ఫ్రేమ్‌ మారినా.... ప్రేమ అలాగే ఉంది!

Sakshi Special Story on Valentines Day

వాలెంటైన్‌ ప్రత్యేకం / సినిమా ప్రేమ

బ్లాక్‌ అండ్‌ వైట్‌ డేస్‌ గాన్‌. ఈస్ట్‌మన్‌ కలర్‌ రోజులు పోయే. సినిమాస్కోప్‌ కే దిన్‌ చల్‌ బసే. కాని ప్రేమ అలాగే ఉంది. పోస్టర్‌ మారింది. ప్రేమ అలాగే ఉంది. అక్కినేని లేడు. ప్రేమ అలాగే ఉంది. ప్రభాస్‌ వచ్చాడు. ప్రేమ అలాగే ఉంది. ‘నిన్నా నేడూ నీదే ధ్యానం’ వేటూరి లేడు. ప్రేమ అలాగే ఉంది. ‘నీ కాళ్లను పట్టుకుని వదలవన్నవి’.. ఇల సినీపురములో ప్రేమ అలాగే ఉంది. ప్రేమ లేకుండా బుకింగ్స్‌ ఓపెన్‌ కావు. కలెక్షన్లు క్లోజూ కావు. ఫిబ్రవరి 14 ప్రేమగులాబీలు విరబూస్తాయి. ట్రెండ్‌ మారుతూ వచ్చిన ప్రేమకథలను గుర్తు చేస్తాయి.

తొలి రోజుల్లో సినిమా ప్రేమ రక్త సంబంధీకుల మధ్యో, ఇరుగూ పొరుగుల మధ్యో ఉండేది. అపరిచితులను కలిసే చాన్స్‌ తక్కువ. ‘మల్లీశ్వరి’లో బావామరదళ్లైన ఎన్‌.టి.ఆర్, భానుమతి ప్రేమించుకుంటారు. కాని ‘ప్రేమ’ అనే మాట ఎక్కడిది అప్పట్లో. అనురాగం, ఆరాధన, మనసు పడటం... ఇవే. ఆ అనురాగాన్ని కూడా నేరుగా చెప్పుకుంటారా? ‘మనసున మల్లెల మాలలూగెనె’ అని మల్లెలనో పున్నమినో తోడు తెచ్చుకుంటారు. ‘దేవదాసు’లో నాగేశ్వరరావు ‘పల్లెకు పోదాం పారును చూదాం’ అంటాడు తప్పితే పారును ప్రేమిద్దాం అనడు. ఆమె లేకపోతే తాను లేడన్న సంగతి మాత్రమే తెలుసు అతనికి. దాని పేరు ప్రేమ అని తర్వాత పాత్రలకు, ప్రేక్షకులకు చెబుతూ వచ్చారు. పారు, దేవదాసు కలిసినప్పుడు కూడా ‘నా ఎదుటే నీ బడాయి’ అని ఆమె ‘జీవితమే ఓ లడాయి’ అని అతడు దెప్పిపొడుచుకుంటారు తప్ప ప్రేమను వ్యక్తపరచడం ఎలాగో తెలుసుకోరు.

చంద్రుడే రాయబారి
పాత రోజుల్లో అబ్బాయి అమ్మాయిలకు చంద్రుడే రాయబారి. వారి ప్రేమ, కోపం, అలక చంద్రుడితో చెప్పుకునేవారు. ‘రావోయి చందమామ... మా వింతగాధ వినుమా’ అని ‘మిస్సమ్మ’లో ఎన్‌.టి.ఆర్‌ సావిత్రి మీద ఉన్న ప్రేమను చంద్రుడితో మొత్తుకుని చెప్పుకుంటాడు. ఆమెకు అతనిపై ప్రేమ కలిగినా ‘ఏమిటో ఈ మాయా ఓ నెలరాజా చల్లని రాజా’ అని చంద్రుడికే చెప్పుకుంటుంది తప్ప అతనితో కాదు. ‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు’ కాలం అది. కాని అలా రాసిన ఆత్రేయే మరికొన్నాళ్లకు కుండబద్దలు కొట్టాడు. ‘ప్రేమనగర్‌’ సినిమా నుంచి ప్రేమను ముందుకు తెచ్చాడు. హీరో హీరోయిన్లు కూడా ప్రేమ అనే మాటను పలకడం మొదలెట్టారు. ‘నీ కోసం వెలసింది ప్రేమమందిరం’ అని హీరో పాడాడు. ఇప్పుడు ప్రేమ బట్టబయలు అయిపోయింది. హీరో అయితే ప్రేమించనన్నా ప్రేమిస్తాడు లేదంటే తన తల్లిదండ్రులను చంపిన విలన్‌పై పగసాధిస్తాడు. ప్రేమించిన వాడిని మహిళా ప్రేక్షకులు ఎక్కువగా ప్రేమించారు.

