
స్వల్ప ఆయువు
ధృతరాష్ట్రుడు విదురుడితో మాట్లాడుతూ ‘మనుషుల ఆయువు వంద సంవత్సరాలైనా అతి తక్కువ మందే వందేళ్ళు జీవిస్తున్నారు. ఎక్కువ మంది వందేళ్ళ లోపే మరణిస్తున్నారు. ఎందుకు? దీని గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు’ అన్నాడు.
అందుకు విదురుడు, ఆరు అంశాలే మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నా యన్నాడు. అవి – అహంకారం, అదే పనిగా వాగుతూ ఉండటం, త్యాగ గుణం లేకపోవడం, కోపావేశాలు, స్వార్థబుద్ధి, మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం! ఏ విధంగా చూసినా ఈ ఆరూ ఎవరికీ మంచివి కావన్నాడు. ‘నేనే గట్టివాడిని, నేనే ధనవంతుడిని, నేనే దాతను, నేనే మంచివాడిని, ఇతరులు దుష్టులు’ అని అనుకోవడంతో గర్వం తలకె క్కుతుంది. గర్విష్టిని భగవంతుడు శీఘ్రమే అంతం చేసేస్తాడు. కనుక గర్వం లేకుండా ఉండటానికి తన లోని లోపాలను, తప్పులను చూసుకోవాలి. అదేపనిగా మాట్లాడేవాడు అనవసరమైన విషయాలను గురించి మాట్లాడి లేని పోని కయ్యాలకు కాలుదువ్వుతాడు. అందుకే పరమాత్మ భగవద్గీతలో ‘పరుషమైన మాటలు మాట్లాడకపోవడం మంచిది. నిజమైనది ఏదో, ప్రియమైనది ఏదో, మంచిది ఏదో తెలుసుకుని మాట్లాడాలి’ అన్నాడు.
అన్నింటినీ మనమే అనుభవించాలనే ఆశ వల్ల మనలో త్యాగం చేయాలనే ఆలోచన పుట్టదు. ‘మనం ఈ ప్రపంచంలో పుట్టిందే మన కోసం కాదు, ఇతరులకు సాయం చేయడానికే’ అని తెలుసుకుంటే త్యాగ గుణం అలవడుతుంది.
మనిషికి ప్రథమ శత్రువు కోపం. కోపాన్ని జయించిన వాడే యోగి. అతనే ప్రపంచంలో సుఖపడతాడు. ఎవరు చెడు చేసినా ఎవరు మనల్ని కోపగించుకున్నా వాటిని సహించడం అలవాటు చేసుకోవాలి. స్వార్థమే అన్ని చెడులకూ కారణం. దీని నుంచి ఇవతలకు రావాలంటే మనలో మానవత్వం రవ్వంతైనా ఉండాలి. ఇక చివరగా, మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం ఏ విధంగానూ సబబు కాదు. భగవంతుడు గీతలో చెప్పినట్లు అందరితోనూ మంచిగా ఉండాలి. ద్రోహచింతన తగదు. కరుణ ఉండాలి.
– యామిజాల జగదీశ్