భారత విజ్ఞానం
ఎవరైనా ఏదైనా పనికి అడ్డుపడితే ‘సైంధవునిలా అడ్డు పడుతున్నాడు‘ అనే నానుడి సమాజంలో ఉంది. ఇందుకు సంబంధించి ఈ నానుడి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
మహాభారతంలో కౌరవుల ఏకైక సోదరి దుస్సల అని అందరికీ తెలిసిందే. ఆమె భర్తే సైంధవుడు. ఇతడి అసలు పేరు జయద్రథుడు. సింధు దేశాన్ని పాలించిన రాజు కాబట్టి సైంధవుడు అని పేరు వచ్చింది. సైంధవునికి దుస్సలతో పాటు మందాకిని, కుముద్వతి అనే ఇరువురు భార్యలున్నారు.
పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న రోజులలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని వావి వరసలు మర్చిపోయి బలవంతంగా రథం పైకి తీసుకువెళ్లడానికి సైంధవుడు ప్రయత్నించాడు. భీముడు సైంధవుని బంధించి ధర్మరాజు ముందు ప్రవేశపెట్టాడు. తమ చేతులతో అతడి ప్రాణాలు తీసి, చెల్లెలికి వైధవ్యం కలిగించకూడదనే ఉద్దేశంతో అందుకు సమానమైన శిక్షగా..
శిరోముండనం చేసి వదిలి పెట్టారు. దీంతో పాండవులపై పగతో సైంధవుడు శివుని గురించి తపస్సు చేసి అర్జునుడు మినహా మిగిలిన పాండవులను ఒక్కరోజు అడ్డుకునే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజున ద్రోణుడు రచించిన పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించగా అతని వెనక పద్మవ్యూహంలోకి ప్రవేశించే అర్జునుడు మినహా మిగిలిన నలుగురు పాండవులను శివుని వరం వల్ల సైంధవుడు అడ్డుకున్నాడు. దీనివల్ల పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఒంటరివాడై అసువులు బాసాడు.
ఇదిలా ఉండగా అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుడిని ఆ మర్నాడు సూర్యాస్తమయంలోగా చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు సూర్యాస్తమయానికి ఇంకా సమయం ఉండగానే శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, యోగమాయతో సూర్యునికి అడ్డువేశాడు. దీంతో చీకట్లు కమ్మడంతో సూర్యాస్తమయం అయిపోయిందని సైంధవుడు భావించి బయటకు రాగా అర్జునుడు సైంధవుడిని పాశుపతాస్త్రంతో వధించి అతని తల నేలపై పడకుండా అతని తండ్రి అయిన వృద్ధక్షతుడి చేతిలో పడేలా చేయమని శ్రీ కృష్ణుడు చెబుతాడు. ఎందుకంటే సైంధవుడి తల ఎవరి చేతిలోనుంచి కింద పడుతుందో వారి తల నూరు చెక్కలవుతుందన్న వృద్ధక్షతుడి శాపం అతనికే తగిలి అతడు కూడా మరణిస్తాడు. అప్పటినుంచి ఎవరైనా ఏ పనికైనా అడ్డుపడుతుంటే సైంధవుడిలా అడ్డు పడుతున్నాడన్న సామెత వ్యాప్తిలోకి వచ్చింది.
– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు


