
ప్రతి విద్యార్థి రోజూ గంటలు, గంటలు చదువుతున్నారు. అయినా పరీక్షల్లో గందరగోళ పడుతున్నారు. చదివినది గుర్తురాక, పరీక్షలు సరిగా రాయలేక ఆందోళనకు లోనవుతున్నారు. దాంతో పేరెంట్స్, టీచర్స్ మరిన్ని గంటలు చదవమని ఒత్తిడి పెడుతున్నారు.
విద్యార్థులతో రెండు దశాబ్దాలకు పైబడి పనిచేస్తున్న సైకాలజిస్ట్‌గా, జీనియస్ మ్యాట్రిక్స్ డెవలపర్‌గా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా, ఎంత బాగా చదివామనేది ముఖ్యం. మెదడు ఎలా నేర్చుకుంటుందో తెలుసుకుని చదివితే మార్కులు పరుగెత్తుకుంటూ వస్తాయి. లేదంటే మీరు పెట్టే శ్రమ, టైమ్, ఫీజులు అన్నీ వృథా అవుతాయి. అందుకే స్మార్ట్‌గా ఎలా చదవాలో తెలుసుకుందాం. లైఫ్ లాంగ్ లెర్నర్‌గా ఎదుగుదాం. మార్కులు, ర్యాంకుల కన్నా ఇదే నిజమైన విజయం.
లెర్నింగ్ సైన్స్
మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు నాడీకణాల మధ్య బంధాలు బలపడతాయి. ప్రతిసారి రివిజన్ చేసేటప్పుడు ఆ బంధాలు మైలినేషన్ అనే ప్రక్రియ ద్వారా వేగవంతం అవుతాయి. అప్పుడు గుర్తుంచుకోవడం సులువవుతుంది. స్పేస్డ్ రిపిటీషన్, రిట్రీవల్ ప్రాక్టీస్, ఇంటర్ లీవింగ్ వంటి టెక్నిక్స్ వల్ల చదివింది బాగా గుర్తుంటుందని కెంట్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది.
యాక్టివ్ రీకాల్: ఒక సెక్షన్ చదివాక, పుస్తకం మూసేసి ‘ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, నా ప్రెజెంట్ నాలెడ్జ్‌తో అదెలా కలుస్తుంది, నేర్చుకున్నది ఏమిటి?’ అని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇది జ్ఞాపకంలో నుంచి సమాచారాన్ని తిరిగి తెస్తుంది. దీని వల్ల జ్ఞాపకం బలపడుతుంది.
స్పేస్డ్ రిపిటీషన్: ఎవరేం నేర్చుకున్నా 24 గంటల్లో దాదాపు 70 శాతం మర్చిపోతారు. దీర్ఘకాలం గుర్తుండాలంటే 24 గంటల్లోపు ఒకసారి రివిజన్ చేయాలి. ఆ తర్వాత వారం, నెల, మూడు నెలల వ్యవధిలో రివిజన్ చేయడం వల్ల నేర్చుకున్నది దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి చేరి పూర్తిగా గుర్తుంటుంది.
ఇంటర్ లీవింగ్: ఒకే సబ్జెక్ట్ గంటల తరబడి చదవకుండా, సంబంధిత సబ్జెక్ట్స్‌ను మార్చి మార్చి చదవడం మెదడులో ఫ్లెగ్జిబిలిటీని పెంచుతుంది.
డ్యూయల్ కోడింగ్: పదాలతో పాటు విజువల్స్ కలిపి చదవడం. మైండ్ మ్యాప్స్, డయాగ్రమ్స్ వాడడం వల్ల మాటల జ్ఞాపకం, విజువల్ జ్ఞాపకం రెండూ కలసి జ్ఞాపకం పెరుగుతుంది.
టీచ్ వాట్ యూ లెర్న్: మీరు నేర్చుకున్నది ఇతరులకు బోధించండి. లేదా మీకు మీరే చెప్పుకోండి. దీనివల్ల మెదడులో సమాచారం క్లియర్‌గా ఆర్గనైజ్ అవుతుంది.
తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినవి
రోజూ గంటలకు గంటలు చదవమని పిల్లలను ఒత్తిడి చేయవద్దు. ప్రతిరోజూ కొద్దిపాటి విరామాలతో కొద్ది కొద్ది సేపు చదివేలా అలవాటు చేయండి.
కేవలం మార్కులు, ర్యాంకులకే కాదు– ప్రయత్నం, స్ట్రాటజీ, క్రియేటివిటీని అభినందించండి. ఉదాహరణకు, ‘నువ్వు ఈ క్లిష్టమైన చాప్టర్‌ను సులువుగా విభజించడం నాకెంతో నచ్చింది’ అని చెప్పండి.
చదవడానికి డిస్ట్రాక్షన్స్ లేని ప్రశాంత వాతావరణం సృష్టించండి. రోజుకు కనీసం7–9 గంటల నిద్ర అందేలా చూడండి.
రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడులో కొత్త కనెక్షన్లను ఏర్పరచే బీఎన్‌డీఎఫ్ అనే ప్రొటీన్ విడుదలవుతుంది.
మెదడుకు శక్తినిచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్‌నట్స్, ఫ్లాక్స్‌సీడ్స్, చేపలు, బెర్రీలు వంటివి అందించండి.
విద్యార్థులు చేసే పొరపాట్లు
పాసివ్ రీడింగ్: పాఠాలను హైలైట్ చేస్తూ పదేపదే చదివితే బాగా గుర్తుంటుందని అనుకుంటారు. కానీ దీనివల్ల బలమైన మెమరీ ట్రేసెస్ ఏర్పడవు.
క్రామింగ్: చివరి రోజు వరకు వాయిదా వేసి ఒక్కరోజులో మొత్తం రివిజన్ చేయడం వర్కింగ్ మెమరీను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈజీగా మరచిపోతారు.
మల్టీ టాస్కింగ్: చదివేటప్పుడు టీవీ చూడటం, సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం, ఒకేసారి రెండు మూడు సబ్జెక్టులు చదవడంలాంటి పనులు చేస్తే అధ్యయన సామర్థ్యం 40 శాతం వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మూడు స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్
పొమోడోరో టెక్నిక్: 25 నిమిషాలు ఫోకస్‌తో చదివి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అలా నాలుగుసార్లు చదివాక 20–30 నిమిషాలు పెద్ద విరామం తీసుకోండి.
సెల్ఫ్–టెస్టింగ్: చాప్టర్ హెడింగ్స్‌ను ప్రశ్నలుగా మార్చుకుని ముందుగా వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. తరువాత చదివాక తిరిగి పరీక్షించుకోండి.
కాంటెక్స్‌ట్ /వేరియేషన్: ఎప్పుడూ ఒకే చోట కూర్చుని చదవకండి. చదివే ప్రదేశాలు మార్చడం వల్ల జ్ఞాపకానికి వివిధ క్యూస్ ఏర్పడి గుర్తుకు తెచ్చుకోవడం సులువవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com
(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!)