
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలికి చెందిన అమ్మాయి ఒకరు ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను’ అని అర్థరాత్రి దాటిన తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘మెటా’ వెంటనే ఈ పోస్ట్‌ను స్టేట్ పోలీస్ మీడియా సెంటర్‌కు పంపి పోలీసులను అలర్ట్ చేసింది.
కేవలం పదహారు నిమిషాల వ్యవధిలో ఒక సబ్–ఇన్‌స్పెక్టర్, కొందరు మహిళా పోలీసులు ఆ అమ్మాయి ఉన్న ఇంటికి చేరుకున్నారు. వాంతులు చేసుకున్న ఆ అమ్మాయి నిస్తేజంగా పడి ఉంది. వెంటనే ఆమెను హస్పిటల్‌కు తీసుకువెళ్లారు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి చావు నుంచి బయటపడింది.
ఆమె కోలుకున్న తరువాత... ‘ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?’ అని అడిగితే... తాను ప్రేమించిన వ్యక్తి మాట్లాడడం మానేశాడని, తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని...ఇలా చెప్పుకుంటూ పోయింది.
పెరుగుతున్న ఆన్‌లైన్ సుసైడ్ అటెంప్ట్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు, మెటా భాగస్వామ్యంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సుడైడ్–రిలేటెడ్ పోస్ట్‌లపై నిఘా పెడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్నారు. జనవరి 1, 2023 నుంచి ఆగస్ట్ 25, 2025 వరకు 1,315 మంది ప్రాణాలను కాపాడారు.
(చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!)