మీ ఇంట్లో వృద్ధులున్నారా? అయితే, ఈ మార్పులు చేయాల్సిందే!

Precautions For Elderly Care At Home Of Aging Parents And Seniors - Sakshi

చలాకీగా ఉండే వయసు హరించుకుపోయి జీవిత చరమాంకానికి చేరుకునే తరుణంలో మనిషికి మానసిక స్వాంతన ఎంతో అవసరం. తన అనుకున్నవారికి తానే భారం అవుతున్నానన్న బాధ పెద్దవారికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లోవారిదే! ఇందుకోసం ఇంట్లో పెద్దల అవసరాలకు తగినట్లు కొద్దిపాటి మార్పులు చేయించడం కీలకమని డాక్టర్ల సలహా. దీనివల్ల వృద్ధులు తమ పనులు తాము చేతనైనంత వరకు సొంతంగా చేసుకుంటూ, ఒకరిపై ఆధారపడకుండా జీవించే వీలు చిక్కుతుంది. ఒకరిపై ఎక్కువగా ఆధారపడకుండా వృద్ధాప్యం గడిచేందుకు ఇంట్లో చేయాల్సిన చిన్నపాటి మార్పులను చూద్దాం!

► అవసరమైన చోట్ల వీల్‌చైర్‌ లేదా వాకర్‌ కోసం ర్యాంప్‌ ఏర్పాటు చేయాలి.

► టాయిలెట్లు, షవర్ల దగ్గర హ్యాండ్‌ రెయిల్స్, గ్రాబ్‌ బార్స్‌ను ఏర్పరచాలి.

► వీలుంటే మాములు టాయిలెట్ల బదులు ఒక్కటైనా రైజ్డ్‌ టాయిలెట్‌ ఏర్పాటు చేయించడం మంచిది.

► ఇంట్లో స్మోక్, హీట్‌ డిటెక్టర్లను ఇన్‌స్టాల్‌ చేయించాలి

►వృద్దులకు అవసరమైనంత గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చేలా అవసర వెంటిలేషన్‌ ఏర్పరచాలి.

►నిద్రలో నడిచే అలవాటు ఉన్న వారుంటే ఆటో సెన్సర్లను ఇన్‌స్టాల్‌ చేయించడం ద్వారా రాత్రుళ్లు వారి కదలికలపై కన్నేసి ఉంచొచ్చు.

►ఇంట్లో అనవసరమైన ఫర్నిచర్, సామగ్రి అడ్డదిడ్డంగా లేకుండా సర్దుకోవాలి.

►టెలిఫోన్‌ , ఇంటర్నెట్‌ తదితర వైర్లేవీ కాళ్లకు అడ్డం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

►ఇంట్లో కరెంట్‌ కనెక్షన్లు షార్ట్‌ సర్క్యూట్‌ కాకుండా జాగ్రత్త వహించాలి.

వీలయినంత వరకు ఎవరో ఒకరు పెద్దవారిని గమనిస్తూ ఉండడం, వారికి వేళకు సరైన ఆహారాన్ని అందించడం, మందులు వాడుతుంటే మర్చిపోకుండా సమయానికి అందించడం, వారి మాటలకు విసుక్కోకుండా వారితో కొంత సమయం గడపడం, వీలైతే వారికి ఏదైనా వ్యాపకం కల్పించడం వంటి చర్యలు వృద్ధాప్యంలో ఉన్నవారికి ఊరటనిస్తాయి. ఒకవేళ తప్పనిసరైన పరిస్థితుల్లో పెద్దవారిని వృద్ధాశ్రమాల్లో చేర్చాల్సివస్తే సదరు ఆశ్రమాల్లో పైన పేర్కొన్న అంశాలున్నాయో, లేదో పరిశీలించి ఎంచుకోవడం మంచిది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top