ఈ డజన్‌ కొత్త విజన్‌

Saudi women stand guard in Mecca during haj - Sakshi

మిలిటరీ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె హజ్‌ యాత్రికులకు సూచనలు ఇస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఓపికగా తీరుస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి సహాయపడుతుంది. సైనిక దుస్తుల్లో కనిపించే గంభీరత్వం మాట ఎలా ఉన్నా, ఆమె మాత్రం పక్కింటి ఆత్మీయనేస్తం లానే కనిపిస్తుంది.  పవిత్ర మక్కా, మదీనాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైనికుల చిత్రాలు ఒక చారిత్రక మార్పుకు సూచనగా నిలిచాయి.

ఎందుకీ మార్పు?
సౌదీ యువరాజు మహ్మద్‌బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) విజన్‌ 2030 ప్రణాళిక రూపొందించాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అది జరగాలంటే ప్రధాన స్రవంతికి దగ్గరవ్వాలి. ఇందులో భాగంగా సంప్రదాయ విధానం నుంచి కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సౌదీ ప్రభుత్వం. మహిళలు సైన్యంలో చురుకైన పాత్ర నిర్వహించడమనేది ఈ మార్పుకు  సంకేతంలా నిలుస్తుంది.

సైన్యంలో పనిచేయాలనేది మోనా చిన్నప్పటి కల. అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో అది కలకే పరిమితమనే కఠిన వాస్తవం తెలిసింది. ఆ కఠిన వాస్తవం కరిగిపోయి మోనా సైన్యంలో చేరడానికి ఎంతో కాలం పట్టలేదు.

‘నాన్నలాగే సైన్యంలో పనిచేయాలనిది నా కోరిక. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. పవిత్రభూమిలో విధులు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది మోనా. మక్కా, మదీనాలలో సైనిక విధులు నిర్వహిస్తున్న పన్నెండు మంది మహిళలలో మోనా ఒకరు.

కాబా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమర్‌ సైకాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘సైన్యంలో పనిచేయాలనుకుంటున్నాను’ అని తన మనసులో మాటను ఒకరోజు కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సంతోషించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మానసిక దృక్కోణంలో వచ్చిన కీలక మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు.

‘ఇదొక ఉద్యోగం అనుకోవడం లేదు. పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాను’ అంటుంది సమర్‌.

2019లోనే సైన్యంలోకి మహిళలు రావడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది ప్రభుత్వం. సోల్జర్‌ నుంచి సార్జెంట్‌ వరకు వివిధ హోదాల్లో మహిళలు పనిచేడానికి దారి పడింది.

‘మహిళలను సైన్యంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది గత 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదస్పద అంశం. ఏది ఏమైనా సైన్యంలోకి మహిళల రాక అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం’ అంటున్నారు ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ స్పెషలిస్ట్‌ హలహ్‌.

ఇక షాపింగ్‌ మాల్స్‌లో మహిళలు క్యాషియర్‌లుగా కనిపించడం సాధారణ దృశమైంది. మినిస్టర్‌ ఆఫ్‌ జస్టిస్‌లో పబ్లిక్‌ నోటరీలుగా వందమంది మహిళలను నియమించారు. త్వరలో మహిళా జడ్జీల నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్థూలంగా చెప్పాలంటే వివిధ రంగాలలో మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి.

మహిళలపై పరిమితులు విధించే సంరక్షణ విధానానికి చెల్లుచీటి ఇచ్చింది ప్రభుత్వం. మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా పక్కన పెట్టింది.

రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలో మరెన్ని మార్పులు జరగనున్నాయో వేచిచూద్దాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top