చదువు తెచ్చిన ప్రేమ
పాత రోజుల్లో అంతంతమాత్రంగా ఉండే చదువులు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. కాలేజీలు వచ్చాయి. అబ్బాయిలు అమ్మాయిలు ఒకేచోట కూచుని చదువుకోవడం మొదలెట్టారు. చదువయ్యాక నిరుద్యోగం ఒక సమస్యగా తీసుకుని కుర్రాళ్లు తిరగబడే కథలతో వచ్చిన సినిమాలు ఒకవైపు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో మెరుపులై మెరిసే కథలు ఒకవైపు ఊపందుకున్నాయి. అక్కినేని ‘ప్రేమాబిషేకం’ తీసి ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అని పెద్ద హిట్‌ కొట్టాక కుర్రాళ్లు ఊరుకోలేదు. జంధ్యాల వల్ల ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’ వంటి ప్రేమకథలను చూపించారు. ‘చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పొంగు నీ ప్రేమ నా ప్రేమ’ అని ప్రేమపాఠం చదివారు. అదే సమయంలో డబ్బింగ్‌ చిత్రంగా వచ్చిన ‘ప్రేమ సాగరం’ పెద్ద దుమారం రేపింది. ‘నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజీకి’ అని కొత్త దిశను చూపింది. కాలేజీకి వెళ్లామంటే లవ్‌ చేయాల్సిందే అని కుర్రాళ్లు అనుకునేదాకా ఈ ప్రేమమత్తు ఎక్కిది. సినిమా వాళ్లు కూడా సామాన్యులు కారు. డబ్బులొస్తాయంటే ప్రేమను పట్టుకుంటారు. కలెక్షన్లు బాగున్నాయంటే పగనూ పట్టుకుంటారు.

మరో చరిత్ర
ఓ.కే. ప్రేమించుకున్నాం సరే. మరి దాని సమస్యలు. ప్రేమలో ఉన్న పెద్ద విశేషం ఏమంటే దాని నిర్ణయం అబ్బాయి అమ్మాయి తీసుకుంటారు. కాని అది చేరాల్సిన రేవు పెళ్లి అయితే గనక దానికి టికెట్‌ కొట్టాల్సిన వాళ్లు పెద్దవాళ్లవుతారు. ‘ప్రేమా లేదూ దోమా లేదూ’ అని ఈసడించే పెద్దవాళ్ల ముందు ప్రేమ పవిత్రత, శక్తి చూపి నాలుగు రూకలు సంపాదిద్దాం అనుకున్నాడు దర్శకుడు కె.బాలచందర్‌. ‘మరో చరిత్ర’ తీశాడు. ఇరుపక్షాల పెద్దలకు పెళ్లి ఇష్టం లేదు. సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకుండా ఉంటే అప్పుడు మీ ప్రేమను నమ్ముతాం అని చెబుతారు. ఏం షరతు ఇది. అమ్మాయిలందరూ సరితలో తమను చూసుకున్నారు. అబ్బాయిలందరూ కమలహాసన్‌లో తమను. ‘ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో’ అని వాళ్లు పాడుకుంటే చూడ్డానికి క్లాసులెగ్గొట్టి వచ్చారు. సరే.. వీళ్లది కులాల మధ్య పుట్టిన సమస్య. ‘సీతాకోకచిలుక’ వచ్చి మతాల మధ్య సమస్యను చెప్పింది. అబ్బాయి అమ్మాయికి ప్రేమలో పడే సమయంలో ఎవరు ఏ మతమో తెలియదు. కాని పెద్దలకు తెలుసు కదా. ‘నేనే నీవుగా పువ్వూ తావిగా సంయోగాల సంగీతాల విరిసేవేళలో’ అని వారు పాడుకుని ఈ సాంగత్యాన్ని వదలం అని ప్రేమను గెలుచుకున్నారు. సినిమాను గెలిపించుకున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ప్రేమ పూర్తిగా ఎస్టాబ్లిష్‌ అయినట్టే.

