Sodder Children Disappearance: హృదయవిదారక మిస్టరీ..! కన్న బిడ్డలు బతికున్నారోలేదో తెలియక..

Mysterious Telugu Story in Funday Magazine - Sakshi

ఒక అగ్నిప్రమాదం.. రాత్రికి రాత్రే వారి సంతోషాల్లో నిప్పులు పోసింది. బతుకంతా నిరీక్షించేలా చేసింది. అది శత్రువు పగతో చేసిన ఘోరమో? లేక విధి వికృతంగా పన్నిన పన్నాగమో? తెలియకుండానే జీవితాలకు జీవితాలు ముగిసిపోయాయి. 
కడుపు కోతకు మించిన దుఃఖం ఉండదు. కన్నబిడ్డలు బతికి ఉన్నారా.. లేదా తెలియని స్థితికి మించిన నరకం ఉండదు. అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు జార్జ్, జెన్నీ సోడర్‌ దంపతులు.

1945 డిసెంబర్‌ 24న అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో అర్ధరాత్రి ఒంటిగంటకు జార్జ్‌ నివసిస్తున్న రెండంతస్తుల భవనానికి ఉన్నట్టుండి నిప్పు అంటుకుంది. జెన్నీ, జార్జ్‌లు.. తమతో నిద్రిస్తున్న నలుగురు పిల్లల్ని తీసుకుని బయటికి పరుగుతీశారు. కానీ పై అంతస్తులో నిద్రపోతున్న మరో ఐదుగురు పిల్లల్ని కాపాడటానికి వీలుకాలేదు. కనీసం ఫైర్‌ స్టేషన్‌ కి కాల్‌ చేద్దామంటే.. టెలిఫోన్‌ వైర్లు తెగిపడున్నాయి. దగ్గర్లో ఉన్న బొగ్గు ట్రక్కుల సాయంతో పై అంతస్తుకి ఎక్కుదామంటే.. వాటి ఇంజిన్లు స్టార్ట్‌ కాలేదు. మారిస్‌(14), లూయీ(9) అనే ఇద్దరు మగపిల్లలు.. మార్తా(12), ఐరీన్‌ (8), బెట్టీ (5) అనే ముగ్గురు ఆడపిల్లలు పైనే ఇరుక్కుపోయారు. 


                                     మారిస్, లూయీ, మార్తా, ఐరీన్, బెట్టీ

చూస్తుండగానే ఇల్లు కాలి బూడిదైంది. షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి, ఐదుగురు పిల్లలు సజీవదహనం అయ్యార ని కేసు క్లోజ్‌ చేశారు పోలీసులు. కానీ జార్జ్‌ దంపతులు తమ పిల్లలు చనిపోలేదని, కిడ్నాప్‌ అయ్యారని నమ్మారు. పక్కదారి పట్టించేందుకే అగ్నిప్రమాదాన్ని సృష్టించారనే వాదన వినిపించారు. అందుకు చాలా సాక్ష్యాలను సిద్ధం చేశారు. వాటిలో ముఖ్యమైనది అంతపెద్ద ప్రమాదం జరుగుతుంటే పిల్లల నుంచి ఎటువంటి అరుపులు వినిపించలేదు. లెక్కప్రకారం గంటలోనే కాలి బూడిదైన ఇంటిలో.. ఐదు అస్థిపంజరాలు దొరకాలి. కానీ ఒకే ఒక్క మాంసం ముద్ద, కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి.

వాళ్ల పనేనా?
జార్జ్‌ సోడర్‌ ఇటలీలోని సార్డినియాలో 1895లో జన్మించాడు. తన 13వ ఏట కుటుంబంతో కలసి అమెరికాకు వలస వచ్చాడు. ఇక జెన్నీ కూడా వలస వచ్చిన ఇటలీ వాసే. పెళ్లి తర్వాత ఈ జంట ఇటాలియన్‌ కమ్యునిటీకి చెందిన ఫాయెట్‌విల్లే సమీపంలో స్థిరపడ్డారు. అయితే ఆ ఏరియాలో ఉన్న ఇతర ఇటాలియన్లు నియంత అయిన బెనిటో ముస్సోలినీని సపోర్ట్‌ చేసేవాళ్లు. బలమైన రాజకీయాభిప్రాయాలు కలిగిన జార్జ్‌.. వారితో వాగ్వాదాలకు దిగేవాడు. 


