
‘అమ్మాయే కదా ఏం చేస్తుందిలే... టచ్ చేసేద్దాం’ అనుకుంటే అనంతికా సనీల్‌కుమార్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అనంతిక’ అనొచ్చు. మనల్ని మనం రక్షించుకునే కళ తెలియాలంటోంది ఈ టీనేజ్ బ్యూటీ. అందుకే అనంతికా సనీల్‌కుమార్ ‘మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకుంది.
కరాటేలో బ్లాక్ బెల్ట్, కేరళ ప్రాచీన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు నేర్చుకుంది. కథకళి, భరతనాట్యం, మోహినియాట్టమ్, కూచిపుడి కూడా నేర్చుకుంది. మరోవైపు సినిమాలంటే ఇష్టంతో హీరోయిన్‌గా కొనసాగుతోంది. ‘మ్యాడ్’, ఇంకా ఆ మధ్య విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రాలతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అనంతికా సనీల్‌కుమార్ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు...
నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడల్లా ‘ఓకే’ అనే సమాధానమే వచ్చింది. ఇక డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు క్లాసికల్ మాత్రమే కాదు... హిప్ హాప్ నేర్చుకోవాలన్నా అదే రియాక్షన్. అంత సపోర్టివ్. మా అమ్మ తన కలని నాలో చూసుకున్నారు. ఇప్పుడు నేను నేర్చుకున్నట్లుగా చిన్నప్పుడు ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నారు.
అయితే అప్పుడు ఆమె పేరెంట్స్‌కి అంత స్థోమత లేకపోవడంతో రాజీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా అన్నీ నేర్చుకునే పరిస్థితి ఉంది. అన్నీ నేర్పించి, మా అమ్మ నాలో తనని చూసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఫోర్త్ స్టాండర్డ్ వరకూ నేను టాపర్‌ని. ఆ తర్వాత ఆడుకోవడం, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్‌తో స్టడీస్ వైజ్ కొంచెం వీక్ అయ్యాను. ఎయిత్ స్టాండర్డ్ వరకూ ఇలానే. ఆ తర్వాత మళ్లీ గుడ్ స్టూడెంట్ అయ్యాను.
క్రమశిక్షణకు కళ
కళ ఏదైనా సరే క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది. అసలు ఆర్టిస్ట్ (యాక్టింగ్) అంటేనే క్రమశిక్షణ ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ వల్ల నా ఆలోచనా విధానం మారింది. ఏదైనా విషయం గురించి నిదానంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే శరీరాన్ని మాత్రమే కాదు... మనసుని కూడా క్రమ పద్ధతిలో పెడుతుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే మీద పడి కొట్టడం కాదు... మనల్ని మనం రక్షించుకోవడం. ఈ ఆర్ట్ నేర్చుకున్న ఎవరైనా సరే ముందు చాలావరకు నియంత్రించడానికే ప్రయత్నిస్తారు... అయితే లిమిట్ దాటితే అప్పుడు కొడతాం.
బ్యాడ్ టచ్... టీచ్ హిమ్
నా చిన్నప్పుడు ఒక అబ్బాయితో చాలా గట్టిగా గొడవ జరిగింది. ఆ అబ్బాయి నన్ను ఏమీ అనలేదు. తను నా ఫ్రెండ్. పిల్లల గొడవలుంటాయి కదా... అలాంటిది. నేను తిరగబడి బాగా కొట్టాను. నన్ను కూడా బాగా కొట్టాడు (నవ్వుతూ). కిడ్స్ ఫైట్ అన్నమాట. ఆ తర్వాత నా టీనేజ్‌లో నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి ‘బ్యాడ్ టచ్’ చేశాడు. అమ్మాయే కదా ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనదనే ధైర్యం వారికి ఉంటుంది. నేను అతన్ని నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో లాక్ చేశాను. బ్యాడ్ టచ్ చేస్తే టీచ్ చేయాల్సిందే. అమ్మాయిలు ఇలా చేస్తే ఓ ఎవేర్‌నెస్ వస్తుంది. అమ్మాయిలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి... తిరగబడతారనే ఫీలింగ్ సొసైటీలో క్రియేట్ చేయగలిగితే దాడులు తగ్గుతాయని నా ఫీలింగ్.
సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యం
నాకు గాయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే గాయాలు తగిలిన ప్రతిసారీ ‘మనం ఏదో చేస్తున్నాం’ అనే ఫీలింగ్ నాకు ఆనందాన్నిస్తుంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో చాలాసార్లు తగిలాయి. ఇక కలరి అయినా, కరాటే అయినా ఏదైనా ఫస్ట్, సెకండ్ స్టేజ్ చాలా స్లోగా ఉంటుంది. త్వరగా నేర్చేసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా... అందుకని బోర్ ఫీలవుతాం.
