చెట్లకు పాదులు చకచకా!

Making Footings For Fruit Trees With Low Cost - Sakshi

కూలీల సమస్యను సులువుగా అధిగమించిన రైతు

రూ. 500 ఖర్చుతో చక్కటి ఆవిష్కరణ

పండ్ల చెట్లకు పాదులు చేయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. చెట్ల చుట్టూ మట్టి కట్టలు వేసి పాదులు చేయటానికి ఎకరానికి ఐదుగురు కూలీలు అవసరమవుతారు. కూలీల కొరత కారణంగా సమస్య తీవ్రంగా ఉండటంతో విస్తారంగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు తమ తోటల్లో చెట్లకు పాదులు చేయించడానికి చాలా రోజుల సమయం పడుతూ ఉంటుంది. అయితే, గుంటూరు జిల్లాలో బత్తాయి సాగు చేస్తున్న ఓ వైద్యుడు చక్కటి ఆవిష్కరణతో ఈ సమస్యకు ఎంతో సులువైన పరిష్కారాన్ని కనుగొన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన డాక్టర్‌ యరగూటి సాంబశివారెడ్డి వృత్తి రీత్యా వైద్యులు. గుంటూరు నగరం అరండల్‌పేటలోని సాయి భాస్కర ఆసుపత్రి సీఈవోగా ఉన్నారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామ పరిధిలో 12 ఎకరాల్లో ఐదేళ్ల వయసు బత్తాయి తోట ఉంది. వీరి తోటలో 20 అడుగులకు ఒక చెట్టు చొప్పున 1300 చెట్లు ఉన్నాయి. అయితే, ప్రతి ఏటా చెట్లు మొదలు చుట్టూతా కూలీలతో పాదులు చేయిస్తూ ఉంటారు. ఎకరానికి 5గురు కూలీలు అవసరం అవుతారు. కూలీల కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి రోజుకు రూ. 900 నుంచి వెయ్యి వరకు చెల్లించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బత్తాయి తోటలో చెట్లన్నిటికీ పాదులు చేయించడం అంటే అది అంత తేలిగ్గా అయ్యేపని కాకుండా పోయింది. ఖర్చుకు ఖర్చే కాకుండా ఈ పనుల పర్యవేక్షణ కోసం చాలా రోజుల సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. 

గొర్రుతో సాలు, ఇరవాలు వేస్తే చాలు 
డా. సాంబశివారెడ్డి ఇటీవల తమ బత్తాయి తోటలో పాదులు చేయించే సమయంలో కూలీల కొరత సమస్యను అధిగమించడానికి గొర్రుతో ఏదైనా ప్రయత్నం చేయవచ్చా అని ఆలోచన చేశారు. ఒకటి, రెండు విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలోనే చక్కటి పరిష్కారం దొరకటంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు.  తన తోటలో ట్రాక్టర్‌ ద్వారా అంతరసేద్యం చేయడానికి ఉపయోగించే ఇనుప గొర్రుకు స్థానికంగా ఉన్న వెల్డింగ్‌ షాపు వారి తోడ్పాటుతో స్వల్ప మార్పు చేయించారు. గొర్రు కుడి వైపున, రెండు వరుసల్లో ఉన్న రెండు గొర్రు పాయింట్లను కలుపుతూ.. 2 ఎం.ఎం. మందం ఉన్న రేకును.. ఏటవాలుగా వెల్డింగ్‌ చేయించారు. ఇంట్లో వృథాగా ఉన్న అడుగున్నర వెడల్పు, రెండు అడుగుల పొడవు ఉన్న రేకును ఇలా వినియోగించారు. ఆ రేకు పటిష్టంగా ఉంటే మన్నిక బాగుంటుందన్న భావనతో దాని కింది భాగాన రెండు అంగుళాల ఇనుప బద్దను వెల్డింగ్‌ చేయించారు. ఈ రేకును మరింత ఏటవాలుగా అమర్చడం కోసం గొర్రుకు ముందు వరుస పైన ఉండే సాడీని కొంచెం లోపలికి జరిపారు. ఆ తర్వాత గొర్రును ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి.. బత్తాయి తోటలో చెట్ల మధ్య సాలు, ఇరవాలు వేశారు. అంతే.. చెట్లకు నలువైపులా మట్టికట్టలతో కూడిన పాదులు ఏర్పడ్డాయి. వర్షపు నీరు చక్కగా ఇంకిపోయేలా కట్టలు తగినంత ఎత్తున ఏర్పడ్డాయి. 

ఒకే ఒక్క రోజులో కేవలం రూ. 500 ఖర్చుతో రేకును గొర్రుకు అమర్చడంతో ఈ ఆవిష్కరణ జరిగిందని డా. సాంబశివారెడ్డి సంతోషంగా తెలిపారు. తమ తోటలో ఒకే ఒక్క రోజులో ఎంతో సులువుగా, అతి తక్కువ ఖర్చుతో బత్తాయి చెట్లకు పాదులు చేయటం పూర్తయిందన్నారు. పాదులు చేయటం పూర్తయిన తర్వాత.. గొర్రులోని రెండు పాయింట్లకు వెల్డింగ్‌ చేసిన ఈ రేకును ఆ పాయింట్లతో పాటు ఊడదీసి దాచి పెట్టుకోవచ్చు. రూ. 200 ఖర్చుతో రెండు పాయింట్లు తెచ్చి గొర్రుకు అమర్చుకుంటే గొర్రును మామూలుగా ఉపయోగించుకోవచ్చు అన్నారాయన. బాగా ముదురు తోటల్లో పెద్ద ట్రాక్టర్‌ నడవని పరిస్థితి ఉంటే.. చిన్న ట్రాక్టర్‌కు ఉండే గొర్రుకు కూడా ఈ విధంగా రేకును అమర్చి.. ఏ పండ్ల చెట్ల చుట్టూతా అయినా పాదులు చేసుకోవచ్చని డా. సాంబశివారెడ్డి (83339 79899) ‘సాక్షి’తో చెప్పారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top