                                              జెన్నీ, జార్జ్‌ సోడర్‌ దంపతులు

అదే పగతో వాళ్లెవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్లారా? అనేది చిక్కుముడిగా మారింది. అగ్నిప్రమాదం జరిగే కొన్ని నెలల ముందు ఒక అపరిచితుడు జార్జ్‌ వాళ్లింటికి వచ్చి కుటుంబ బీమా తీసుకోవాలని పట్టుబట్టాడు. నిరాకరించడంతో ‘త్వరలోనే ఈ ఇల్లు కాలి బూడిదవుతుంది. పిల్లలు నాశనమయిపోతారు. ముస్సోలినీని విమర్శించి నందుకు మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించి వెళ్లిపోయాడు. అప్పుడు జార్జ్‌ పట్టించుకోలేదు. ఘటన తర్వాత అతడు దొరకలేదు.

ఫోన్‌ కావాలనే చేశారా?
అగ్ని ప్రమాదం జరిగిన రోజు రాత్రి.. పన్నెండున్నరకు గాఢనిద్రలో ఉన్న జెన్నీ ఓ ఫోన్‌ కాల్‌కి నిద్రలేచింది. అవతల ఒక ఆడ గొంతు.. జెన్నీ ఎప్పుడూ వినని పేరు. ‘రాంగ్‌ నంబర్‌’ అని జెన్నీ అనగానే అవతల నుంచి ఓ నవ్వు వినిపించింది. అర్థం కాని జెన్నీ.. ఫోన్‌ పెట్టేసి.. వెళ్లి పడుకుంది. అప్పుడే ఇంటి పైకప్పు మీద ఏదో పడిన శబ్దం జెన్నీకి వినిపించింది. గంటలోపే రూమంతా పొగకమ్మింది. 

మరిన్ని షాకింగ్‌ నిజాలు..
ఘటన తర్వాత టెలిఫోన్‌ రిపేర్‌చేసే వ్యక్తి ఆ ఇంట్లో తగలబడిపోయిన వైర్లను చూసి.. టెలిఫోన్‌  వైర్లు మంటల్లో కాలిపోకముందే.. ఎవరో కావాలనే లైన్‌కట్‌ చేశారని తెలిపాడు. మరోవైపు ఓ స్థానికుడు.. ఆ ఇంటి దగ్గర్లో వాహనాల ఇంజిన్‌లను తొలగించే పరికరాన్ని చూశానని చెప్పడంతో.. కావాలనే బొగ్గు ట్రక్కుల ఇంజిన్లు పనిచేయకుండా చేశారనే అనుమానం బలపడింది. బూడిదైన ఇంట్లో.. జార్జ్‌కు సగం కాలిన ఒక గట్టి రబ్బరు వస్తువు కనిపించింది. అది పైనాపిల్‌ బాంబు తయారు చేయడానికి ఉపయోగించే వస్తువు. అంటే జెన్నీకి ఆ రాత్రి వినిపించిన శబ్దం బాంబేనా? అనే కొత్త సందేహం మొదలైంది.

అసలైన నిర్ధారణ ఇదే
పిల్లల ఫొటోలను పేపర్‌లో వేయడంతో పాటు ఆ చుట్టుపక్కల గోడలపై అతికించి.. జాడ చెబితే 5 వేల డాలర్లు ఇస్తానని రివార్డ్‌ ప్రకటించాడు జార్జ్‌. అప్పుడే ఒకామె ఆ ఐదుగురు పిల్లల్ని చూశానంటూ వచ్చింది. ఆ ఇంటికి 50 మైళ్ల దూరంలో టూరిస్ట్‌ బూత్‌ నడుపుతున్నానని, అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఉదయమే తనకు ఆ పిల్లలు కనిపించారని, వాళ్లు ఫ్లోరిడా లైసెన్స్‌ ప్లేట్‌తో ఉన్న ఒక టూరిస్ట్‌ కారులో ఉన్నారని, వాళ్లకు తానే టిఫిన్‌ పెట్టానని చెప్పింది. జార్జ్‌ దంపతుల ఆశలు బలపడ్డాయి. మరోవైపు సౌత్‌ కరోలినా అనే హోటల్‌లో పనిచేసే మరొకామె ఐదుగురిలో నలుగురు పిల్లల్ని చూశానని పిల్లలతో పాటు ఎవరో నలుగురు పెద్దవాళ్లూ ఉన్నారని, వాళ్లు పిల్లల్ని నాతో మాట్లాడనివ్వలేదని చెప్పింది.

