'8 వసంతాలు' సినిమా రివ్యూ | 8 Vasanthalu Movie Review Telugu | Sakshi
Sakshi News home page

8 Vasanthalu Review: అందమైన ప్రేమకథ.. '8 వసంతాలు' రివ్యూ

Jun 20 2025 11:12 AM | Updated on Jun 20 2025 12:34 PM

8 Vasanthalu Movie Review Telugu

తెలుగు సినిమాల్లో ప్రేమకథలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలా వచ్చిన చిత్రం '8 వసంతాలు'. గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనంతిక సనీల్ కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ప్రేమకథా సినిమా అనగానే.. హా ఏముంది అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకుంటారు. కుదిరితే ఒక్కటవుతారు లేదంటే విడిపోతారు. ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముందిలే అనుకుంటాం. కానీ ప్రేమకథని ఎంత అందంగా, ఎంత హృద్యంగా చెప్పొచ్చో కొందరు దర్శకులు నిరూపించారు. అలా 'అందాల రాక్షసి', 'సీతారామం' లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటితో సరిసమానంగా నిలిచే చిత్రం ఈ '8 వసంతాలు'.

సినిమా టైటిల్స్ పడుతున్న టైంలోనే మొత్తం కథని రివర్స్‌లో చూపించేస్తారు. అలా ఊటీలో ఓ కరాటే ఇన్‌స్టిట్యూట్‌లో కథ మొదలవుతుంది. తనని ఓడిస్తే ఐపాడ్ గిఫ్ట్‌గా ఇస్తానని హీరో వరుణ్ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడున్న వాళ్లందరూ అతడి చేతిలో ఓడిపోతారు. కానీ శుద్ధి అతడిని ఓడిస్తుంది. అహాన్ని నేలకు దించుతుంది. ఆ క్షణం వరుణ్.. శుద్ధితో ప్రేమలో పడిపోతాడు. తర్వాత ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంది కదా అనుకునే టైంలో వరుణ్ తన స్వార్థం చూసుకుంటాడు. శుద్ధిని దూరం పెడతాడు. దీంతో ఆమె వచ్చి వరుణ్ ముందు నిలబడుతుంది. వీళ్లిద్దరి మధ్య సాగే సంభాషణ విజిల్స్ వేయిస్తుంది. అలా అదిరిపోయే సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.

సెకండాఫ్‌కి వచ్చేసరికి శుద్ధికి కరాటే నేర్పిన గురువు చనిపోవడం, ఆయన అస్థికల్ని గంగలో కలపడం ఇలా సాగుతుంది. కొన్నాళ్ల తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. ఈమెలానే అతడు కూడా ఓ రచయిత. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? ఇంతకీ సంజయ్ గతమేంటి? చివరలో శుద్ధితో సంజయ్ ఒక్కటయ్యాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

'8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. మధ్యమధ్యలో బలమైన సన్నివేశాలు, మనసుని తాకే డైలాగ్స్ వస్తుంటాయి. తొలి భాగంలో మహిళల గుణం గురించి హీరోయిన్ చెప్పే ఓ సీన్ భలే ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముందు శుద్ధి-వరుణ్ మధ్య సంభాషణ వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.

ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి సంజయ్ పాత్ర ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎందుకంటే క్లైమాక్స్‌కి కాసేపు ముందు వచ్చే ఈ పాత్రకు పెద్దగా సీన్స్ ఉండవు. కానీ క్లైమాక్స్‌లో ఇతడి పాత్రని తొలి సీన్ నుంచి లింక్ చేసిన విధానం.. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అలానే '8 వసంతాలు' అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా సరే హీరోయిన్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. డైలాగ్స్ అయితే భావుకత, కవితలు అంటే ఇష్టపడేవారితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చేస్తాయి.

ఎవరెలా చేశారు?
శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక జీవించేసింది. 17 ఏళ్ల అమ్మాయిగా, 25 ఏళ్ల మహిళగా వేరియేషన్స్ చూపించింది. వరుణ్‌గా చేసిన హనురెడ్డి.. ఎన్నారై కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో వచ్చే సంజయ్ పాత్రధారి రవి దుగ్గిరాల ఇదివరకే 'మధురం'లో నటించాడు. ఇందులో అతడి పాత్ర ఉన్నది కాసేపు అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది. మిగిలిన పాత్రధారులు కూడా ఎవరికి వాళ్లు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్‌గా చూసుకుంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ హైలైట్. ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి వస్తుంటుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఊటీ, కశ్మీర్, కాశీ అందాల్ని బాగా చూపించారు. ఇక డైరెక్షన్ విషయానికొస్తే.. ఇదివరకే మధురం షార్ట్ ఫిల్మ్, మను సినిమాతో తానెంటో నిరూపించుకున్న ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు '8 వసంతాలు' సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

స్వచ్ఛమైన ప్రేమకథని వినసొంపైన సంగీతంతో మనసుని తాకే సంభాషణలతో తీసిన ఓ మంచి సినిమా చూడాలనుకుంటే '8 వసంతాలు' అస్సలు మిస్ కావొద్దు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.

- చందు డొంకాన

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement