మన(సు)లో మాట
నాకు పెళ్లి అయి 12 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త మంచివాడే, ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తనలో ఉన్న ఒక చిత్రమైన అలవాటు నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. అదేమంటే అతను రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని అదోలా చూస్తుంటాడు. వారికి ఏదో ఒక పేరు పెడతాడు. తర్వాత నాతో వారి శరీర సౌష్టవం గురించి కామెంట్స్ చేస్తాడు. మా ఏకాంత సమయంలో ఆ పేర్లు కలవరిస్తూ ఉంటాడు. మొదట్లో అంతగా అనిపించలేదు కానీ పోను పోనూ ఆయన ప్రవర్తన నాకు కంపరంగా తయారైంది. దాంతో అతని మీద ఒకవిధమైన విముఖత ఏర్పడింది. ఒక్కోసారి అతన్ని వదిలేసి వెళ్ళి పోవాలనిపిస్తుంది కూడా! గట్టిగా అడిగితే అలా ఊహించుకోకుండా ఉండలేక పోతున్నానంటారు. ఇదేమైనా మానసిక సమస్య అంటారా! ‘మా సమస్యకేదైనా పరిష్కారముందా? – ఒక సోదరి, నంద్యాల
మీ ఉత్తరం చదివి మీరు పడే క్షోభను అర్థం చేసుకోగలను. ఊహ అనేది మనిషికి మాత్రమే ఉన్న ఒక అద్భుత శక్తి. ఒక విజయం సాధిస్తానని ఊహించడం మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అలాగే భార్యా భర్తల బంధం కొంచెం రొటీన్‌గా మారినప్పుడు ఇలా ‘ఫాంటసైజ్’ చేయడం కొందరికి కొత్త ఉత్సాహన్ని ఇస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఊహించుకోవడం మామూలే! ఇది పురుషుల్లో అధికంగా చూసినప్పటికీ, స్త్రీలు కూడా ఇలా ‘ఫాంటసైజ్’ చేసుకుంటారని పరిశోధనల్లో తేలిన విషయం. అమెరికాలో 90వ దశకంలో జరిపిన ఒక పరిశోధన ప్రకారం కొందరు స్త్రీ, పురుషులు తమ భాగస్వామితో ఉన్నప్పుడు, వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. మనదేశంలో జరిపిన పరిశోధన లో కూడా కనీసం 35 శాతం మంది ఇలా వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. పురుషులు ఎక్కువగా తెలియని వారిని, సెలబ్రిటీలను ఊహించుకుంటే, స్త్రీలు తమకు తెలిసిన వారినే ఎక్కువ ఊహించుకుంటారని తెలిసింది. దీనికి ప్రధానమైన కారణం మెదడులో, ‘డోపమిన్’ అనే రసాయనం చాలా తొందరగా తగ్గిపోడం, అలాంటప్పుడు ఇతర స్త్రీల మీద పురుషులు మోహం పెంచుకుంటారు. లేదా వాళ్ళని ఫాంటసైజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ‘సెవెన్ ఇయర్ ఇచ్’ అని కూడా అంటారు. మామూలుగా చాలామంది మగవారు వారి భాగస్వామికి తెలియకుండా ఇలా చేస్తారు. కొంతకాలానికి అదే సర్దుకుంటుంది. అయితే మీవారి విషయంలో ఈ ప్రవర్తన హద్దులు మీరిందంటే అది ఒక మానసిక సమస్యను సూచిస్తుంది. కాబట్టి తనకి పారాఫిలియా’ లేదా ‘కంపల్సివ్ సెక్యువల్ బిహేవియరల్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మీరు బాధపడతారని కొంచెం కూడా తను ఎంపతీ చూపలేకపోతున్నాడు. కాబట్టి, పర్సనాలిటీ సమస్యలు కూడా ఉండి ఉండచ్చు. ఏమైనా మీరు సహనాన్ని కోల్పోకండి. అలాగని ఇంకా ఆలస్యం చేయకండి. ఇద్దరూ కలిసి ఒక మంచి సైకియాట్రిస్టుని లేదా అనుభవం కలిగిన క్లినికల్ సైకాలజిస్టుని సంప్రదించండి. వారు మీ ఇద్దరితోనూ వివరంగా మాట్లాడి, కూలంకషంగా ఆయన్ని పరీక్షించి ఆయనకు ఉన్న సమస్య ఏమిటనేదానిపై ఒక నిర్థారణకు వస్తారు. అప్పుడు అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్, మందులు, ఇతరత్రా సలహాలు ఇస్తారు. తప్పకుండా ఆయనలో మంచి మార్పు వస్తుంది. విష్ యు ఆల్ ది బెస్ట్.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