కొంతమంది అమ్మాయిలైతే ఒకటీ రెండు క్లాసులకు వచ్చి, మా వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ నిదానం అవసరం. అయితే ఆ ఫస్ట్ స్టెప్ మనం ఓపికగా ఉంటే మన లాస్ట్ స్టెప్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కొందరైతే ఈ కష్టం మావల్ల కాదనుకున్నారు. కానీ, కొన్నేళ్లు కష్టపడి నేర్చుకున్న ఆర్ట్ మన జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... అమ్మాయిలు ఎవరి మీదా ఆధారపడకపోవడం అనేది ‘ఆర్థిక స్వాతంత్య్రం’ విషయంలో మాత్రమే కాదు... మన మీద జరిగే దాడుల విషయంలోనూ డిపెండ్ కాకూడదు. ‘సెల్ఫ్ డిఫెన్స్’ చాలా ఇంపార్టెంట్.
రెస్ట్ నచ్చదు
నాకు ‘బ్లాక్ ఫ్లిప్’ అంటే ఇష్టం. ఒకసారి అది చేస్తున్నప్పుడు వెన్నెముకకి గాయం అయింది. అప్పుడు నేను ‘ప్లస్ వన్’ చదువుకుంటున్నాను. నా స్పైన్ బెండ్ అయింది. ఫలితంగా ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి రెస్ట్ అంటే అస్సలు నచ్చదు. విశ్రాంతి ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో ‘8 వసంతాలు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అయినా ఆ సినిమా ఒప్పుకుని, చేశాను. ఇప్పటికీ కంటిన్యూస్‌గా నిలబడితే నొప్పిగానే ఉంటుంది. అది ఎప్పటికీ ఉన్నా పట్టించుకోకుండా పని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను (నవ్వుతూ).
రియాక్ట్ అయ్యే బలం
మార్షల్ ఆర్ట్స్ అంటే... ఒంటి చేత్తో రాళ్లని పగలగొట్టడం కాదు. మనల్ని మనం కాపాడుకోవడానికి వేళ్లు, గోళ్లు, చేతులు, కాళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది... మన ఆత్మవిశ్వాసం పెంచే కళ. మనకు ఏం జరిగినా వేరేవాళ్ల మీద ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బాయిలు శారీరకంగా బలంగా ఉంటారు కాబట్టి వాళ్లైతే ఈ ఆర్ట్ నేర్చుకోవచ్చని చాలామంది అనుకుంటారు. అయితే ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నవాళ్లు నేర్చుకోవాలంటా. అమ్మాయిగా నాకు ఫిజికల్ స్ట్రెంత్ తక్కువే. కానీ ఇవి నేర్చుకోవడం వల్ల రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌లో రియాక్ట్ అయ్యేంత బలం దానంతట అది వచ్చేస్తుంది. డిఫెండ్ చేసుకోవడం మనకు తెలుసు అని లోపల ఉన్న ఆత్మవిశ్వాసం మనల్ని ఎదురు తిరిగేలా
చేస్తుంది.
సైలెంట్‌గా ఉండొద్దు
అమ్మాయిలకు స్వీయ రక్షణ తెలియాలి. ఆ మాటకొస్తే ఇప్పుడు అబ్బాయిలకూ కొన్ని ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సో... ఎవరైనా సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినవాళ్లల్లో అబ్బాయిలకు కూడా సమస్యలు వచ్చాయి. ఇక అమ్మాయిలకు ఎందుకు మరీ ముఖ్యం అంటే... వాళ్లకి ఎక్కువగా వేధింపులు ఎదురవుతుంటాయి. హఠాత్తుగా ఎవరైనా వచ్చి, తాకకూడని చోట తాకారనుకోండి ‘మనకి సెల్ఫ్ డిఫెన్స్ తెలిసి ఉంటే బాగుండేది’ అని అప్పుడు అనుకుంటాం. అది ప్రయోజనం లేదు. అదే ముందే నేర్చు కుంటే... ఆ టైమ్‌లో సైలెంట్‌గా ఉండకుండా బుద్ధి చెప్పగలుగుతాం.
పాలిటిక్స్‌లోకి...
నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే జనాల్లో ఉండటం ఇష్టం. వారికి ఏదైనా సహాయం చేయాలని ఉంది.ప్రాపర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. చట్టం గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ‘లా’ చదువుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నాను. భవిష్యత్తులో అమ్మాయిల కోసం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని ఉంది. కానీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. కొంచెం టైమ్ పడుతుంది.
– కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ మాత్రమే సాధించాను. వన్ నుంచి టెన్ వరకూ ఉన్నాయి. థర్డ్ కూడా సాధించాలని ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి టైమ్ దొరకడంలేదు. పదో స్టేజ్ వరకూ వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక సినిమాల్లో నాకు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ చేసే పాత్ర వస్తే హ్యాపీగా చేసేస్తాను.
– డి.జి. భవాని