ఒక్క ప్రేమ ఎన్ని రంగులో...
ప్రేమ ఒక సక్సెస్‌ ఫార్ములా అయ్యాక దానికి ఎన్ని కోణాలు, ఎన్ని పార్శా్వలు ఉన్నాయో వెతకడం మొదలెట్టారు సినీ కథకులు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కామన్‌. కాని సమస్య కొత్తది కావాలి. లేదా కొత్తగా చెప్పాలి. అసలు లోపల ప్రేమ పెట్టుకుని ఎప్పటికీ చెప్పలేని అబ్బాయి కథను సినిమాగా తీస్తే అనుకుని ‘హృదయం’ తీశాడు దర్శకుడు కదిర్‌. ‘ఊసులాడే ఒక జాబిలట’.. అని పాడతాడు. పెద్ద హిట్‌. తీరా ప్రేమ సంగతి చెప్పడానికి వచ్చేసరికి అతనికి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. ఇంత సుకుమార ప్రేమ కూడా ఉంటుందని జగానికి తెలిసింది. ఇలాంటి కథే ఇటీవల తెలుగులో శర్వానంద్‌ హీరోగా ‘జాను’ పేరుతో వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని అనుమానిస్తే ఆ ప్రేమ ఎలా భగ్నం అవుతుందో నాగార్జున ‘మజ్నూ’లో చూపిస్తాడు. తనతో జరగాల్సిన తొలిరాత్రి మరెవరికో జరుగుతుంటే ‘ఇది తొలిరాత్రి’ అని పాడి కుమిలిపోతాడు. అమ్మాయి తండ్రికి ప్రేమ ఇష్టం లేకపోతే అబ్బాయి మీద రౌడీలను పంపిస్తాడు. కాని తల్లికి ఇష్టం లేకపోతే? ‘ప్రేమ’ సినిమాలో వెంకటేశ్‌ తన కూతురు రేవతిని ప్రేమించడం మంజులకు ఇష్టముండదు. అమ్మాయి తల్లి గట్టిగా నిలబడినా కూడా పెద్ద చిక్కే ప్రేమకు. ‘ఈనాడే ఏదో అయ్యింది’ అని మధురంగా పాడుకోవడమే పాపం ఆ జంటకు మిగులుతుంది. సరే... ఒకమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తే? ఆ ఇద్దరూ ఒకరికొకరు స్నేహితులయ్యి ఆ అమ్మాయి వారిద్దరికీ స్నేహితురాలైతే? ఈ ప్రేమ గొడవ మనకెందుకురా హాయిగా ముగ్గురం ఫ్రెండ్స్‌గా ఉందాం అని ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంటుంది. ‘ప్రేమదేశం’ కుర్రకారును మరోదేశంలో తిప్పి వదిలింది. ‘నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే ప్రేమా...’ అని ప్రేమ భావనను గాఢంగా చెప్పిన సినిమా ఇది. అసలు ప్రేమ అనే ఈ పిచ్చిలో పడి చదువు మానేసి, అయిన వారికి దూరమయ్యి జీవితం నాశనం చేసుకోవడం ఏమిటి ఇలా అక్కర్లేదు... ప్రేమ కోసం సర్వం కోల్పోవాల్సిన పని లేదు అని ‘సుస్వాగతం’ వంటి కథలూ వచ్చాయి.

బొమ్మరిల్లు ప్రేమ
బొమ్మరిల్లు ఫాదర్‌ ఉన్నట్టే బొమ్మరిల్లు ప్రేమ కూడా ఉంది. అదేమిటంటే మనం ప్రేమించిన అమ్మాయిని మన పెద్దలు నచ్చేంత వరకూ ఓపిక పట్టడం, వారికి పరిచయం చేసి, నచ్చేలా చేయడం. ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్న’ చెలిని నిజ జీవితంలో సొంతం చేసుకోవడం. మరో ప్రేమ కూడా ఉంది. ‘నా ప్రేమ నీకు తెలిసే దాకా ప్రేమిస్తానని... ఫీల్‌ మై లవ్‌’ అని చెప్పి ప్రేమను పొందే ‘ఆర్య’ మార్కు ప్రేమ. ఇది అన్నిసార్లు క్లిక్‌ కాకపోవచ్చు. పైగా మనం కటకటాల్లో పడొచ్చు. ఇక తొలిచూపులోనే ప్రేమ పుడుతుంది అంటారు. పుట్టొచ్చు. కాని అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ తమను తాము ఒకరినొకరు అర్థం చేసుకునేలా ఎదిగి ప్రేమ ఎదిగేలా చేసుకుని ఒక్కటవ్వాలి. ‘ఏ మాయ చేసావే’ చెప్పింది ఇదే. ఇక అర్జున్‌ రెడ్డి మార్కు ప్రేమ కూడా ఉంది. ప్రేమను సంపూర్ణం గా అనుభవించడం. వియోగాన్ని సంపూర్ణం గా అనుభవించడం. ఏ విధంగా అయినా పూర్తిగా ప్రేమలో మునగడం ఇది.


ఏమైనా ప్రేమ జగత్తుకు రాజు, రాణి అబ్బాయి, అమ్మాయిలే.
వారి రాజ్యాన్ని వారు విస్తరించుకుంటూ వెళుతుంటారు. ఆ రాజ్యం తక్కువసార్లే ఓడిపోగలదు. ఎక్కువసార్లు అది చెప్పేమాట– అమరం అఖిలం ప్రేమ.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top