెట్స్‌లో చదువు తనను వ్యక్తిగా దృఢంగా నిలబెట్టాయని చెప్పాడు అభిజీత్‌. ‘‘బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే వరకు ‘నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్‌’ అనుకునే వాడిని. నేను మరింత స్ట్రాంగ్‌గా మారాలని హౌస్‌లోకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే తెలిసింది. కొన్ని సందర్భాలు నన్ను ఎమోషనల్‌గా మార్చాయి. మానసికంగా బలహీన పరిచే సంఘటనలు కూడా ఎదురయ్యాయి. నేను తప్పు చేయలేదు కదా, ఎందుకిలా అవుతోంది అని బాధపడిన సందర్భాలున్నాయి. అయితే ఆందోళన, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగిన నిగ్రహం నాలో ఉంది. అది నేను చదువుకున్న మంచి విద్యాసంస్థల శిక్షణతోనే వచ్చింది. నేను బలహీన పడిన ప్రతి సందర్భంలోనూ వీక్షకులు నాకు అండగా నిలిచారు. నన్ను విజేతగా నిలపడానికి వాళ్లందరూ ఇచ్చిన మద్దతు మర్చిపోలేనిది. నా కుటుంబం ఇచ్చినంత సహకారాన్ని నాకు తెలియని చాలా మంది నుంచి కూడా పొందగలగడం నిజంగా వరమే’’ అని తనకు ఓట్లేసి విజేతగా నిలిపిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేశాడు.

నటనకే నా జీవితం
నటనలో కెరీర్‌ను మలుచుకోవడం కాదు, నటన కోసం జీవితాన్ని అంకితం చేస్తానన్నాడు అభిజీత్‌. సినిమా థియేటర్, ఓటీటీ ఏదైనా సరే... నటనలోనే జీవితం, నటనతోనే జీవితం... అంటూ ‘మా అమ్మకు నన్ను తెర మీద చూడడం ఇష్టం’ అని అసలు రహస్యాన్ని బయటపెట్టాడు.‘‘మా నాన్న మాత్రం చదువుకుని ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ స్థిరపడాలని కోరుకున్నాడు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అమ్మ నేను పెద్ద హీరోనైపోయినంతగా సంతోషపడింది. అమ్మ కోరుకున్నట్లు ‘హీరో అభిజీత్‌’గా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నాడు అభిజీత్‌.

అమ్మాయి ఎంపిక  
ఇక జీవిత భాగస్వామిని నిర్ణయించే బాధ్యత అమ్మకే ఇచ్చేశానని చెప్పాడు ఈ బిగ్‌బాస్‌ తాజా విజేత. ‘‘ఈ రోజు నేను అందరి ఎదుట ఇలా నిలబడగలిగానంటే... అది నా ఒక్కడి సమర్థత, కాదు. అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ అందరి ఆశలు, ప్రయత్నం, శ్రమ ఉన్నాయి. వాళ్లు మంచి చదువుని, మంచి జీవితాన్నిచ్చారు. నా జీవితంలో, మా కుటుంబంలో చక్కగా ఇమిడిపోగలిగిన అమ్మాయి ఎంపిక కూడా మా అమ్మ అయితేనే కరెక్ట్‌గా చేయగలుగుతుంది. ఓకే... థాంక్యూ’’ అంటూ ఇంటర్వ్యూ ముగించాడు అభిజీత్‌. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top