చేనేతలకు జాతీయ గౌరవం..! ఒకరు ప్రకృతి సాయంతో, మరొకరు మార్కెటింగ్‌తో.. | Puttapaka weavers Narmada And Pawan win national awards | Sakshi
Sakshi News home page

చేనేతలకు జాతీయ గౌరవం..! ఒకరు సరికొత్త పంథాతో, మరొకరు మార్కెటింగ్‌తో..

Jul 9 2025 10:10 AM | Updated on Jul 9 2025 10:20 AM

Puttapaka weavers Narmada And Pawan win national awards

చేనేత ఎంత అద్భుతమైన కళో, చేనేత వస్త్రాలను మార్కెంటింగ్‌ చేయడం కూడా అంతే అద్భుత కళ. ఆ కళలో ఆరితేరిన గజం నర్మద ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.

భారత ప్రభుత్వం, చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ వివిధ విభాగాలలో ఇచ్చే జాతీయ పురస్కారాలలో మార్కెటింగ్‌ విభాగంలో ఇచ్చే పురస్కారానికి నర్మద ఎంపికైంది...నిరాశవాదులకు నలుదిక్కులా నిరాశ మాత్రమే కనిపిస్తుంది. ఆశావాదులకు అనేక దారులు కనిపిస్తాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద ఆశావాది.

ఉత్సాహమే శక్తిగా ప్రతి అడుగు
చేనేత కళ మసక బారుతున్నట్లు అనిపించినప్పుడు, ‘చేనేత రంగం కాలం చెల్లిన రంగం’ అనే మాటలు వినిపిస్తున్నప్పుడు నర్మద ఎప్పుడూ నిరాశపడిపోలేదు. ‘బంగారు పళ్లేనికి అయినా గోడ చేర్పు కావాలి’ అనే మాటను ఎన్నో సార్లు విని ఉన్నది నర్మద. చేనేత అనేది బంగారంలాంటి కళ. ఆ కళకు ‘మార్కెటింగ్‌ నైపుణ్యం’ అనే గోడ చేర్పును తీసుకువచ్చి విజయం సాధించింది.

ఎంతోమందికి ఉపాధి
‘గజం నర్మద హైండ్లూమ్‌’ పేరుతో హైదరాబాద్‌లో చేనేత వస్త్రాల వ్యాపారం ప్రారంభించింది నర్మద. 2013లో రూ.10 లక్షల వ్యయంతో ప్రారంభించిన ఫర్మ్‌ ఇప్పుడు రూ. 8 కోట్ల టర్నోవర్‌కు చేరింది. 

జనగామ జిల్లాలలోని సుమారు మూడు వందల మంది చేనేత కళాకారుల నుంచి చేనేత పట్టు ఇక్కత్‌ చీరెలు కొనుగోలు చేస్తుంది. రకరకాల అప్‌డేట్‌ డిజైన్లతో అందంగా తయారైన చీరెలను ఆన్‌లైన్‌ లో ఆర్డర్‌లు తీసుకుంటుంది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరు, ముంబై...దేశంలోని ప్రధాన నగరాల్లో ఇక్కత్‌ చీరెలను విక్రయిస్తుంది.

మరింత ఉత్సాహం... మరింత స్ఫూర్తి
చేనేత మార్కెటింగ్‌లో ఈ ఏడాది నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. కనుమరుగు అవుతున్న చేనేత వృత్తికి ఈ జాతీయ పురస్కారం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మా గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్యలు నాకు ఆదర్శం. 

ప్రఖ్యాత డిజైనర్‌ గౌరంగ్‌ నాకు స్ఫూర్తి. లేటెస్ట్‌ డిజైన్‌లు రూపొందించి విక్రయించడం వల్ల ఇక్కత్‌ చీరెలకు మరింత ఆదరణ లభిస్తోంది. జాతీయ అవార్డు రావడం నాకే కాదు చేనేత రంగంలో పనిచేస్తున్న మహిళలకు ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది అని భావిస్తున్నా అని చెప్పారుగజం నర్మద.

ప్రకృతి 'పోగు’చేసి...
‘అలాగే’ అనుకొని పాత దారిలోనే నడిచేవాళ్లు కొందరు. ‘ఇలా కూడా’ అని కొత్తదారిలో నడిచి విజయం సాధించేవాళ్లు కొందరు. రెండో కోవకు చెందిన పవన్‌ రసాయన రంగులు లేని చేనేత చీర గురించి కల కన్నాడు. చేనేత కళకు కొత్త కళ తీసుకువచ్చాడు. 

సహజ సిద్ధమైన రంగులతో, తేలియా రుమాల్‌ డిజైన్‌తో డబుల్‌ ఇక్కత్‌ పట్టు చీరెను తయారు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌  నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన గూడ పవన్‌ యువ చేనేత విభాగంలో ఇచ్చే జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాడు.

చీర తయారీ ఇలా...
బంతి పూలు, దానిమ్మ పండ్లు, పుదీన, కొత్తిమీర, బెల్లం, ఉల్లిగడ్డ పొట్టు, ఆకులు, చెట్ల బెరడు... ఇలా ప్రకృతి నుంచి సేకరించిన పదార్థాలతో సహజరంగులు తయారు చేశాడు. ఈ రంగులను మల్బరీ పట్టుదారానికి అద్ది తేలియా రుమాల్‌ డిజైన్‌తో పట్టుచీరను తయారుచేశాడు. సహజ పదార్థాలను ఎండబెట్టడం, ఉడకబెట్టడం, రంగులు అద్దడం, చీరెకు డిజైన్‌లు చేసే ప్రక్రియకు ఆరు నెలలు పట్టింది. 

6.25 మీటర్‌ల పొడవు, 46 ఇంచుల వెడల్పుతో తయారుచేసిన ఈ చీరెలో తేలియా రుమాల్‌కు సంబంధించిన పదహారు ఆకృతులు ఉన్నాయి. బంతిపూలు, రథం, త్రీడీ డిజైన్‌... ఇలా రకరకాల డిజైన్‌లు చీర పొడవునా ఉంటాయి. రకరకాల ఆకృతులతో చీర అందంగా కనిపిస్తుంది. సాధారణ పట్టు చీరెలా ముడతలు పడకుండా మృదువైన పట్టును ఈ చీరె కోసం వాడారు. 

రంగు వెలవని చీర ఒక్కటి రూ.75 వేలు ఖరీదు చేస్తుంది. గత సంవత్సరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎదురుగా మగ్గంపై ఈ చీరె నేసి ప్రశంసలు అందుకున్నాడు. బీటెక్‌ మధ్యలోనే వదిలేసి తండ్రి శ్రీను దగ్గర చేనేతలో శిక్షణ పొందాడు.   

శ్రమకు తగిన ఫలితం
సహజ సిద్ధమైన రంగుల డిజైన్లతో పట్టు చీరెను నేయడం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాను. పడిన శ్రమకు గుర్తింపు దక్కింది. నేను నేసిన చీరెకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ చీరెలో ఉన్న రంగులు వెలిసిపోకుండా ఉంటాయని చెబుతున్నారు గూడ పవన్‌ 
– యంబ నర్సింహులు,  సాక్షి, యాదాద్రి 

(చదవండి:  పెళ్లి అంటే డబ్బు, హోదా కాదు..! అంతకంటే ముందు..: ఉపాసన కొణిదెల)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement