
మెడనొప్పి అనే సమస్య జీవితకాలంలో ప్రతి వ్యక్తీ ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనేదే. అయితే అదేపనిగా నొప్పి వస్తుంటేనో లేదా మెడ నుంచి అది భుజానికీ లేదా చేతుల చివరలకో పాకుతుంటే మాత్రం కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. మెడనొప్పికి కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం.
తీవ్రమైన మెడనొప్పి కారణంగా కొన్నిసార్లు కొంతమందిలో నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి మూత్రవిసర్జనలో సైతం తేడాలు వచ్చి ఇతర సమస్యలకూ దారితీయవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి వచ్చే నొప్పిని మినహాయించి, పదే పదే నొప్పి వస్తున్నా లేదా దీర్ఘకాలంగా బాధిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
ఎందుకీ మెడనొప్పి...
మెడ భాగంలో ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటిదాన్ని అట్లాస్ అనీ, రెండో వెన్నుపూసను యాక్సిస్ అంటారు. ఈ తర్వాత ఉండే పూసలను వరసగా సి3, సి4, సి5, సి6, సి7 అని పిలుస్తారు. ఈ వెన్నుపూసల మధ్య ఉండే ప్రదేశాన్ని స్పైనల్ కెనాల్ అంటారు. దానిలోంచి వెన్నుపాము వెళ్తూ మెదడు నుంచి చేతులు, కాళ్ల చివరి వరకు నరాలను తీసుకెళ్తుంది.
వెన్నుపూసకూ, వెన్నుపూసకూ మధ్యనున్న ‘వర్టిబ్రల్ ఫొరామినా’ అనే రంధ్రాల నుంచి వెన్నుపాము తాలూకు నరాలు బయటకు వచ్చి అన్ని అవయవాలకూ వ్యాపించి ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యన కుషన్‌లా, షాక్ అబ్జార్బర్‌లా డిస్క్‌లు ఉంటాయి.
ఒక్కోసారి వెన్నుపూసల మధ్య కుషన్‌లా ఉండే డిస్క్‌లు పక్కకు జారడం వల్లనో లేదా బాగా అరగడంతో నరాలపై (ప్రధానంగా చేతులకి సప్లై అయ్యే నరాలపై) ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంటుంది. మెడదగ్గర ఉండే నరాలు భుజం వరకు ఉండటంతో ఈ నొప్పి మెడ నుంచి భుజం మీదుగా చేతుల వరకు పాకుతూ బాధిస్తుంటుంది.
నిర్ధారణ ఇలా...
మెడనొప్పి వచ్చే వారికి తొలుత ఎక్స్–రే పరీక్ష చేయిస్తారు. ఇందులో మెడ వెన్నుపూసలలో ఏమైనా తేడాలు వచ్చాయా అని తెలుస్తుంది. మరింత సునిశితమైన అంశాల కోసం ఎమ్మారై కూడా చేయించాల్సి రావచ్చు. ఏ నరంపై ఎంత ఒత్తిడి ఉంది, దేనివల్ల కలుగుతోంది, ఎముక ఏదైనా ఫ్రాక్చరైందా, నరాల్లో వాపు, గడ్డలు ఉన్నాయా... లాంటి అనేక విషయాలు ఎమ్మారైలో తెలుస్తాయి.
ఉపశమనం కోసం...
మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో మెత్తటి గుడ్డను ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టాలి. ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపడం పెట్టడం కూడా మంచిదే. ఈ కాపడాల వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా మెడకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో మెడ కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అలా విశ్రాంతి ఇవ్వకపోతే నొప్పి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
నొప్పి ఉన్న సమయంలోనే గాక... మామూలు వేళల్లోనూ ఒకే భుజానికి బరువైన బ్యాగ్‌ల వంటివి తగిలించుకోకూడదు. ఇలా చేయడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.
నడిచే సమయంలో ఒకేవైపునకు ఒంగడం సరికాదు.
చికిత్స...
సాధారణ మెడనొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్‌మెంట్లను రోజుకి ఐదు నుంచి ఆరుసార్లు పూయాలి.
నొప్పి నివారణ కోసం దీర్ఘకాలం పెయిన్‌కిల్లర్స్ ఉపయోగించడం సరికాదు. ఒకవేళ పెయిన్‌కిల్లర్స్‌తో ఒకటి రెండు రోజుల్లో రిలీఫ్ రాకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను / ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
డిస్క్ తన స్థానం నుంచి పక్కకు జరగడం లాంటిది జరిగితే శస్త్రచికిత్సతో సరిదిద్దాల్సిన అవసరం పడవచ్చు.
డాక్టర్ రవితేజా రెడ్డి, కారుమూరి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్
(చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..)