ఇలాంటి పలు ఆధారాలతో 1947లో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు ఆ దంపతులు రిక్వెస్ట్‌ చెయ్యడంతో కేసు రీఓపెన్‌  అయ్యింది. అందులో భాగంగా ఇంటి బూడిదల్లో దొరికిన మాంసం ముద్దను, ఎముకలను మరోసారి టెస్ట్‌ చేశారు. అయితే అవి పిల్లలవి కావని, మాంసం ఒక జంతువుదని, ఎముకలు 17 ఏళ్లు పైబడిన గుర్తు తెలియని యువకుడివని తేలాయి. దాంతో రివార్డ్‌ను 10 వేలకు పెంచాడు జార్జ్‌.

23 ఏళ్ల తర్వాత 1968లో జార్జ్‌కు ఫ్రమ్‌ అడ్రెస్‌ లేని ఒక పోస్ట్‌ వచ్చింది. అందులో ఒక యువకుడి ఫొటో ఉంది. ఫొటో వెనుక లూయీ సోడర్, ఐ లవ్‌ బ్రదర్‌ ఫ్రాంకీ అని రాసి ఉంది. అదే జార్జ్‌ కుటుంబానికి చివరిగా దొరికిన ఆధారం. అదే విషయాన్ని పోలీసుల ముందు పెడితే నవ్వారు. కానీ ఆ యువకుడు తప్పిపోయిన పిల్లల్లో ఒకడైన లూయీలానే ఉన్నాడని జార్జ్‌ నమ్మాడు. ఆ పోస్ట్‌ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేందుకు ఒక డిటెక్టివ్‌ని కూడా నియమించాడు. కానీ డిటెక్టివ్‌ డబ్బులు తీసుకున్నంత వేగంగా ఇన్వెస్టిగేషన్‌ చెయ్యలేపోయాడు. ఆ పోస్ట్‌ అందుకున్న ఏడాదికే అనారోగ్యంతో జార్జ్‌ కన్నుమూశాడు. సుమారు 21 ఏళ్లు జెన్నీ కూడా తన పిల్లలకోసం నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తూనే బతికింది. 

బతికి ఉన్నన్నాళ్లూ నిరసనగా నల్లటి దుస్తులనే ధరించింది. ఆమె మరణం తర్వాత.. అంటే 1989 నుంచి 2021 వరకూ.. జార్జ్‌–జెన్నీల చిన్న కూతురు సిల్వియా సోడర్‌.. తన మనవళ్లతో కలసి.. లేటెస్ట్‌ టెక్నాలజీ సాయంతో కూడా తన తోబుట్టువులను వెతికే ప్రయత్నం చేసింది. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగేనాటికి సిల్వియా వయసు రెండేళ్లు. 2021 ఏప్రిల్‌ 21న తన 79వ ఏట.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది సిల్వియా. నాటి ఘటనలో ఏకైక సాక్ష్యంగా మిగిలిన జార్జ్‌ ఏకైక వారసురాలు సిల్వియా కూడా ఇప్పుడు ప్రాణాలతో లేదు. బహుశా సిల్వియా కంటే పెద్దవాళ్లైన ఆ ఐదుగురు కూడా ప్రాణాలతో ఉండి ఉండరు. కానీ పేగుబంధం కోసం కన్నప్రేమ చేసే పోరాటాలకు ఈ మిస్టరీ ఓ హృదయవిదారకమైన ఉదాహరణగా మిగిలింది.

- సంహిత నిమ్మన

చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top