
తాత్త్వికథ
ఒక ఊర్లో ఓ మోతుబరి రైతు ఉండేవాడు. బాగా సంపాదించిన అతడికి వయసుపైబడింది. వృద్ధాప్యం సమీపించే కొద్దీ అతడిలో ప్రాణ భయం పట్టుకుంది. ఒక రోజు పొలం పనుల మీద పక్క ఊరికెళ్ళాడు. చిన్నగా మొదలైన వాన చినుకులు కొద్దిసేపటికే పెద్ద వర్షంగా మారింది. అటూ ఇటూ చూశాడు. దూరంగా పెద్ద మర్రిచెట్టు కనిపించింది. గబగబా నడుచుకుంటూ వెళ్ళి చెట్టుకింద నిలబడ్డాడు. ఆ మర్రి చెట్టు కింద మట్టితో బొమ్మలు తయారు చేసే కుమ్మరి ఉన్నాడు. రకరకాల అందమైన బొమ్మలు తయారు చేసి అమ్మకానికి పెట్టి ఉన్నాడు.
ఇంతలో వాన ఉధృతమయ్యింది. వానకి మట్టి బొమ్మలు కొన్ని చిన్నచిన్నగా కరిగిపోసాగాయి.దాన్ని కళ్ళారా చూసిన రైతు, ఆ కుమ్మరి దగ్గరకు వెళ్ళి ‘‘నీకు బాధగా లేదా?’’ అని అడిగాడు. ‘‘బాధగా లేదు. ఇది సహజం!’’ అని బదులిచ్చాడు కుమ్మరి. ‘‘ఎందుకు బాధ లేదని చెబుతున్నావు? నీకు నష్టం జరుగుతోంది కదా’’ అని మళ్ళీ ప్రశ్నించాడు రైతు.‘‘ఈ మట్టి బొమ్మలు ఆకాశంలో నుంచి ఊడి పడలేదు. అవి మట్టితో తయారు చేసినవి.
మట్టినుంచి వచ్చినవి మట్టిలోకే కదా పోతాయి. దానికెందుకు బాధపడాలి. నాకు దేవుడిచ్చిన శరీరం ఉంది. మరింత కష్టపడి మరిన్ని బొమ్మలు తయారు చేయగలను, ఈ జానెడు పొట్ట నింపుకోగలను.నిజంగా ఈ మట్టిబొమ్మల మీద నాకు ఏ హక్కూ లేదు. కారణమేమిటంటే అవి ప్రకృతిలో ఉచితంగా దొరికిన మట్టితో తయారు చేయబడినవి. అది ప్రకృతి నాకిచ్చిన అవకాశం.
ఈ మట్టిని బొమ్మలుగా మార్చి నా పొట్ట గడుపుకుంటున్నానని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటాను. అందుకే నేను లాభాలకు పొంగిపోను, నష్టాలకు క్రుంగి పోను. నిజం చె΄్పాలంటే ఈ కరిగిపోతున్న మట్టిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అవి పుట్టింటికి వెళ్తున్నాయన్న స్పృహ నాకుంది’’ అని బదులిచ్చాడు.
కుమ్మరి చెప్పిన జీవిత సత్యం విని రైతు ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని తనకి అన్వయించుకున్నాడు. ‘మన జీవితం కూడా మూన్నాళ్ళ ముచ్చటే కదా. దేవుడు ఆడించే బొమ్మలాటే కదా. ఎక్కడినుంచి వచ్చామో, అక్కడికి వెళ్ళడం ఎవ్వరికైనా తప్పదు కదా’ అని గుర్తు తెచ్చుకున్నాడు. ఇంతలో వాన నిలవడంతో అక్కడినుంచి కదిలాడు రైతు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
1