Shikha Khanna: నూరు తల్లుల కథ

Shikha Khanna: Portrait photographer created the Mothers United Moment - Sakshi

ఈవెంట్‌

31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్‌లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి  తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది.

ఆ తల్లుల గాధలు అందరికీ తెలియాలి అని భావించిన ప్రసిద్ధ పోర్ట్రయిట్‌ ఫొటోగ్రాఫర్‌ శిఖా ఖన్నా వందమంది తల్లుల ఫొటోలు, ఇంటర్వ్యూలతో ‘100 సెల్ఫ్‌పోర్ట్రయిట్స్‌ 100 డ్రీమ్స్‌’ పేరుతో పుస్తకం తెస్తోంది. ఈ సందర్భంగా వచ్చే వారం పూణెలో ఈ వందమంది తల్లులు ఒక వేదిక మీదకు రానున్నారు. ఈ ఘట్టం తల్లి గొప్పదనాన్ని చాటనుంది.

ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసే ఒక తల్లికి లడాఖ్‌లో డ్యూటీ. ఆ సమయానికి ఆమెకు రెండేళ్ల పాప ఉంది. దూరాన వదల్లేదు. లడాఖ్‌లో ప్రతికూల వాతావరణంలో పెంచడం రిస్క్‌. ఉద్యోగమా... మాతృత్వమా? ఏం... రెండూ ఎందుకు చేయకూడదు. ఆమె తన రెండేళ్ల కూతురిని లడాఖ్‌ తీసుకెళ్లింది. ఒకవైపు డ్యూటీ చేస్తూనే మరోవైపు కూతురిని పెంచింది. ఆ తల్లి ఆ సవాలును ఎలా స్వీకరించి దాటిందో ఆ కథ తెలిస్తే ఎలా ఉంటుంది?

ఒక తల్లి అంధురాలైన కళాకారిణి. అంధత్వంతో కళలో సాగడమే ఒక కష్టమైతే తల్లిగా బాధ్యతలు నెరవేర్చడం ఇంకా కష్టం. కాని ఆ తల్లి ఆ బాధ్యతను నెరవేర్చింది. అందుకు ఏ యే ఇక్కట్లను దాటింది? ఆమె నోటి గుండా వింటే ఎంత బాగుంటుంది?
ఒక తల్లి క్రీడల్లో కొనసాగాలి. దేశాలు తిరగాలి. మరోవైపు పిల్లలు. ఆటల కోసం వ్యాయామానికి, ప్రాక్టీసుకు సమయం ఇవ్వాలి. మరోవైపు పిల్లలకూ ఇవ్వాలి. ఎంత ఒత్తిడి. ఏదో ఒకటి ఎంచుకొని రెండోది వదిలేయకుండా రెంటినీ నిర్వహించడంలోనే ఆ తల్లి గొప్పదనం ఉంది. ఆ కథ లోకంలో ఎందరికి తెలుసు?

తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్‌లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది.

ఆ ఆలోచనతోనే ఫొటోగ్రాఫర్‌ శిఖా ఖన్నా ‘ఎంయుఎం’ (మదర్స్‌ యునైటెడ్‌ మూవ్‌మెంట్‌) అనే ప్రాజెక్ట్‌ మొదలెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ‘100 సెల్ఫ్‌ పోర్ట్రెయిట్స్‌ 100 డ్రీమ్స్‌’ అనే పుస్తకాన్ని తెచ్చింది. ఆ పుస్తకంలో తల్లుల జీవన గాథలు వారి మాటల్లోనే రికార్డు చేసింది. 31 దేశాల నుంచి 100 మంది తల్లులు– వారంతా తమ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నవారు... వృత్తిలో విజయం సాధిస్తూనే తల్లిగా కూడా విజయం సాధించినవారు– తమ అనుభవాలను ఈ పుస్తకంలో చెప్పారు. భారతదేశం నుంచి అథ్లెట్‌ అశ్వినీ నాచప్ప, పారా అథ్లెట్‌ దీపా మాలిక్‌ తదితరులు ఉన్నారు. ఇతర దేశాల నుంచి టీచర్లుగా, మ్యూజిక్‌ టీచర్లుగా, లైఫ్‌స్టయిల్‌ కోచ్‌లుగా, గాయనులుగా, హక్కుల ఉద్యమకారులుగా, చెఫ్‌లుగా, ఫొటోగ్రాఫర్లుగా వివిధ రంగాలలో కొనసాగుతున్న తల్లులు ఉన్నారు.

‘తల్లి గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. ఈ పుస్తకం ఆమెను మరింత ఉన్నతంగా ఉంచుతుంది’ అంటుంది శిఖా ఖన్నా. స్వయంగా ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్‌ అయిన శిఖా భారతదేశంలో న్యూబోర్న్‌ బేబీల ఫొటోగ్రఫీని తొలిగా ప్రవేశ పెట్టింది. దాదాపు 1000 ప్రముఖ కుటుంబాల ఫొటోలు తీసిందామె. అంతే కాదు యువతరం కోసం ఆన్‌లైన్‌లో ఫొటోగ్రఫీ క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. తను తల్లయ్యాక ఫొటోగ్రాఫర్‌/ తల్లిగా రెండు పాత్రలు పోషించడంలో తానెంత ఫోకస్డ్‌గా ఉండాల్సి వచ్చిందో అర్థమయ్యాక ఇలా పని చేసే తల్లుల కథలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి కదా అనిపించింది. పిల్లలు పుట్టగానే చాలామంది తల్లులు తమకు ఎంతో ఇష్టమైన వృత్తిని, ఉపాధిని, హాబీని వదిలేస్తుంటారు. అలాంటి వారు ఒక ధైర్యం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం తెచ్చిందామె.

పూణెలో నవంబర్‌ 11 నుంచి 13 తేదీల మధ్య జరిగే ఈవెంట్‌లో ఈ 100 మంది తల్లులు వచ్చి నేరుగా ప్రేక్షకులతో మాట్లాడనున్నారు. స్త్రీల మాతృత్వానికి, జీవన రంగానికి సంబంధించిన అనేక సెషన్స్‌ జరగనున్నాయి. అలాగే ఈ పుస్తకం ఆవిష్కరణ కూడా జరగనుంది. ప్రధాని మెచ్చుకుని ఈ ఈవెంట్‌ విజయవంతం కావాలని సందేశం పంపారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనే తల్లులకు శుభాకాంక్షలు.
 
తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్‌లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ
జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top