స్ఫూర్తి
ఆమె దివ్యాంగురాలు.. దానికితోడు భర్త మరణించాడు. ఎదిగిన కొడుకు ప్రమాదంలో కన్నుమూశాడు. కష్టపడి పెళ్లి చేస్తే... కూతుర్ని కాస్తా అల్లుడు వదిలేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె మాత్రం జీవితం నుంచి పారిపోలేదు.. వైకల్యాన్ని ధైర్యంగా ఎదిరిస్తూ.. పెయింటింగ్ పనులను గుత్తకు తీసుకుని శెభాష్ అనేలా పని చేయిస్తోంది. ఆమే కరీంనగర్‌లోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ములిగె బాలవ్వ.
బాలవ్వ పుట్టినిల్లు సిరిసిల్ల. గోపాల్‌రావుపల్లెకు చెందిన శంకరయ్యతో 40 ఏళ్ల కిందటే పెళ్లి అయింది. భర్తతో పాటు సున్నం వేసే పనికి వెళ్లేది. బాలవ్వ, శంకరయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక్క కొడుకు, ఒక బిడ్డ. భర్తతో కాపురం సాగుతుండగా.. శంకరయ్య గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఆమెను కుంగదీసినా.. కుటుంబ భారాన్ని మీదేసుకుని భర్త చేసిన పనిలోనే కొనసాగుతూ.. పెయింటింగ్ పనిలో చేరి కొడుకు నాగరాజు, కూతురు సంధ్యలకు పెళ్లి చేసింది.
→ వెంటాడిన విధి..
పెయింటింగ్ పని చేస్తూ.. జీవిస్తున్న బాలవ్వను విధి వెంటాడింది. పని చేసే చోటి నుంచి కింద పడడంతో కాలు విరిగి దివ్యాంగురాలైంది. అయినా సరే, కుంగిపోలేదు. మెతుకువేటలో.. బతుకుబాటలో మళ్లీ పెయింటింగ్ పని చేపట్టింది. ఇంతలో కొడుకు నాగరాజు సెంట్రింగ్ పనిలో ఉండగా ప్రమాదవశాత్తూ కింద పడి తలపగిలి మరణించాడు. నాగరాజు భార్య, ఇద్దరు పిల్లలు ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. వాటిని అధిగమించి వారు ఇప్పుడు వేరుగా జీవిస్తున్నారు. కూతురు సంధ్యను ఖమ్మం ఇవ్వగా.. అతను ఆమెను వదిలేయడంతో సంధ్య ఒంటరిగానే ఉంటోంది. ఇన్ని సమస్యల మధ్య బాలవ్వ మాత్రం మొక్కవోని ధైర్యంతో తనకున్న చిన్న ఇంట్లో ఒంటరిగానే జీవిస్తూ.. నిత్యం పెయింటింగ్ పని చేస్తూ.. కష్టాలను ఎదురిస్తోంది.
→ కష్టమైన పనిలో రాణిస్తూ...
పెయింటింగ్ పని చాలా కష్టంగా ఉంటుంది. భవనం పైకి ఎక్కాలి.. జోలె కట్టుకుని రంగులు వేయాలి. అయినా భయపడదు.. పెద్ద ఇళ్ల పనులను కాంట్రాక్టు తీసుకుంటూ.. ఇతర లేబర్లను తోడుగా తీసుకెళ్తూ... పనిని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తుంది. దివ్యాంగురాలైన బాలవ్వకు ప్రభుత్వం ఆరు నెలల కిందట మూడు చక్రాల ఈ–బైక్ ఇచ్చింది. ఆ బైక్‌పై ప్రయాణం చేస్తూ... ఉపాధి పొందుతుంది.
మంచి రోజుల్లోనే పని ఎక్కువగా ఉంటుంది
దసరా నుంచి ఉగాది వరకు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న రోజుల్లో పని చేతినిండా ఉంటుంది. ఇతర రోజుల్లో అందుబాటులో ఉన్న పనులు చేస్తూ.. ΄పొట్టపోసుకుంటా. నాకు ప్రభుత్వం ద్వారా చేయూత పెన్షన్ నెలకు రూ.4వేలు వస్తుంది. ప్రభుత్వం ఈ–బైక్ ఇవ్వడంతో నా కష్టాలు కొంత తీరినయి. నేను పనిని గుత్త(కాంట్రాక్టు) తీసుకుని ఓ నలుగురికి పని కల్పిస్తూ.. జీవనం సాగిస్తున్నా... కాలు మంచిగ లేకున్నా.. తోడు ఎవరూ లేకున్నా... పని చేస్తూ బతుకడమే జీవితం.
– ములిగె బాలవ్వ, దివ్యాంగురాలు
– వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ రాజన్న సిరిసిల్ల
– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్,
స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిరిసిల్ల


